Posts Tagged ‘విద్య’

తన విద్యార్ధులకు ఏం చెప్పాలి

09/09/2008

 

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్న స్కూలు ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖ.

మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి. శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు సంతోషించాలనీ నేర్పించండి. అసూయకు దూరంగా వుండడం, నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి. సోమరిపోతులు ఆశపోతులనే విషయం అతనికి తొందరగా తెలియజెప్పండి. వీలుంటే పుస్తకాలలోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చని కొండచరియల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి.

మోసం చెయ్యడం కంటే విఫలమవడంలోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి. ప్రతివొక్కరూ తప్పు అని చెప్పినాసరే తన స్వంత ఆలోచనలమీద విశ్వాసముంచాలని అతనికి తెలియజేయండి. ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలనీ, దుండగులతో కఠినంగా వ్యవహరించాలనీ నేర్పించండి. అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలసిపోకుండా వుండగలిగే శక్తిని సంపాదించుకోమనండి. ఎవరు చెప్పినా వినాలనీ, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తరువాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. మీకు వీలయితే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ వుండగలగడం నేర్పించండి. అయితే కన్నీళ్ళు పెట్టుకోవడానికి సిగ్గుపడ నక్కరలేదని చెప్పండి. తప్పులెన్నేవారిని లెక్కచేయకూడదనీ, తియ్యటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా వుండాలనీ తెలియ జెప్పండి. శరీర దారుఢ్యాన్నీ, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలనీ, అయితే హృదయానికీ, ఆత్మకూ మాత్రం ఎన్నటికీ వెలకట్టగూడదనీ అతనికి తెలియజేయండి. అల్లరి మూకల కేకలు చెవినిపెట్టకుండా , తన ఆలోచన సరియైనదైతే నిలబడి పోరాడాలని నేర్పించండి. సున్నితంగా బోధించండి గానీ గారాబం చెయ్యవద్దు. కాల్చినప్పుడేకదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా వుండడంలో గల సాహసాన్ని గుర్తించమనండి. ధైర్యశీలికి కావలసిన సహనాన్ని అలవరచుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగివుండాలని బోధించండి. అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు.”

ప్రకటనలు