3. సామాజిక స్పృహ వ్యక్తివాదం కాదు

పాలకవర్గం పరిధిలో ఉండి ఆలోచించే సాహితీ వేత్తలు చిత్రవిచిత్ర వాదనలు ముందుకు తెస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటివాళ్ళు పీడక సాహిత్య లక్షణాల్నికరదీపాలుగా ర్రహించి పీడిత ప్రజలకు పరిష్కారాలు సూచిస్తూ కవి సమాజానికి అతీతుడు ,శాసనకర్త, సర్వస్వమును అని ప్రతిపాదిస్తున్నారు.

ఇంకా కొంచం ముందుకు పోయి కవి ఆధిక్యతా భావాన్ని ఒక వాదంగా ముందుకు తెచ్చే కవిసేన ను ప్రచారం చేస్తూ మానవ సమస్యల్ని కవులు మాత్రమే పరిష్కరించగలరనే భ్రమల్ని సుస్తిరం చేస్తున్నారు. దీనితో పాటు రాజకీయం జీవితములో ఒక భాగమే గానీ రాజకీయమే జీవితం కాదని సూత్రీకరిస్తున్నారు. ఎంతవరకయితే రాజకీయాలు ప్రజాపరంగా నిర్ణయం కావో అంతవరదాకా జీవితం బాధా విముక్తం కాదనే సామాజిక సత్యాన్ని శేషేంద్రశర్మ గారు గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ కవి పుట్టించిన చోటే పుట్టిన మరుక్షణంలోనే మరణాన్ని వరంగా వరిస్తున్నాడు.

ఈ వరసలోనే ఏనాడో కాలగర్భంలో కలసిపోయిన సౌందర్య వాదాన్ని కళ కళకోసమనే ఆయన వాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇస్మాయిల్ కవిగారు మానసికానందం కోసం కవిత్వం అంటారు. మానసిక ఆనందం అనేది వ్యక్తి అనుభవించే జీవితాన్నిబట్టి నిర్ణయింపబడుతుందనే చేదు నిజాన్ని వారు గుర్తించడంలేదు.

పెట్టుబడిదారీ సమాజపు వికృత అస్తవ్యస్త స్థితిని చూసి జీవితం చాలా అడ్డదిడ్డంగా ఉందనే అంశాన్ని చాటడానికి నగ్నముని లాంటి కేవలం ప్రయోగవాదులు విలోమ కవితలు అనే భ్రమల్ని ముందుకు తెస్తున్నారు. కవిత్వంలో తిర్యక్కులు వీళ్ళు.

వర్గ పోరాటాల విస్తృతిలో ప్రజలు ఒక స్పష్టతను కోరే తరుణంలో స్పష్టంగా బయటపడి చెప్పే ధైర్యం లేక అవగాహన లేక ప్రజలతో తాదాత్మ్యం చెందే ఆత్మ వికాశం లేక కవి అహంకారియై ప్రజల్నుండి వేరుపడే ప్రయత్నంలో ప్రయోగవాదాన్ని స్వీకరిస్తాడు. ఇదివరకు పట్టాభి, ఆరుద్రలు అలాంటి సర్కస్ ఫీట్లు చేశారు. అందులోని ఆరవ వేలే విలోమ కవిత .ఇది పెట్టుబడిదారీ సమాజపు అమ్మకాల ఆకర్షణ . దోపిడీ గాళ్ళ సేల్స్ మన్ షిప్.

ప్రక్రియా వాదాన్ని సాహిత్యోద్యమంగా తెచ్చిన ప్రవక్తలు సంక్షుభిత సమాజంలో పరిష్కర్తలుగా ముందుకు వస్తున్నారు. సాహిత్య ప్రమాణాలు రూపాలు , శిల్ప బేధాలు , వస్తు విశేషాలు మారే సమాజాన్ని బట్టి అభివృద్ధి చెందుతాయి.

పద్యం ఫ్యూడల్ సమాజపు నియమాల్ని చాటిన నిలయ విద్వాంసుని గాత్ర విశేషం. అందువల్ల పద్యం ఛందో రూపాన్ని మార్చినంత మాత్రాన కవిత్వం ఆధునికమైపోదు. ఆధునిక జీవిత అభివ్యక్తి సౌలభ్యం కోసమే పద్యం ముక్కచెక్కలై గేయంగానూ , గేయం చెడి వచిన కవిత్వం గానూ అభివృద్ధి చెందింది. ఈ సామాజిక అంతస్సూత్రాన్ని విడిచి కేవలం వచన కవిత్వం రాస్తే ఆధునిక జీవిత చిత్రణకు సంబంధించిన సాహిత్య ప్రయోజనం సమకాలీన సమాజంలో నెరవేరదు. వచన కవిత్వం ప్రక్రియనే ఒక ఉద్యమంలో స్వీకరించిన కుందుర్తి గారు ఈ సత్యాన్ని అంగీకరించడంలేదు. వస్తువు ప్రయోజనం చాల ప్రధానం – అలా అని ఆధునిక వస్తువును ప్రాచీన రూపంలో రాస్తే (పద్యం చెబితే) అంతగా ప్రయోజనం నెరవేరదు.

ఈ వర్గసమాజం వస్తువు “ ( content )కు రూపానికి” ( form ) ఒక వైరుధ్యాన్ని తెచ్చిపెట్టింది – పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల శిల్ఫ వైభవాన్ని పెంచి , వస్తువును దిగమింగే ప్రయోగవాదం ఒక వైపు విజృంభిస్తున్నది. – మరొక వైపు వస్తువును నినాదప్రాయం చేసే అవాస్తవిక దృష్టి విస్తరిస్తుంది. నిజమైన ప్రజా కవిత్వం ఇటు వస్తువుకు, అటు రూపానికీ సమన్వయం సాధిస్తుంది. – అది అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకులైన ప్రజల ప్రయోజనాల్ని చాలా స్పష్టంగా శాస్త్రీయంగా అంగీకరించినప్పుడే సాధ్యపడగలదు.అందుకే ఉద్యమాల రోజుల్లోనే మంచి కవులు పుడతారు.తిరిగి వారు ఉద్యమాల ఊపిరి కాపాడుతారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: