జనవరి 2009ను భద్రపఱచు

తెలుగు కవిత – సామాజిక స్పృహ 2

23/01/2009

2. మార్పును గుర్తించిన ద్రష్టలు

ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో క్రాంత దర్శులు గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన  కన్యక బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి కోటల్ని నేలమట్టం చేశారు. రాచరికాల అనివార్య పతనాన్ని ప్రజాస్వామిక యుగారంభాన్ని చాల సహజ పరిమాణంగా యుగచైతన్యంతో చెప్పిన స్రష్ట గురజాడ అప్పారావు – అందుకు వారి కన్యక కావ్యం మకుటాయమానం.

సామాజిక స్పృహ ను రాజ్యాధికారుల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చాటినా – గురజాడ వారు పూర్తిగా సాంప్రదాయ పట్టులోంచి బయటపడలేదనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వారు సూచించిన పాతకొత్తల మేలు కలయిక అభివృద్ధిచెందే సమాజానికి ఎంత ప్రతిబంధకమో నిర్మొహమాటంగా ఆలోచించాల్సివుంటుంది.

అందువల్ల సామాజిక స్పృహ  అనేది నిత్య నూతనంగా అభివృద్ధి చెందే అభ్యుదయ సూచిక అని కొంతవరకు మాత్రమే పోయి ఆగిపోయే పోటీ యత్నము కాదు.

దారిపక్క బిచ్చగత్తెలు , రాక్షసరతి   లో నలిగే పడుపుగత్తెలు, సమ్మెగట్టే కూలీలు, కూలీల భార్యలు , ఉరికంబాలకు వేలాడే ధీరులు కావ్యవస్తువులుగా గ్రహించిన అభ్యుదయ కవిత్వం , దగాపడిన తమ్ముళ్ళందరినీ పదండి ముందుకు అని విప్లవ శంఖం పూరించింది. తెలుగు కవిత్వంలో ఈనాటి సామాజిక స్పృహ  ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకుంది.

మొట్టమొదటి సారిగా సామాన్యుని మాన్యుగా చేసిన సాహిత్యోద్యమం    అభ్యుదయ కవిత్వం . అయితే కవి తనకు తానుగా సాధించిన నూతన విషయం కాదనేది కూడా గుర్తించాలి. దాన్ని కవి చేసిన అద్భతంగా మాత్రమే గుర్తిస్తే అభివృద్ధి చెందే ప్రజల నిర్ణయాత్మక పోరాట శక్తిని నిర్లక్ష్యం చేసిన వారలం కాగలం. అలా చారిత్రక పరిణామాల్ని వర్గ పోరాటాల విజయాల ద్వారా ముందుకు తెస్తున్న ప్రజల్ని గుర్తించడంలో కవి కృతకృత్యుడైనాడనేది సత్యం. కానీ కవి మాత్రమే పోరాట సత్యాన్ని సృష్టించాడనేది అసత్యం. ఈ వివేచనా లోపం వల్లనే కొందరు కవులు శాసకులుగా ప్రజల మీద స్వారీ  చెయ్యడానికి సాహసిస్తున్నారు. కవి అహంకారి కాదు.

కవి నడుస్తున్న చరిత్రలో వెలుగులు చూస్తాడు. కాబట్టే అతడు క్రాంతదర్శి. ఈ క్రాంత దర్శిత్వం చూసే నిత్య వికాసమే     సామాజిక స్పృహ . ఇది దినదిన ప్రవర్ధమానమయ్యే ఆత్మ చైతన్యం. అభ్యుదయ కవితా ఉద్యమం , మార్పును సంస్కరణ వాదానికి ముడివేసి ఊరుకుంది. వ్యవస్థను సమూలంగా మార్చకుండా కొన్ని సంస్కరణల్నిలక్ష్యిస్తే సరిపోదు. నలుగురు కలసి పొరుపులు మరచీ చేయాలి ఉమ్మడి వ్యవసాయం అనే రాజకీయ కార్యక్రమ నినాదం ఎలాంటి సంస్కరణ వాదాన్ని సూచిస్తుందో పరిశీలించండి. భూముల పంపకం కాకుండా ఉమ్మడి వ్యవసాయం   అనేది నెహ్రూగారి గమ్మత్తు. దానికి కవి బలికారాదు. వ్యవసాయ విప్లవం మాత్రమే రైతు సోదరులకు న్యాయం చేస్తుంది.

అందువల్ల సంస్కరణలు కూడా సమాజం సమూలంగా మారే విప్లవ క్రమంలో భాగం కావాలి గానీ , విప్లవాన్ని గల్లంతు చేనే కార్యక్రమాలు కారాదు. అందుకే సంస్కరణవాదం సర్వరోగ నివారిణి కాదు. అది దారి తప్పించే రాజకీయ వ్యూహంలో దానికి కవి బలికారాదు.  అభ్యుదయకవి బలి అయినాడు.

సంస్కరణలద్వారా సామాజిక సమస్యలు పరిష్కరింపబడతాయనే భ్రమల్లో ప్రజలు లేరు. సంస్కరణవాదానికి కాలం చెల్లి పోయింది. ఇది సమాజం సమూలంగా మారాలనే విప్లవాల యుగం. అమెరికా ప్రపంచవ్యాప్తంగా పోరాటాల విస్తృతి కొనసాగుతుంది. పరాయి పాలనలో మగ్గుతున్న దేశాలు ( ఆఫ్రికా ) స్వాతంత్ర్యాన్ని కోరుతూ  తెగించి పోరాడుతున్నాయి. అలాగే పీడిత జాతుల విముక్తి కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అభివృద్ధి చెందిన ఈ ప్రపంచ నైజాన్ని నేటి కవి గుర్తించి తన సామాజిక స్పృహ ను నిత్యనూతనంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడంలో అభ్యుదయ కవి విఫలం అయ్యాడు. కాబట్టే విప్లవకవి తెలుగు సాహిత్యానికి అవసరం అయ్యాడు.. ఈ విధంగా అభివృద్ధి చెందిన కవి తిరిగి సంక్షోభానికి గురై ప్రజలు మాత్రమే విప్లవాన్ని తద్వారా సమూలమైన మార్పును తెస్తారనే నైజాన్నికొందరి వీరుల సాహస చర్యగా భావించి విప్లవ బాధ్యతారంగాన్ని సంకుచితం చేశాడు.

అందువల్ల సామాజిక స్పృహ అనేది వ్యక్తి చైతన్యమే కాదు సమాజ స్పందన కూడా. తనలో తాను అభివృద్ధి చెందుతూ , అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకపు ప్రపంచంతో తాదాత్మయం చెంది ముందుకు పోయే పోరాట నైజాన్ని గుర్తించాలి. తాను ముందుకు పోతూ ముందుకు పోయే సమాజాన్ని పట్టుకోవాలి.

ప్రకటనలు

తెలుగు కవిత – సామాజిక స్పృహ

22/01/2009

ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో సామాజిక స్పృహ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి సోషలిజం మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా  వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.

సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల వత్తిడి. రెండవది అందులో దూరి దాన్ని లేకుండా చేయటం.

భౌతిక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధాన్ని వైదికులు దశావతారాల్లో చేర్చి బుద్ధుణ్ణి విష్ణువు అవతారంగా జమ కట్టేశారు. ఆ తర్వాత బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా సర్వనాశనం చేశారు. అంతే క్రూరంగా చార్వాకుల్ని నేలమట్టం చేశారు. 

రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాజానుగుణంగా ఉండాలనేది ప్రజలు ముందుకు తెచ్చిన నైజం. దీన్నీ అంగీకరిస్తున్నట్లు అభినయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ అనే మాటను పాలకులు యధేచ్చగా వాడుతున్నారు.

నిజానికి ఈ మాటకు నిర్వచనం ఏమిటి ? అభివృద్ధి చెందుతున్న సమాజం గురించి పట్టించుకొని దానికి న్యాయం చెయ్యడం. మళ్ళీ ఇక్కడ ఏ అభివృద్ధి అనేది వస్తుంది. బిల్డింగులా? అధికారాలా? ప్రణాళికలా? పదవులా? లేక ప్రజల ఆశయాలా?

మార్పును కోరే శక్తులకు మార్పును ప్రతిఘటించే శక్తులకు సమాజంలో వివిధ స్తాయిల్లో ఘర్షణ తప్పదు. ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజల శ్రేయస్సును కాంక్షించటమే సామాజిక స్పృహ . ఇది కూడా నిరంతరం అభివృద్ధి చెందే పోరాట నైజం. దీనికనుగుణంగానే అన్ని రంగాల్లో సాపేక్షికంగా అభిప్రాయాలు  ప్రచారం అవుతాయి.

ఈ సామాజిక స్పృహ కొత్త విషయమా?

సామాజిక స్పృహ అనేది పత్రికలు , మేధావులు , రాజకీయ నాయకులు సృష్టించిన కొత్తమాటా? కాదు – ఏదో ఒక రూపంలో ఈ భావం అనాదిగా కొనసాగుతున్నదే.

ఎవరైతే సామాజిక ఉత్పత్తి సాధనాల్ని  స్వాధీనం చేసుకున్నారో వారే జీవితానికి సంబంధించిన సమస్త విషయాల్ని శాసించారు. ఆర్ధిక ప్రయోజనాల్ని బట్టే , సారస్వతం, తాత్వికసూత్రాలు, మతనియమాలు, లలితకళలు నిర్వచించబడి పోషింపబడతాయి. వీటినే సంప్రదాయం క్రింద పెద్దలు ప్రచారం చేస్తారు.

నన్నయ్యగారి భారతాంధ్రీకరణలో అక్షరరమ్యత ఎంత ఆకర్షణీయంగా పండితులకు కన్పించినా అది రాజరాజనరేంద్రుడు కోరిన  జగద్ధితంబు గా విరాజిల్లిందనేది దాచేస్తే దాగని సత్యం. అధిక సంఖ్యాకులైన పదకొండవ శతాబ్దపు తెలుగు ప్రజలు ,  వేదాల ప్రామాణికతను  తిరస్కరించే జైన బౌద్ధాల వెంటపడిపోవడాన్ని అరకట్టడానికి వైదికమత పునరుద్ధరణకు మాత్రమే భారతాంధ్రీకరణ జరిగిందనేది చారిత్రక సత్యం .

వైష్ణవులు, శైవులూ తగాదా పడుతూ వుంటే జైనబౌద్ధాలు విజృంభించి వైదికమతం నేలమట్టం అవుతుందనే భయం వల్ల తిక్కన  హరిహరనాధతత్వాన్ని  నాటి తెలుగు సమాజానికి తరుణోపాయంగా సూచించారు. దీనితో పాటు భారతాంధ్రీకరణ శేషభాగాన్ని  నాటకీయత  అనే శిల్పంతో పూరించాడు.

సామాజిక శక్తుల ఆర్ధికావసరాలకు భిన్నంగా ఏ సాహిత్య ప్రమాణాలూ రావు – వచ్చినవన్నీ ప్రజలకనుకూలంగా ఉండవు. సాహిత్య కళా రూపాలూ అంతే. కావ్య శోభకు, కళారూపానికీ , శబ్దసౌందర్యానికి భ్రమపడి సాహిత్య ప్రయోజనం ఏ విషయంలో పొరలు కారాదు.     

ప్రబంధ యుగంలో రాజుల్ని , రాచరికాల్ని,వైభోగాల్ని, ఉంపుడుగత్తెల్నీ పొగడటానికే అష్టాదశ వర్ణనల  క్రింద భ్రష్ట శృంగారం వచ్చిందనేది సత్యం. ఇది మంచపుతాళ్ళు తెగేదాకా పోయింది. ఈ వికృతానికి రోసే కందుకూరి వారు  సరస్వతీ నారద సంవాదం  లో ప్రాచీన కవుల ఇంగితాన్ని ప్రశ్నించారు. శతక కవులు అందునా వేమన మాత్రం అధిక సంఖ్యాకుల ప్రయోజనాన్ని లక్ష్యించి ఒక తిరుగుబాటు వేదాంతాన్ని స్పష్టాస్పష్టంగా ప్రబోధించారు.

సాహిత్య ప్రమాణాలు

ప్రాచీన లక్షణ గ్రంధాలన్నీ రాచరిక వ్యవస్తనూ, చాతుర్వర్ణ ధర్మాన్ని, తద్వారా  శ్రమ దోపిడిని                                                                       సుస్థిరం చేయటానికి అభివృద్ధి చెందాయనేది కూడా నిష్టుర సత్యం . ధీరోదాత్తుడు, ధీరోద్ధాతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు – అనే కావ్య నాయకులు చాతుర్వర్ణ ధర్మ ఔన్నత్య వికాసానికే రూపొందించబడ్డారు. మూడు పాత్రలు క్షత్రియులకైతే ఒకటి ధీరశాంతుని పాత్రను బ్రాహ్మణుడికి కేటాయించారు. సామాన్యుడు, జాలరి, చాకలి, రైతు , వివిధ వృత్తుల వాళ్ళువారి సుఖ దు:ఖాలు కావ్య పరిధిలోనికి రానేలేదు. ప్రబంధ యుగాలలోని అష్టాదశ వర్ణనలలో ముఖ్యంగా పుర వర్ణనలో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, రైతు ఎలా వున్నారనేది చెప్పబడలేదు. చెప్పబడింది కూడా ఆ పై వర్గాల  చట్రం లోని ఎంగిలే. ( కళా పూర్ణోదయం లోని సుగాత్రీ – శాలీనుల గాధ, ఆముక్తమాల్యద లోని పురవర్ణన. )

రామాయణంలోని వెట్టి చాకిరీ సేవిక మంధరఆమె వరాల్ని కైకమ్మకు గుర్తు చేస్తే – ఆమెను నీచురాలిగా చూపబడింది. అలాగే చివర రాముడూ, సీతా విడిపోవడానికి చాకలివాడి ఆరోపణ కారణంగా చూపబడి – చాకలివాడు నిందాస్తానంలోకి నెట్టబడ్డాడు. భారతం లోని ఏకలవ్యుడి గాధ – రామాయణం లోని శంభూక వధ హేతుబద్ధంగా ఆలోచించవారికి తాపం కలిగించే సన్నివేశాలు. – వీటన్నిటినీ పరిశీలిస్తే తేలే అంశం ఏమిటి? సాహిత్యం అనేది సమాజానికి భిన్నం కాదు.  ఎవరైతే సమాజాన్ని శాసిస్తుంటారో వారే సాహిత్యాన్ని కూడా శాసిస్తారు. వీటికి తిరుగుబాటుగా కూడా సాహిత్యం ఉంటుందా? ఉంటుంది. కాబట్టే ఈ దేశములో బౌద్ధుల సాహిత్యం నాశనం చేయబడింది. పాలకులు పాలితుల సాహిత్యాన్ని మననీయరు. అందుకే బౌద్ధసాహిత్యం మంటగలిసింది.

మన సాహిత్యం లోని  రస సిద్ధాంతమే  ఒక ప్రశ్నార్ధకం అది పై వర్గాల మానసిక అనుభూతుల్ని తెలియజేసే భావనా సంవిధానం. అక్కడ రాజు లేక రాణి గార్ల దు:ఖమే కరుణరసం. కానీ సేవకుల శోకం కరుణరసం కాదు. అలాగే శృంగారం, హాస్యం, వీరం, వగైరా నవరసాలు తమకు న్యాయం జరగాలని తెగించి పోరాడిన ప్రజల సుఖదు:ఖాల వర్ణన ఇటీవలి దాకా నవరసాల క్రిందికి రాలేదు. పల్నాటి వీర చరిత్ర  పై వర్గాల సాహస చరిత్ర . శ్రీనాధుడు రాచరికాల ఆస్థాన కవి. పోతన కొంత మినహాయింపు.

సత్యం, శివం, సుందరం అనే సాహిత్య ప్రమాణం కూడా వర్గ నైజమే. చాతుర్వర్ణ విధానానికి సంబంధించిన గాధాసత్యమే  సత్యం  , దాన్ని అందంగా చెప్పటమే  సుందరం  , తద్వారా ఆ వ్యవస్థ కొనసాగించడమే   శివం . ఈ పాక్షిక మంగళం జాతికి ప్రయోజనకరంగా నిలవలేదు. మన సాహిత్యమంతా అధికారపక్ష నియంతృత్వాన్నే వేనోళ్ళ చాటుతుంది.

వీటన్నిటినీ కాదని పెరిగిన ప్రజల సుఖదు:ఖాల పోరాటాల వర్ణనలుగా వచ్చిన  జానపద సాహిత్యం మీద కూడా పైవారల ప్రభావం ఉంది. ఏవర్గం అయితే సమాజాన్ని శాసిస్తుందో ఆవర్గం ప్రభావంలోనే జీవన రంగాలన్నీ బందీ అవుతాయి. ఆ మేరకే జానపద సాహిత్యం కూడా ఇటీవల అభివృద్ధి చెందింది.  ఎంకి నాయుడుబావ  లాంటి జానపద నాయికా నాయకులు , ఆధునికరూపం పొందిన ప్రబంధ నాయకులనేది గ్రహించాలి. వారి భావానుభావ వ్యభిచారీ భావాలు నిజంగా శ్రమైక జీవనం గడిపేవారి సుఖదు:ఖాలు కావు. పై వారి అనుకరణలుగా చేయబడిన క్రింది వారి జీవన విరోధాభాసాలు.

ఈ క్రమం లోంచే భావ కవిత్వం దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని  మరిపించేంత వికారంగా   నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు గా విరాజిల్లింది. ఈ కవుల శృంగార వారసత్వం వ్యాధి నుండి బయటపడలేదు. ఇలా మన వాదాన్ని జీవన సిద్ధాంతంగా స్వీకరించి అభివృద్ధి చెందే సమాజం  నుండి వేరుపడి…………………..జ్వాలాముఖి ఉపన్యాసం


పని చేసిన వాడికి చెల్లించవలసిన డబ్బులో కొంత మిగిల్చుకోవడం

 


  

 [v1]వస్తువులు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు మొదలగునవి.

 

జ్వాలాముఖి

20/01/2009

సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.

జ్వాలాముఖి – జీవిత విశేషాలు :

జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల ఆవరణలో 1938 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. అదే కోవెల ఆవరణలో వేద పాఠశాల , సంస్కృతాంధ్రాలు బోధించే పాఠశాల ఉండేవి. కవి పండితులు వచ్చివెడుతుండేవారు. సాహిత్య సమాలోచనలు జరుగుతూండేవి. నిజాం రాజ్యములోని ఆంధ్ర మహాసభ నాయకులు ,ప్రముఖులూ అనేకులు వచ్చి ప్రసంగాలు చేస్తుండేవారు. అక్కడికి రంగాచారి అనే కమ్యూనిష్టు కార్యకర్త రహస్యంగా వచ్చిపోతూండేవాడు. ( తర్వాత కాలంలో ఈయన అన్న కూతురునే జ్వాలాముఖి వివాహమాడారు ) ఈయన్ను యూనియన్ మిలిటరీ తీవ్ర చిత్ర హింస లకు గురిచేసి కాల్చేసింది. ఆయన మరణవార్త జ్వాలాముఖి పై ప్రభావం వేసింది.

ప్రముఖ విప్లవ కవి , పౌరహక్కుల నాయకుడు ఎ.టి.ఖాన్ జ్వాలాముఖికి బాల్యం నుండి మంచి మిత్రుడు. మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో , నాంపల్లి హైస్కూలులో , నిజాం కాలేజిలో జ్వాలాముఖి చదువుకున్నారు.

ఒకవైపున కఠిన ఆచార సాంప్రదాయాల శ్రీవైష్ణవ కుటుంబ వాతావరణం, మరోవైపు కటిక పేదరికం వీటినడుమ జ్వాలాముఖి జీవితం గడిచింది.  1958లో జ్వాలాముఖి మనిషి అనే దీర్ఘ కవితను రాసి కరుణశ్రీ ప్రశంశలు పొందాడు.

దిగంబరకవిగా ,విప్లవ కవిగా సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షించాడు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూండిన జ్వాలాముఖి  1965 నుండి దిగంబరకవిగా నిఖిలేశ్వర్, చెరబండరాజు, నగ్నముని వంటి వారతో కలసి కవితాసంపుటాలు ప్రచురించారు. వీరు వి.ర.సం. గా ఏర్పడిన తర్వాత వీరిని 1971లో పి.డి. చట్టం క్రింద  50 రోజులు ముషీరాబాద్ సెంట్రల్ జైలులో  నిర్బంధించారు. ఈయన ప్రత్యేక తెలంగాణా వాదాన్ని తిరస్కరించాడు. ఈయన భారత చైనా మిత్రమండలికి రాష్ట్ర కార్యదర్సి గా పనిచేశాడు. రెండు సార్లు చైనా దర్శంచాడు.

లౌకికవాదిగా :

హైదరాబాదు నగరం హిందూముస్లీం మతస్తులతో , తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ,మార్వాడీ, లోఢీ తదితర జాతుల తెగలతో కూడివుంటుంది. ఒకరకంగా అదొక మినీ ఇండియా లాంటిది. పాతబస్తీలో పుట్టిన జ్వాలాముఖికి హిందీ సాహిత్యమూ, ఉర్దూ భాషలలో కూడా మంచి ప్రవేశముండటము, బాల్యస్నేహితులు, సాహిత్య సామాజిక సంబంధాలుండటం వల్ల మతకలహాలు చెలరేగినప్పుడల్లా వాటిని శాంతింపజేయడానికి , బాధితులను ఆదుకోవడానికి మిత్రుల సహకారంతో కృషి సల్పటం ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హిందూ ముస్లీముల ఐక్యతకై నిరంతరం కృషిచేశారు. 2002లో గుజరాతులో ఘోరాలు జరిగినప్పుడు మన రాష్ట్రం నుండి గుజరాత్ రాష్ట్రాన్ని పర్యటించివచ్చిన 28 మంది రచయితలు,కళాకారులలో జ్వాలాముఖి ఒకరు.  ఆయన హిందూత్వ మతోన్మాద శక్తుల తాత్విక డొల్ల తనాన్ని ఎండగట్టటానికి పురాణ గ్రంధాలనుండి సంఘటనలను, ప్రతీకలను తీసుకొని వివరించేతీరు సభికులను మిక్కిలి ఆకట్టుకునేది. జ్వాలాముఖి మరణం లౌకిక వాద శక్తులకు తీరనిలోటు.

నిరాడంబరంగా జీవించడం, కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలను నెలకొల్పటం, కొడుకులు ముగ్గురికీ కులాంతర మతాంతర వివాహాలు జరిపించటం, .. ఆయన ప్రజాస్వామిక తత్వానికి నిదర్శనం. వ్యవస్థ కల్పించే ప్రలోభాలకు గురి కాకుండా … అవార్డులూ, హోదాలకు, పదవులకూ ఆశపడకుండా ,కెరీరిజానికి లోనవకుండా జీవితం సాగించిన  విశిష్ఠ  వ్వక్తిత్వం జ్వాలాముఖిది.