జూన్ 2007ను భద్రపఱచు

టీచర్ల సమస్యలు

23/06/2007

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని   తీర్పు ఇస్తూ ఆ జీవోలు ( 505, 538 ) కొట్టివేసింది. ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్ర  ప్రభుత్వం  పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ కాడర్ గా ఆర్డినెన్సు తెచ్చి , జీవోలు 95, 96 జారీ చేసి  ఆ తర్వాత చట్టం చేసింది.  మరలా హైకోర్టు ఆ జీవోలను కొట్టివేస్తూ స్థానిక కేడర్లను తనంతట తాను సృష్టించడం గానీ , రద్దు చేయడంగానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఏది జరిగినా రాష్ట్రపతి అనుమతి అనంతరమే జరగాలని  కనుక స్థానిక సంస్థల ఉద్యోగులు లోకల్ కేడర్లు గా పరిగణించరాదని , ఏకీకృత సర్వీసుల చట్టం , సంబంధిత జీవోలు  95, 96  చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఆరు అంశాల సూత్రం   1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం,  1971లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ల ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రెండు ప్రాంతాలు సమైక్యంగా  ఒకే రాష్ట్రంగా కొనసాగడానికి , తెలంగాణాతోసహా ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆ ప్రాంతాల ఉపాధి అవకాశాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుకై ఆరు అంశాల సూత్రం ( సిక్స్ పాయింట్ ఫార్మూలా ) రూపొందించి అమలు చెయ్యాలని 21-9-1973 నాడు రాష్ట్రానికి అందజేసింది. ఆరు అంశాల సూత్రం లో భాగంగా ది.3-5-1974 నాడు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371డి , ఆర్టికల్ 371ఇ లను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ 371 డి    రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు కులపరంగా రిజర్వేషన్ కు అవకాశమున్నది కానీ ఈ ఆర్టికల్ ప్రకారం స్థానిక నివాసం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కలిగింది. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. జీవో 674 ద్వారా 20-10-1975న ప్రత్యేక ఆదేశాలను రాష్ట్రపతి జారీచేశారు. 27నెలలలోపల రాష్ట్రంలోని వివిధ పోష్టులను ప్రత్యేక లోకల్ క్యాడర్లుగా ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఏర్పాటైన లోకల్ కాడర్ ఆయా కేటగిరీ పోష్టులకు నియామకానికి, సీనియారిటీ, ప్రమోషనుకు , బదిలీకి , ఉద్వాసనకు ఒక ప్రత్వేక యూనిట్ గా పరిగణింపబడుతుంది. అయితే 17-1-1978నాటికి గడువు ముగిసింది.  ప్రభుత్వ ఉపాధ్యాయులను జీవో నెం. 529 ద్వారా 14-5-1976నుండి లోకల్ కేడర్ గా ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఏ పోష్టులనైనా ఆయా ప్రాంతాల్లో లోకల్ కేడరుగా ప్రకటించవచ్చు. జూనియర్ అసిస్టెంటు , అంతకు తక్కువ స్థాయ గల పోష్టులను జిల్లా స్థాయి కేడరుగా ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య  సబార్డినేటు సర్వీసు నుంచి సెకండరీ గ్రేడు, స్కూలు అసిస్టెంటు పోష్టులసు 1-1-1974 నుండి ప్రతి జిల్లా ఒక ప్రత్యేక లోకల్ ఏరియాగా పరిగణించాలని జీవో106(ఇ) ద్వారా ది.4-2-2000 న రాష్ట్రపతి ఉత్తరువులకు సవరణ తెచ్చారు. ఇటువంటి సవరణ ఉత్తరువును  పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల విషయంలో తేవడం మరచారు. ఆ తర్వాత తెద్దాం లెమ్మని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించారు. రాష్ట్రం లోని 23 జిల్లాలను 6 జోన్లుగా ( ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నట్లుగా) విభజించారు. 1981లో పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రొవిన్షియలైజ్ చేశారు, కానీ లోకల్ కేడర్ గా పరిగణింపలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జీవోలు ఇచ్చినందున  1992లో, 1998లో, 2005లో ఇచ్చిన  ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పోష్టులను లోకల్ కేడరుగా మార్చే క్లాజు చేర్చాలని , రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన పరిశీలించడం సాధ్యపడదని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని ఒక్కమాట చెప్పడానికి 1973 నుండి 2007 వరకు నోరు రాని ప్రజాప్రతినిధులకు విద్య పట్ల ఎంత ఆసక్తి వుందో తెలియడంలేదా ? 

ప్రకటనలు

మే దినం – వి.ఐ. లెనిన్

15/06/2007

మే దినం వి.ఐ. లెనిన్సోదర కార్మికులారా !  ప్రపంచ కార్మికుల గొప్ప పండగ దినం సమీపిస్తుంది.వారు సూర్యకాంతికి మేల్కొని జ్ఞానమార్జించినందుకు సంతోషచిహ్నంగా మే ఒకటవ తేదీని పండగ చేసుకుంటారు. సమస్త పీడనకు వ్యతిరేకంగా , సమస్త నిరంకుశానికి వ్యతిరేకంగా,  సమస్త దోపిడీకి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజ స్థాపనకై పోరాడేందుకు ఒక సోదర బృందంగా ఐక్యమయినందుకు వారు ఆనాడు ఉత్సవం జరుపుకుంటారు. కష్టించి పనిచేసేవారందరూ, తమ కష్టంతో ధనికుల సామంతుల కడుపులు నింపేవారందరూ, స్వల్పజీతాలకు నడుములు విరిగేటట్లు యావజ్జీవితం శ్రమించే వారందరూ, తమ శ్రమ యొక్క ఫలితాన్ని ఎన్నడూ అనుభవించనివారంతా , నేటి నాగరికత ప్రసాదించిన విలాసాల భోగభాగ్యాల మధ్య  బ్రతుకు భారంగా పశుజీవితం గడిపేవారంతా ఆ రోజున కార్మికుల విముక్తి కోసం , కార్మికుల సౌఖ్యం కోసం పోరాడడానికి ఒకరి చేతులొకరు అందుకుంటారు. భిన్న జాతులకు, లేదా మతాలకు చెందిన కార్మికుల మధ్యవైరం సమసిపోవాలి. కార్మికుల అజ్ఞానం మీద , అనైక్యత మీద బ్రతికే దోపిడీ గాండ్రకు , నిరంకుశ పాలకులకు మాత్రమే ఈ వైరం ప్రయోజనకారి. యూదులూ క్రైస్తవులూ, ఆర్మీనియన్లూ టాటార్లూ, పోలులూ రష్యన్లూ, ఫిన్నులూ స్వీడులూ, లెట్టులూ జర్మన్లూ  అందరూ, వీరందరూ సోషలిజం అనే ఒకే ఒక పతాకం క్రింద కదం తొక్కుతూ కలిసి నడుస్తారు. కార్మకులందరూ సోదరులు. వారి దృఢ ఐక్యత మాత్రమే శ్రమజీవులందరి , పీడిత జనులందరి సంక్షేమానికి ,సౌఖ్యానికి హామీ. మే నెల మొదటి తేదీని సకల దేశాల కార్మిక సమాఖ్య , అంతర్జాతీయ సోషల్ డెమోక్రాటిక్ ఉద్యమం తన బలాలను బేరీజు వేసుకుంటుంది. స్వాతంత్ర్యం , సమానత్వం, సోదరత్వం కొరకు మరింత నిర్విరామంగా, మరింత దృఢ నిశ్చయంతో పోరాడ్డానికి తన శక్తినంతనూ సమీకరించు కొంటుంది.                                              కామ్రేడ్స్ ! రష్యాలో గొప్ప ఘటనలు జరగబోతున్న కాలంలో మనం ఉన్నాం.  జారిష్టు నిరంకుశ ప్రభుత్వం మీద మనం చిట్టచివరి మహోగ్రపోరాటం ప్రారంభించాం. అంతిమ విజయం సాధించేవరకు మనం ఈ పోరాటం కొనసాగించాలి. పశువులు, దుష్టపాలకులు, రాజాశ్రితులు, పెట్టుబడిదారీ లంచగొండులతో కూడిన ఈ ప్రభుత్వం యావన్మందీ రష్యన్ ప్రజలకు ఎట్టి విపత్తులు తెచ్చిపెట్టిందో చూడండి ! జారిష్టు ప్రభుత్వం రష్యా ప్రజల్ని జపానుకు వ్యతిరేకంగా మతిలేని యుద్ధంలోకి యీడ్చింది. అనేక వేలమంది యువకుల్ని , ప్రజలనుంచి వేరుచేసి , దూరప్రాచ్యంలో దిక్కులేని చావు చావడానికి పంపింది. ఈ యుద్ధంవల్ల మనకు దాపురించిన విపత్తులన్నింటినీ వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకూ ఈ యుద్ధం ఎందుకొచ్చినట్లు ?  మన జారిష్టు దోపిడీ ప్రభుత్వం చైనా నుంచి లాక్కున్న మంచూరియాను రక్షించుకునేందుకు. ఒక విదేశీ ప్రాంతం కొరకు రష్యన్ ప్రజల రక్తం ధారవోయబడుతుంది. దేశం సర్వనాశనం చేయబడుతుంది. కార్మికకర్షకుల జీవితం అంతకంతకూ బాధాకరమౌతుంది. పెట్టుబడిదార్లూ , అధికార్లూ వారి మెడల చుట్టూ ఉరిత్రాటిని అంతకంతకూ గట్టిగా బిగించి వేస్తుంటే , జారిష్టు ప్రభుత్వం విదేశీ భూభాగాల్ని కొల్లగొట్టుకునేందుకు ప్రజానీకాస్సి పంపిస్తుంది. చేతగాని జారిష్టు సేనాధిపతులూ, లంచగొండి అధికారూలూ రష్యన్ నౌకాదళ విధ్వంసానికి కారకులయ్యారు. అనేక వందల కోట్ల జాతీయ సంపదను దుబారా చేశారు. సైన్యాలకు సైన్యాలనే  కోల్పోయారు. అయినా యుద్ధం యింకా సాగుతూనేవుంది. ఇంకా ఎక్కువ ప్రాణాల్ని అది బలిగొంటూనే వుంది. ప్రజలు సర్వనాశనం అవుతున్నారు. పరిశ్రమలూ, వ్యాపారం స్తంభించి పోతున్నాయి. కరువు, కలరా తాండవించనున్నాయి. అయినా , యీ నిరంకుశ ప్రభుత్వం అంధోన్మత్తతతో పాత మార్గాన్నే అనుసరిస్తుంది. కొద్దిమంది పశువుల్నీ, దుష్టపాలకుల్నీ రక్షించేటందుకుగాను అది రష్యాను సర్వనాశనం చేయటానికి సిద్ధపడింది. ప్రస్తుతం అది జపానుతో చేసే యుద్ధం కాక మరో యుద్ధం కొనసాగిస్తోంది. అది యావన్మంది రష్యా ప్రజలపై యుద్ధం.                         నిద్రనుండి , అజ్ఞానం నుండి , దాస్యం నుండి మేలుకోవడం ఇప్పుడు అనుభవించినంతగా ఇదివరకెన్నడూ రష్యా అనుభవించలేదు. కార్మికులు , రైతులు మొదలు భూస్వాములూ , పెట్టుబడిదార్ల వరకు అన్ని వర్గాల ప్రజల్లో కదలిక వచ్చింది. అన్నిచోట్ల సెయింట్ పీటర్స బర్గలో , కాకసన్ లో , పోలేండులో , సైబీరియాలో నిరసన ధ్వనులు వినబడుతున్నాయి. ప్రతిచోట యుద్ధం అంతమవ్వాలని ప్రజలు కోరుతున్నారు. స్వతంత్ర ప్రజా పరిపాలన స్థాపింపబడాలని వారు అభిలషిస్తున్నారు. ఎట్టి మినహాయింపులు లేకుండా యానన్మంది పౌరుల ప్రతినిధులతో రాజ్యాంగ నిర్ణయ సభను సమావేశపరచాలనీ , జారిస్టు ప్రభుత్వంచే అగాధంలో ముంచబడుతూన్న జాతిని ఆ సభ కాపాడాలనీ వారు కోరుతున్నారు. సెయింట్ పీటర్సుబర్గులో రెండు లక్షల మంది కార్మికులు ఈ ప్రజాకోర్కెలను నివేదించడానికి జనవరి తొమ్మిదవ తేదీ ఆదివారంనాడు గపోన్ ఆనే మతగురువు నాయకత్వం క్రింద జారు చక్రవర్తి వద్దకు వెళ్ళారు. జారు ఈ కార్మికుల్ని శత్రువులుగా పరిగణించాడు. వేలాది నిరాయుధ కార్మికుల్ని సెయింటు పీటర్సుబర్గు  వీధుల్లో కాల్చి చంపించాడు. పోరాటం నేడు రష్యా అంతటా జరుగుతుంది. కార్మికులు స్వేచ్ఛ కోసం , మంచి బ్రతుకు కోసం సమ్మె చేస్తున్నారు. రీగాలోనూ, పోలెండులోను, వోల్గా నది మీద , దక్షిణ ప్రాంతంలోనూ రక్తం చిందింపబడుతుంది. అన్ని చోట్ల రైతులు ముందుకొస్తున్నారు. స్వాతంత్ర్యం కొరకు జరిగే యీ పోరాటం ప్రజలందరి పోరాటంగా రూపొందుతుంది.           జారిష్టు ప్రభుత్వం ఉన్మాదంలో పడింది. యుద్ధం కొనసాగించడానికి అది ఋణం చేయాలనుకొంటుంది గాని, ఎవరూ ఇక దాన్ని నమ్మరు. ప్రజా ప్రతినిధుల్ని సమావేశపరుస్తానని అది వాగ్దానం చేస్తోందిగానీ, పరిస్తితుల్లో ఎట్టిమార్పు లేదు. చిత్రహింసలు ఆగిపోవటం లేదు. అధికారుల చట్ట ధిక్కారం యధాప్రకారం సాగిపోతుంది. స్వేచ్ఛగా బహిరంగసభలు జరుపుకోవడానికి వీల్లేదు. ప్రజల పత్రికలను స్వేచ్ఛగా పంచిపెట్టుకోకూడదు. కార్మిక వర్గ  ఆశయం కోసం పోరాడినందుకు జైళ్ళలో మగ్గుతున్నవారు విడుదల చేయబడడం లేదు. జారిష్టు ప్రభుత్వం ఒక జాతిని మరొక జాతి మీదికి ఉసిగొల్పుతుంది.  బాకూలో నివసించే టాటార్లలో ఆర్మీనియన్ల మీద అసూయను రెచ్చగొట్టిన ఫలితంగా పెద్ద హత్యాకాండ సంభవించింది. ఇప్పుడు అమాయక ప్రజల్లో యూదుల మీద ద్వేషాన్ని పురికొల్పడం ద్వారా మరొక హత్యాకాండకు సన్నాహాలు జరుపుతుంది.                                      కార్మిక సోదరులారా ! రష్యన్ ప్రజలపై జరిగే యిలాంటి ఘోరాలను మనం ఇక సహించబోము. స్వాతంత్ర్య రక్షణకై మనం నడుములు బిగిస్తాం. ప్రజల క్రోధాన్ని అసలు శతృవు నుండి మళ్ళించేటందుకు ప్రయత్నించే వారినందరిని మనం ఎదుర్కొంటాం. జారిష్టు ప్రభుత్వాన్ని కూలద్రోసి యావన్మది ప్రజలకు స్వాతంత్ర్యం సాధించటానికి మనం సాయుధులమై లేద్దాం. కార్మిక కర్షకులారా !  ఆయుధాలు ధరించండి! రహస్య సమావేశాలు జరుపుకోండి!  పోరాట దళాలను నిర్మించుకోండి!  సేకరించగల ఆయుధాలన్నిటినీ సేకరించండి. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీతో సంప్రదింపులు జరపటానికి ప్రతినిధులను పంపండి. ఈ సంవత్సరం మే ఒకటవ తేదీని ప్రజల తిరుగుబాటు రోజుగా పరిగణించి ఉత్సవాలు జరుపుకొందాం. దానికొరకు మనం సన్నద్ధమవుదాం. దుష్ట ప్రభుత్వం పై నిర్ణాయకమైన దెబ్బ తీయటానికి సంకేతం కోసం ఎదురు చూద్దాం. జారిష్టు ప్రభుత్వం నశించాలి !  దాన్ని మనం కూలద్రోసి , ప్రజల రాజ్యాంగ నిర్ణయ సభను సమావేశ పరచేటందుకు ఒక తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. ప్రజల ప్రతినిధులు సార్వజనీన , ప్రత్యక్ష, సమాన పద్ధతి పై రహస్య ఓటింగు ద్వారా ఎన్నుకోబడాలి. స్వాతంత్ర్య సమర యోధులందరినీ జైళ్ళ నుంచీ, లేదా ప్రవాస నిర్బంధం నుంచి విడుదల చేద్దాం. సభలు బహిరంగంగా జరుపుకుందాం. ప్రజల పత్రికలను పాడు అధికారుల అజమాయిషీ లేకుండా అచ్చువేసుకుందాం. ప్రజలందరూ ఆయుధాలు ధరించాలి. ప్రతి కార్మికునికి ఒక రైఫిలు చొప్పున యివ్వాలి. అప్పుడు కొద్దిమంది దోపిడీదారులు కాకుండా , ప్రజలే తమ భవిష్యత్తును తామే నిర్ణయించు కుంటారు. గ్రామసీమల్లో భూదాసుల యజమానులైన భూస్వాముల పెత్తనాన్ని కూలద్రోసేటందుకు , అధికారుల పాడు జులుం నుంచి ప్రజల్ని విముక్తి చేసేటందుకు , రైతుల నుంచి లాక్కోబడిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి స్వతంత్ర్య రైతు కమిటీలు స్థాపింప బడాలి.                                ఇదీ సోషల్ డెమోక్రాట్లు కోరేది. యిందుకోసం సాయుధంగా పోరాడమని వారు మిమ్మల్ని కోరుతున్నారు. సంపూర్ణ స్వేచ్ఛ, ప్రజాతంత్ర రిపబ్లిక్కూ , ఎనిమిది గంటల పనిదినం , రైతు కమిటీల స్తాపన వీటికోసం పోరాడాలి. కాబట్టి కార్మిక సోదరులారా!  యీ మహా సంగ్రామం కొరకు సన్నద్ధం కండి. మే ఒకటవ తేదీని ఫ్యాక్టరీలలోనూ , మిల్లులలోనూ పని మానివేయండి. లేదా సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ కమిటీల సలహా మేరకు ఆయుధాలు ధరించండి. తిరుగుబాటుకు గంట ఇంకా మ్రోగలేదు గాని, అందుకు ఎక్కువ సేపు పట్టదు. స్వాతంత్ర్య సాధనకై ఎనలేని త్యాగాలు చేసిన రష్యన్ వీర శ్రామికుల వైపు ప్రపంచ కార్మికులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు.  సెయింటు పీటరుబర్గు కార్మికులు ప్రఖ్యాత జనవరి తొమ్మిదవ తేదీని స్వాతంత్ర్యమో , వీర మరణమో అంటూ నినదించారు. రష్యా దేశపు సమస్త కార్మిక జనులారా !  నేడు ఆ యుద్ధ నినాదాన్ని పునశ్చరణ చేద్దాం. ఎన్ని త్యాగాలైనా చేయడానికి వెనుదీయవద్దు. తిరుగుబాటు ద్వారా మనం స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం. ఆ స్వాతంత్ర్యం ద్వారా సోషలిజం !            మే మొదటి తేదీ చిరస్థాయి అగుగాక !  అంతర్జాతీయ విప్లవ సోషల్ డెమోక్రటిక్ ఉద్యమం చిరస్థాయి అగుగాక !   కార్మిక కర్షక స్వాతంత్ర్యం  చిరస్థాయి అగుగాక !  ప్రజాతంత్ర రిపబ్లిక్ చిరస్థాయి అగుగాక !  జారిష్టు నిరంకుశ ప్రభుత్వం నశించాలి ! [ 1905 ఏప్రిల్ 12 (25) కు ముందు రచింపబడినది  ]