మే 2007ను భద్రపఱచు

లోకాయుత జ్ఞాన సిద్ధాంతం

26/05/2007

జ్ఞాన సముపార్జనకు లోకాయతులు ఇంద్రియాల పైనే ఆధారపడ్డారు. జ్ఞాన సంపాదన కోసం ప్రమాణాలు తార్కికంగా వివిధాలున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తప్రమాణం, ఆగమ ప్రమాణం (వేద ప్రమాణం) ఇట్లాంటివి వున్నాయి.
ప్రత్యక్షానుమానోపమాన శాబ్దాః ప్రమాణాని…”
ప్రత్యక్షోహ్యేత య్మోరూలం
కృతాంతై తిహ్య యోరపి|
ప్రత్యక్షేణా గమో భిన్నః
కృతాంతోవా న కించన||”మానవ జ్ఞాన సంపాదనకు ప్రత్యక్షమే పరమావధి.ఎన్ని ప్రమాణాలున్నా ప్రత్యక్షానుభూతికి లొంగక తప్పదు. మతం చూపే ప్రమాణ గ్రంధాలన్నీ అనుభవానికి దూరంగా వుంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష ప్రమాణానికి నిలువవు.ఋజువుకు పనికిరావు. అనుమానం మొదలైన ప్రమాణాలను చార్వాకులు తిరస్కరించారు. అయితే అవి అన్నివిషయాలలో గాదు.
యత్ర యత్రాను మానేస్మిన్
కృతం భావయతో పిచ|
నాన్యో జీవః శరీరస్య
నాస్తికానాం మతే స్థితః||”అనుమాన ప్రమాణానికి సంబంధించినంతవరకూ ఏదీ ముఖ్యమైంది కాదు. అశాస్త్రీయ గ్రంధాలైన మత గ్రంధాలనాధారంగా చేసుకొనీ, మతాలు చెప్పే నమ్మకాలకు సంబంధించి అనుమాన ప్రమాణాన్ని గానీ నమ్మి ఆత్మ సిద్ధాంతాన్ని ఋజువు చెయ్యలేం.
                 అంటే చార్వాకులు – అనుమానాది ప్రమాణాలను త్రోసిపుచ్చి కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే నమ్ముతారని మాధవాచార్యులు తమాషాగా వక్రీకరించి ఈ సిద్ధాంతం పట్ల మేధావులకు వైముఖ్యం కలిగేట్లు చేయడానికి యత్నం చేశాడు.
               తన సర్వ దర్శన సంగ్రహం లో లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని వివరిస్తూ వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని తిరస్కరిస్తారని చెప్పాడు. మాధవాచార్యులీపని చేయడానికి బౌద్ధ దృక్పధం బాసటగా నిలిచింది.
అనుమానాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే దినసరి జీవితంలో చాలా అసాధ్యాలను ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనుడనే తార్కికుడన్నాడు. ఇదంతా మాధవాచార్య కృతకవ్యాఖ్య వల్ల వచ్చిన ప్రమాదం.
మతం ఊహాజనితంగాచెప్పే -స్వర్గం -నరకం -పుణ్యం- పాపం- ఆత్మ -దైవం -పూర్వజన్మ- పునర్జన్మ- లాంటి వాటిని అనుమాన ప్రమాణం ఆధారంగా చేసుకొని నమ్మరాదనీ, వాళ్ళ అనుమానం చెల్లదనీ లోకాయతులు చెప్పారు.అంతేగాని, ఇతర విషయాలలో గాదు. ఇంద్రియానుభవానికి దగ్గరగా ఉండేవాటి విషయంలో అనుమాన ప్రమాణాన్ని చార్వాకులు అంగీకరిస్తారు.
బుద్ధమోషుడు లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని విమర్శిస్తూ దీనిని వితండవాద శాత్త అంటే వితండవాద శాస్త్రం గా పేర్కొన్నాడు.
                              వితండ – వాద – అనేవి రెండు లక్షణాలు. ఒకటిగాదు.ఈరెండూ పరస్పర విరుద్ధ గుణాలు కలవి.
వితండ- విచ్చిన్నానికి దారితీసే, వాదం- నిర్మాణానికి పనికివస్తుంది.ఈ పరస్పర విరుద్ధ లక్షణాలను లోకాయతులకంటగట్టి బౌద్దుల లోకాయతాన్ని అపహాస్యం చేయడానికి పూనుకున్నారు. మాధవాచార్యుడు వీళ్ళనే అనుసరించాడు.
తర్కశాస్త్రంలో వితండ లక్షణం :
స ప్రతిపః స్థాపనాహీ వో వితండా అని చెప్పబడ్డది.
స్వపక్షమును స్థాపింపక, పరపక్షమును ఖండించుటయే ఫలము గల వార్తాలాపం వితండ అని చెప్పబడుతుంది.వాదలక్షణము ప్రమాణ తర్క సాధనో పాలంభః సిద్ధాంతా విరుద్ధః పంచాపయనోపపన్నః పక్ష ప్రతిపక్ష పరిగ్రహోవాదః ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారాను వానికి అనుకూలించు తర్కముల ద్వారాను తన పక్షమును సాధించుచు పరపక్షమును నిషేధించునట్టిదియు, సిద్ధాంతమును విరోధింపనట్టిదియు, ప్రతిజ్ఞ మొదలగు ఐదు అవయవములు గలిగినదియు, వాది ప్రతివాదులచే పక్ష ప్రతిపక్షములు కలదియు నగు చర్చా విశేషము వాదనమనబడును.
                               ఈ రెంటికీ ఒకే అర్ధం చెప్పి పనికిమాలిన కుతర్కంగా భావించి చెప్పారు. అయితే ఇది వాస్తవమా?
శుక్ర నీతిసారం అనే గ్రంథం నాస్తికుల్ని తార్కిక వివాదాల్లో ఆరితేరిన వాళ్ళుగా పేర్కొంది. మత భావాలను తూర్పారబట్టటంలో వీరి వాదనాపటిమ అజేయం. ఇది విధ్వంసక లక్షణం. అదే సమయంలో సిద్ధాంత స్థాపన విషయంలో నిర్మాణాత్మక వైఖరి వీళ్ళ తర్కంలో కనిపిస్తుంది. పునాది లేని , అర్ధ రహితమైన మతాచారాలను తమ తార్కిక శక్తితో తునాతునకలు చేసి వాటికి ప్రజల్లో స్థానం లేకుండా చేస్తున్నారనే కారణంతో లోకాయతాన్ని వైదిక మత ప్రచారకులూ, వాళ్ళతోపాటు సనాతన ధర్మానికి మారిపోయిన బౌద్ధ జైనులూ పనిగట్టుకొని ఈపని చేశారు.పశుశ్చే న్నిహత స్సర్గం
జ్యోతిష్టో మేగ మిష్యతి|
స్వపితా యజమానేన
తత్ర కస్మాన్న హస్యతే|| “జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలలో చంపబడ్డ జంతువుకు స్వర్గం వస్తుందని అంటారు. అయితే యజ్ఞకర్త తన తండ్రినే చంపితే తండ్రికే స్వర్గం ఇప్పించినవాడౌతాడుగదా! తండ్రిని ఎందుకు చంపడు?వృక్షాన్ భిత్వా పశూన్ హత్వా
కృత్వారుధిం కర్దమం |
ఇత్యేవం గమ్యతే స్వర్గం
నరకం కేన గమ్యతే ||
చెట్లను నరికి , జంతువులను చంపి రక్తపు మడుగులు గావించేవారంతా స్వర్గానికి వెళుతుంటే, నరకానికి ఎవరు వెళతారు?
గచ్చతావిహ జంతూనాం
వ్యర్ధం పాధేయ కల్పనం |
గేహస్థ కృత శ్రాద్ధేన
పధి తృప్తి రవారితా ||
మనం శ్రాద్ధం జరుపుతూ ఇంటిలో పెట్టిన ఆహారం పైలోకాల్లోని పితరులకు చేరుతుందని అంటారు. అయితే పనిమీద పొరుగూరు పోయిన మన కుటుంబ సభ్యులకు వేళ ప్రకారం ఇంటిలో అన్నం విస్తరిలో వడ్డిస్తే ఆకలి తీరుతుందా? ఈరకంగా చార్వాకులు మతాచారాలను తమ తార్కిక శక్తితో చాలా సరళంగా, నిశితంగా ఖండించి ప్రజల్లో దానికి స్థానం లేకుండా చేయడానికి ప్రయత్నించారు.
               హరిభద్రసూరి రాసిన షడ్దర్శన సముస్చయా నికి లఘు వ్యాఖ్య వ్రాసిన మణిబద్రుడు లోకాయతుల ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలియజేస్తూ ఇంద్రియానుభవానికి విరుద్ధమైనవాటికి ప్రాధాన్యం ఇస్తే ఎంత నష్టం వస్తుందో వివరించాడు.
దరిద్రోహి స్వర్గరాశిర్మే అస్తీత్య సుధ్యాయ హేలయై వాదౌః స్థ్యదలయేత్, దాసోపిస్వ చేతన స్వావితామవలంబ్య కిం కరతాం నిరాకుర్యాదితి…”
కనబడని వాటికి అస్తిత్వాన్ని అంగీకరిస్తే – దరిద్రుడు తాను బంగారు కుప్పపై కూర్చున్నట్టుగా భావించి తన పేదరికాన్ని అనాసక్తంగా చూసే ప్రమాదముంది.బానిస తాను యజమానినని బ్రమించే ప్రమాదం ఉంది.
లోకాయతులు హేతువునకు నిలబడనివాటిని ,కేవలం విశ్వాసం మీద ఆధారపడ్డవాటిని తిరస్కరించారు.
జ్ఞాన సంపాదనా విషయంలో అనుభవానికి గోచరంకానిదానిని వ్యతిరేకించారు. రెండు విభిన్న సంస్కృతుల మధ్య జరిగిన చర్యగా దీనిని మనం గమనించాలి.ఎవరెన్ని చెప్పినా లోకాయతులు ఈ దేశకు తొలి తార్కికులు . తమ తార్కిక శక్తితోటే విశ్వాసమే ఆధారంగావున్న అహేతువులైన మత సంప్రదాయాలను , ఆచారాలను బట్టబయలు గావించి ప్రజల్లో వాటికి స్థానం లేకుండా చేయడానికి యత్నం చేశారు.అందుకే వీళ్ళ ధాటికి తట్టుకోలేని మతప్రచారకులు గుంపులుగా చేరి వివిధ రకాల విమర్శనాస్త్రాలను గుప్పించారు. అయినా, ఏమీ చేయలేక పోయినారు.
లోకాయుతం – నీతినాస్తికులు – తిను,తాగు,సుఖం అనుభవించు- అప్పు చేసైనా సరే భోగాలనుభవించు అనే చవకబారు నీతిని చెప్పి ,జీవిత విధానాన్ని ఉన్నత విలువలనుంచి నీచ స్థితికి దిగజార్చారని ప్రచారం గావించారు. అంతా పనిగట్టుకొని ఈ సిద్ధాంత కర్తలపై దుమ్మెత్తిపోశారు.
సర్వ దర్శన సంగ్రహం రాసిన మాధవాచార్యులు ఋణం కృతా ఘృతంపి బేత్ అని కల్పించి చెప్పాడు.
షడ్దర్శన సముచ్చయకర్త హరిభద్రుడు కూడా-
పిబ ఖారచజాత శోభనే! యతీతం పరగాత్రి! తన్నతే
నహి భీరు! గతం నివర్తతే, సము యమమాత్రమిదం కళేబరం
ఇది ఉమ్రఖయ్యాం భావాలనే పోలివుంది.
ఓ జాత శోభనా! తిను, తాగు- గడచిన సమయం తిరిగి రాదు. అందుకే ఇప్పుడే అనుభవించు. ఇది చాలా పేలవమైన అభిప్రాయం. లోకాయత కేవలం ఇంద్రియ సుఖాలపై వెంపరలాడిన సిద్ధాంతం గా వక్రీకరించడానికి చేసిన యత్నం.
కృష్ణమిశ్రుడు కూడా ప్రబోధ చంద్రోదయ నాటకంలో చార్వాక పాత్ర ద్వారా లోకాయతుల నీతి ఏమిటో చెప్పిస్తాడు.
క్వా లింగనం భుజని పీడిత బాహు మూలం
భుగ్నోన్న తస్త న మనోహర మాయాతాక్ష్యాః|
భిక్షోపవాస నియమార్క మరీచి దాహైః
దేహోపశోషణ విధిః కుధియాం క్వచైషః||
పురుష బాహుమూలాలచే పీడనములైన మనోహరములైన స్త్రీ కుచాలింగనమెక్కడ? భిక్ష, ఉపవాస, పంచాగ్నులతో దేహం శుష్కింప చేయటం వంటి శారీరక కష్టముల ఆచారాలెక్కడ? ఇంద్రియ సుఖాన్ని పొందటమే పరమార్ధం.త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం
దుఃఖోప స్పష్టమితి మూర్ఖ విచార ణైషా|
వ్రీహీన్ జిహా సతి సిలోత్తమ తండులాడ్యాన్
కోనామ భోస్తు షకణోప హితాన్ హితార్ధీ||-ఇలాంటివే చాలా రకాలుగా అంటగట్టారు.
లొకాయతం ఇంత చవకబారు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేదైతే, ఇంది ప్రజల్లో వేళ్ళూనుకుని ఉండేదికాదు. అన్ని తరగతుల ప్రజల్ని ఆకర్షించేది కాదు.మనం కేవలం ప్రతిపక్షుల గ్రంధాలపైనా, వాళ్ళ విమర్శల పైనా ఆధారపడటం వల్ల లోకాయతనుగూర్చి సరైన విధంగా ఆలోచించలేము. భారతంలోనూ, హరివంశంలోనూ బ్రాహ్మణపండితులే లోకాయతను అధ్యయనం చేసినట్లు దాన్ని అధ్యయనం చేయడం సగర్వంగా ఒక గొప్ప అర్హతగా చెప్పుకున్నారు. ఇది పైవారు చెప్పినట్లుగా కేవలం ఇంద్రియసుఖ లంపటత్వంలో మునిగిందైతే ఇంత ప్రభావం చూపేదా? కాదని సులభంగానే చెప్పవచ్చు.
                 అయితే లోకాయుతుల నీతిని, జీవన విధానాన్ని ఎట్లా రచించాలి? దీనికి శత్రువులకు కూడా ఆశ్చర్యం గొలిపే వృత్తాంతం భారతం లోనే వుంది.
ఇంతకుముందు చెప్పిన భారతం లోని చార్వాకుడి వృత్తాంతం లోకాయత నీతికి నిదర్శనం గా వుంది.
ముందు భారతం లోని కథ చూద్దాం. (శాంతి పర్వం-ప్రథమాశ్వాసం).
” ….అట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుండను నొక్కరక్కసుండు విప్రాకారంబు
గైకొని త్రిదండి వేషం బలపడ నయ్యవనీ దేవతాకోటిలో నిల్చియున్న రాధమునకిట్లనియె-
చంప. వినుము నరేంద్ర! సర్వమును విప్రజనంబును గూడి నన్ను బం
చిన విధ మీతడేటి పని సేసిన పాపము పెద్ద చంపుచో|
జనకుడు బ్రాత పుత్రుడను శంక యొకించుక లేదు సద్గురుం
డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయు బుట్టదుగాని గాల్పనే?||
|| అనుమనిరని పలికి వెండియు
ఆ. ఇట్లు శిష్టజనము నేవగిపగడజేయు
రాజ్యమెల్ల బంధు రాజినెల్ల
బొలియజేసి యెట్టి భోగంబు లనుభవిం
చెదవు, కల్మషంబు చిక్కె నీకు.
||అనిన విని యవ్విప్రు లత్యంత వ్యధితాంతః కరణులగుచో నొండురుల మొగంబులు చూచి, ఇట్లు పుట్టంబనియేమియను వచనంబులతో నిరుగుడుపడిరి. ధర్మనందనుడు లజ్జావనతవదనుండై యూరకుండి వారలవలను కనుంగొని కేలుమొగిచి ఫాలభాగంబున గదియించి ఇట్లనియె-
తే. మ్రొక్కివేడెద నను మీరు ధిక్కరింప
కాదరింపుడు మునిసమోహానమతుడ |
నై వినిశ్చయ పరికి లతాంతరంగ
వర్తనముతోడ నిచటికి వచ్చినాడ ||
|| అనవుడు భయసంభ్రమ భరితములగుచు నా భూసురులు దేవా! ఈ వాక్యంబులు, మావలనం బుట్టినవికావిది యేమియోగాని నీ వుత్తమ క్షాత్రధర్మంబున సముపార్జించిన యుజ్జ్వలశ్రీ సుస్థిరతంబొందుమని యతనికి నా శ్వాసంబొనర్చి యమ్మాయభిక్షువు నాలోకించి పరమబోధంబున నప్పురుషాధము నెరింగి యమ్మహీపతితో – వీడు దుర్యోధన సఖుండగు రాక్షసుండు, సన్యాసి వేషంబున నేతెంచి యాతనికి హితంబాచరించువాడై ఈ దుర్వచనంబులాడె, నీకుక్క మొరిగిన, యంతన పాలమున్నీరుంబోని నీకు గలంగనేల ధర్మాత్ములగు తమ్ములు పమపుసేయం బూజ్యంబగు సామ్రాజ్యంబు వహింపుమని యాదరించి –
కం. ఆ రాక్షసు గనుకొని కో
పారంజిత నేత్రులగుచు నవ్విప్రులు హుం |
కార ముఖరలగుటయు నతి
ఘోరాకృతితోడ వాడు గూలెం బుడమిన్ ||
తే. బ్రహ్మతేజో నిహతినట్లు పడి మహాశ
ని ప్రహతి పాతితోర్విజ విబ్రాంతినొంది |
యన్న యద్దానవుని జూచి యన్నరేంద్రు
డెలిమి సొంపు వహించె దమ్ములున్ దాను ||
|| ఇట్లు ప్రీతుండై యజాతశత్రుం డవ్విప్రసమూహంబునకు సవిషేసార్చనంబొనర్చి వీడుగొలిపె నప్పుడచ్యుతుండు బ్రాహ్మణ స్తుతిచేసి యజ్ఞనపతితో నిట్లను గృతయుగంబునన్ జార్వాకుండను దైత్యుండు తపంబొనరించి పద్మభవుండు ప్రత్యక్షంబయిన నిఖిల భూతములవలనను నభయంబు వేడిన నద్దేవుడు భూదేవతల కనిష్టంబైన పనులు చేయకుండువాడవు చేసితేని యదియునీకు దుదియని పలికి యవ్వరంబొసంగెనట్లు లబ్దవరుండై వాడు గర్వించి గీర్వాణుల బాధింపందొడంగిన వారు విరించింగాంచి యారక్కసుండు సేయు బాధలంజెప్పిన యమ్మహాత్ముండేను మున్న యెరింగి యొనర్చిన నాడె, దుర్యోధనుండును రాజునకు నెచ్చెలియై యచ్చపలుండు తర్కార్యంబాచరింపజొచ్చి యమ్మహీసురులకు మనోవ్యధాకరంబగు కర్మంబుసేయు నప్పని కారణంబుగా వారలకోపంబునంగూలం గలవాడని పలికె. నద్దానవుండు నేడిటవచ్చి తన దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవాడని చెప్పి, యప్పీనుగుం వెడల వైపించి, యాభూపాలు నుద్దేశించి వెండియు –ఆ.మారుకొన్న వారి నీరు సేయము ప్రజ
నరసి మనుపు ధరణి సురుల బ్రోవు |
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ
వృత్తి మనపు వెంపు వెలయ నధిప ||కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు తన తమ్ములతో యుద్ధరంగం నుండి పట్టణానికి వస్తున్నాడు. పట్టణం బయట ధర్మరాజుకు స్వాగతం పలకటానికి బ్రాహ్మణ వర్గం పోగైవుంది. ధర్మరాజు వస్తున్నాడు.ఆ గుంపులోనుండి ఒక వ్యక్తి ,చార్వాకుడి పేరుతో వున్నవాడు, ముందుకు పోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఏమయ్యా! ఈ బ్రాహ్మణవర్గం నిన్ను శపించమని నన్ను పంపింది. తండ్రి, తాత, సోదరుడు, గురువు – అనే విచక్షణలేకుండా అందరినీ చంపావు. ఎంతోపాపం మూటగట్టుకున్నావు.బంధువులందరినీ చంపి నీవు పాలించేది దేన్ని? “
ఇది చార్వాక నీతి . ఇందులో మాధవాచార్యులుగాని, హరిభద్రసూరిగాని, కృష్ణమిశ్రుడుగాని చెప్పిన ఇంద్రియ సుఖలాలసత్వం ఎక్కడుంది?
చార్వాకుడి ఈ హఠాత్సంఘటనకు బ్రాహ్మణులంతా నివ్వెరపోయారు.నైతికంగా తప్పు చేసినందుకు ధర్మరాజు గాయపడి చావాలనుకున్నాడు.కాని కొంతసేపటికి పురోహితవర్గం తెలివి తెచ్చుకొని చార్వాకుణ్ణి తాము పంపలేదనీ, ఈతడు దుర్యోధనుని స్నేహితుడైన రాక్షసుడనీ, చెప్పి – ధర్మరాజుని పొగడి , చార్వాకుణ్ణి దహించివేశారు.
చార్వాకుడు రాక్షసుడనీ, దుర్యోధనుడి స్నేహితుడనీ చెప్పిన ఈ కథ కల్పితమని తెలుస్తూనేవుంది.ఇది చాల దుర్బుద్ధితో కూడుకున్న పని. అయితే ఇక్కడ ఓవిషయం గమనించాలి. చార్వాక – లోకాయత పదాలు పర్యాయపదాలు. చార్వాకుడికంటగట్టిన భావాలు లోకాయతకు గూడా వర్తిస్తాయి. ఇక్కడ ధర్మరాజు చేసిన పని – స్వీయ బంధువుల్ని, గురువుల్ని చంపడం – సామాన్య జన్నాన్ని గాదు. రక్తసంబంధీకుల్ని చంపడమనేది మానవుడి సాంఘీక నీతికి విరుద్ధం. అటవిక నీతికి భంగం కలిగించడం. మానవ సమాజ ప్రాథమిక విలువల్ని ధర్మరాజు మంటగలిపాదు. వాటిని ధ్వంసంచేయడం తప్పని చార్వాకుడు ఎదురు తిరిగాడు. ఇందులో నీతి వుందా, తప్పు వుందా? ఏ భావవాది దీన్ని దోషమంటాడో చెప్పమనండి. ఇదే విషయం గీతలో కృష్ణుడు – బంధువుల్ని చంపటానికి వెనకాముందూ ఆలోచిస్తున్న అర్జునుణ్ణి హింసకు పురికొల్పుతాడు.
హతోవా ప్రాప్యసే స్వర్గం –
జిత్వావా భోక్షసే రాజ్యం అంటాడు.
హింసకు ప్రేరేపించిన కృష్ణుడినీతి గొప్పదా? మానవ విలువల్ని కాలరాయటం తప్పని ధర్మరాజును నిలదీసిన లోకాయతుడిది తప్పా? ఏది ధర్మం, ఏదధర్మం? ఎవరు ఇంద్రియ సుఖలాలసత్వాన్ని బోధిస్తున్నారు? ఎవరు ఉన్నత జీవన విలువల్ని భగ్నం చేస్తున్నారు? మనం ఆలోచించాలి.లోకాయతం – తత్త్వశాస్త్రంలోకాయతం మనకు కనిపిస్తున్న ఈ లోకానికి సంబంధించిన తత్త్వశాస్త్రం. ఇది ఈ పదంలోనే కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజల దృక్పథం – అని లోకాయతకు అర్ధం చెప్పుకొనేటప్పుడు దీన్ని మనం వేరేవిధంగా అన్వయించలేం.
అంతేగాక, ఇతర తత్త్వశాఖలకు ఆయా వ్యక్తులకు కర్తలుగా వున్నారు. కానీ , ఇది ఒక వ్యక్తి ప్రచారం చేసిన తత్త్వశాస్త్రం గాదు. ప్రజల ఆలోచనల నుంచి బయలుదేరిన ప్రజాతత్వశాస్రము. ఈలోకానికి సంబంధించింది. కాబట్టి భౌతిక తత్వశాస్త్రంగానే ఘంటాపథంగానే చెప్పవచ్చు.ఇది ప్రజల చరిత్రతో విడదీయరాని సంబంధం వున్నశాస్రం.ప్రపంచ సృష్టిని గూర్చి లోకాయతులు ఏమంటారు ? ఇది ఏఅతీతశక్తుల వల్లనూ ఏర్పడింది కాదంటారు. భౌతిక పదార్ధాల పరిణామం వల్ల ఈ ఙగతి సృష్టి ఏర్పడిందనీ , దానిని ఏ భగవంతుడూ కారణం కాదని అంటారు.కామస్తనదగ్రే సమవర్త తాధిమనసోరేతః ప్రథమం యదాసీత్నతో బంధమనతి నిరనిందన్ హృదిప్రతీష్యాక వయో మనీషా
ఆంతరంగిక పరిణామం వల్లనే ఈ విశాల విశ్వం ఏర్పడింది. ప్రకృతి శక్తికి మొదట బీజం అట్లా ఏర్పడ్డదే. విజ్ఞానులు తమతమ విజ్ఞాన సంపత్తిచే, చేతనాచేతన విశ్వాన్ని విశ్లేషించారు.
ఇయం వి సృష్టిర్యత అబభూవ
య దివాదదే య దివాన
యో అస్వాధ్యక్షః పరమే
వ్యో మన్సఅగ వేదయదివా న వేద
విశ్వసృష్టి ఎక్కడనుండి వచ్చిందో ? ఇది సృష్దించబడ్డదా ? కాదా ? ఈ విషయాన్ని ఏదో స్వర్గలోకంలో వుండి పరిశీలించినవాడుగానీ, పరిశో్ధించినవాడుగాని, విచారించినవాడు గానీ ఎవడైనా వున్నాడా ? నాస్తికుల్ని దేహాత్మవాదులంటారు. అంటే వేదాంతులు చెప్పే ఆత్మ అనేది శరీరానికి భిన్నమైనది ఏదీ లేదని లోకాయతులు చెప్పారు. ఉపనిషత్తుల్లోనూ బ్రాహ్మణాల్లోనూ విభిన్న దేహవాదం అసురత్త్వంగా ప్రచారం చేసారు. అంటే లోకాయతుల దేహవాదం , అసురుల దేహవాదం , అభిన్నాలనే చెప్పాలి. తంత్రవాదుల దేహవాదం కూడా దీనితో అభిన్నంగానే కనిపిస్తుంది.ఆత్మ సిద్ధాంతం గురించి మైత్రాయణీ ఉపనిషత్తులో వుంది. ముందుగా దాన్ని తెలుసుకుందాం.దేవతలూ- రాక్షసులూ బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఇద్దరూ బ్రహ్మకు నమస్కారంచేసి – ఆత్మను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. దానిని గురించి చెబుతారా ? అని అడిగారు. ఆ మాటలు విన్న బ్రహ్మ కొంతకాలం ఆలోచించి తనలో తాను ఇట్లా అనుకున్నాడు. ఈ రాక్షసులు ఆత్మ కావాలని వచ్చారు. వీళ్ళకు ఆత్మను గురించి కాక దానికి వ్యతిరేకమైంది చెబుతాను అని అనుకొని అసురుల్ని పిలిచి వాళ్ళ వరకు ప్రత్యేకంగా  ఆత్మకు వ్యతిరేకమైంది చెప్పాడు. మూర్ఖులైన వాళ్ళు బ్రహ్మ చెప్పిన ఆత్మకువ్యతిరేకమైనదాన్నే  ఆత్మగా భావించి , దానిపై ఆధారపడి – ప్రయోజనకరము- శాశ్వితము- అయిన రక్షణను పోగొట్టుకొని అనేక ఇబ్బందులలో చిక్కుకొని జీవితాలను గడుపుతున్నారు. గారడీలోలాగానే – అసత్యమైనదాన్ని సత్యంగా భావించి ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో చెప్పిందే సత్యం, దాన్నేవిజ్ఞులైనవాళ్ళు ఆచరిస్తారు, దాని ఆధారంగానే జీవిస్తారు. బ్రాహ్మణుడైనవాడెవడూ అవైదికమైనదాన్ని చదువరాదు.     ఇదే కథ ఛాందోగ్యోపనిషత్తు  లో కొంచం వివరంగా వుంది.ఇందులో ఇంద్ర – విరోచనుల కథ చూడటం అవసరం. ప్రజాపతి – హృదయాంశంలో వుండే ఆత్మ , పాపరహితం-  చావు పుట్టుకలు – ముసలితనం – ఆకలిదప్పులు లేనిది. అది సత్యకామాలు- సత్య సంకల్పాలూ కలది. దానినే వెదకాలి. దానినే తెలుసుకోవాలి. దాన్ని ఎరిగినవాడు సర్వలోకాలూ -సర్వకామాలూ పొందుతాడు“  అని అన్నాడు.                   ప్రజాపతి ఈ మాటల్ని దేవతలూ , అసురులూ ఇద్దరూ  కర్ణాకర్ణిగా  విన్నారు. ఏ ఆత్మ జ్ఞానం వల్ల సమస్త లోకాలయొక్కయు , సర్వ కామాల యొక్కయు ప్రాప్తి కలుగుతుందో ఆ ఆత్మను తెలుసుకోవాలనీ వాళ్ళిద్దరూ మనసుల్లో కోరుకున్నారు.             దేవతల తరఫున ఇంద్రుడుఅసురుల తరఫున విరోచనుడు ఆత్మను తెలుసుకోవాలని బయలుదేరారు. చేతుల్లో దర్భలు ధరించి ఇద్దరూ వొకరికి తెలియకుండా ఒకరు ప్రజాపతి దగ్గరకు వచ్చారు. ఇంద్ర విరోచను లిద్దరూ  32 సం. ప్రజాపతి ఆశ్రమంలో బ్రహ్మచర్యంతో వున్నారు. ఒకనాడు ప్రజాపతి వాళ్ళని చూసి ఏం కోరి మీరీ ఆశ్రమంలో ఇంత కాలం ఉన్నారు ?” అని అడిగాడు.ఆ మాటలకు వాళ్ళు భగవాన్ ! ఆత్మ పాప రహితమైందనీ , జనన మరణాలు లేనిదని , ఆకలి దప్పులు లేనిదని , సత్యకామాలూ సత్యసంకల్పాలూ కలదనీ , అది తప్పనిసరిగా తెలుసుకోదగ్గదని , దాన్ని తెలుసుకున్నవాడు  సర్వలోకాలూ, సర్వకామాలూ పొందగలడనీ మీరు చెప్పినట్లుగావిని , ఆ ఆత్మను తెలుసుకోవాలని వచ్చాం.    అని సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం విన్న ప్రజాపతి ఈ కళ్ళకు కనబడే పురుషుడే ఆత్మ అది అమృతం, అభయం, బ్రహ్మం అయివుంది అని వాళ్ళతో చెప్పాడు. ప్రజాపతి ఈ మాటలు విన్న ఇంద్ర విరోచనులిద్దరూ భగవాన్! ఈ నీళ్ళలోనూ, ఈ అద్దంలోనూ కనబడే ఆత్మ ఏది ?  అని అడిగారు. దానికి ప్రజాపతి నీటిలోనూ , అద్దంలోనూ కనబడే ఆత్మా కళ్ళకు కనబడే ఆత్మ ఒక్కటే అని చెప్పాడు. ఇంకా  ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ తరవాత ఆత్మను గూర్చి మీకు తెలియని విషయాలను నన్నడగండి అని  ఇంద్రవిరోచనులకు ప్రజాపతి చెప్పాడు. వాళ్ళిద్దరూ ప్రజాపతి చెప్పినట్లే నీటి పాత్రలో తమ్ముతాము చూచుకొన్నారు. మీకేమి కనబడింది ? అని ప్రజాపతి ఇద్దర్నీ అడిగాడు. ఇద్దరూ భగవాన్! మాకు మా పూర్ణ రూపం కనబడుతుంది. రోమముల నుండి గోళ్ళ వరకు మా ప్రతిరూపం మా ఛాయ కనబడుతుంది అని సమాధానం చెప్పారు. ప్రజాపతి మళ్ళా వాళ్ళను చూచి మీరు బాగా అలంకరించుకొని , మంచి బట్టలు ధరించి బాగా శుద్ధి చేసుకొని , ఇంకోసారి నీటిపాత్రలో చూడండి అని అన్నాడు. ఇంద్ర విరోచనులిద్దరూ అట్లాగే చేశారు. మీరేమి చూస్తున్నారు ? ” అని ప్రజాపతి ఇద్దర్నీ ప్రశ్నించాడు. ఇద్దరూ భగవాన్! మేమెట్లా అలంకరించుకొన్నామో , మంచి బట్టలు ధరించి వున్నామో , శుద్ధి చేసుకొని వున్నామో అట్లాగే మా ప్రతిబింబాలున్నాయి అని ప్రజాపతికి సమాధానం చెప్పారు.  ఆ సమాధానం విన్న ప్రజాపతి ఇదే ఆత్మ! అమృతం , అభయం, బ్రహ్మం అని వాళ్ళకు చెప్పాడు. ప్రజాపతి చెప్పిన ఆ మాటలు విని ఇద్దరూ శాంత హృదయులై వెళ్లిపోయారు.   ఇట్లా శాంతహృదయులై వెళుతున్న ఇంద్ర, విరోచనులను చూచి ప్రజాపతి వీళ్ళిద్దరూ ఆత్మను పొందకయే , తెలిసికొనకయే వెళుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవడు ఈ దేహమే ఆత్మ అదో ఉపనిషత్తుకు అనుయాయి అవుతాడో వాడు పరాజితుడవుతాడు  అని తనలో తాను అనుకున్నాడు. విరోచనుడు శాంతహృదయంతో రాక్షసుల్ని సమీపించి శరీరాన్ని ప్రకాశవంతంగా , సుందరంగా అలంకరించుకోవడంలోనే విరోచనుని చిత్తం మునిగిపోయింది. అతడు –“ ఈ దేహం ఆత్మ   అని అసురులకు ఉపదేశించాడు.   ఈ దేహమే  ఆత్మ . దీనినే పూజించాలి; దీనికే సేవలు చేయాలి. ఇట్లా చేస్తే మనుష్యుడు ఈ లోకాన్నీ, పరలోకాన్నీ పొందుతాడు అని విరోచనుడు అసురులకు బోధించాడు.ఇక ఇంద్రుడు దేవతల దగ్గరికి పోక ముందే అతనికి భయం వేసింది. ప్రజాపతి ఉపదేశం వల్ల అతడాత్మయొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఇట్లా ఆలోచించాడు. నీటిలో కనబడ్డ నీడ  శరీరం బాగా అలంకరించుకొంటే అది కూడా అలంకరింపబడుతుంది. ..శరీరం నశిస్తే ప్రతిబింబం నశిస్తుంది. కాబట్టి ప్రతిబింబం ఆత్మ ఎట్లా అవుతుంది ? అని ఆలోచించి మరలా ప్రజాపతి వద్దకు పోయి అడిగాడు. ఇంద్రా! నీవు బాగా తెలుసుకున్నావు. ఆత్మను గురించి నేను నీకు మరలా ఉపదేశిస్తా ! నీవు ఇంకా 32 సం|| లు బ్రహ్మచర్యంతో నా ఆశ్రమంలో వుండాలి  అన్నాడు. ఇంద్రుడు సరే నన్నాడు. ప్రజాపతి ఇంద్రుడికి వివిధ మార్గాల ద్వారా ఆత్మను గురించి చెప్పినట్లు తక్కిన భాగమంతా సాగింది.దీన్నిబట్టి చూసినా అత్మ అనేది ప్రత్యేకంగా శరీరానికి భిన్నంగా వుందని లోకాయతులు చెప్తున్నట్లు లేదు. అసురవాదంగా చెప్పేదంతా లోకాయత సిద్ధాంతమే.

—–భౌతికవాద, చార్వాక, లోకాయత తత్త్వశాస్త్ర ప్రచారకునిగా వుంటూ ది.18-4-2007న మరణించిన  ప్రముఖ భౌతికవాది, నాస్తికోద్యమ నాయకుడు  బి.రామకృష్ణ గారు రచించిన చార్వాకం గ్రంథం నుండి.ఉపాధ్యాయ సౌజన్యంతో.  

ప్రకటనలు

పరస్పర విరుద్ధ తత్వ శాస్త్రాలు

06/05/2007
దోపిడీ తత్వ శాస్త్రం
దీనికి మరో పేరు ‘ అసత్యం ‘
మార్క్సిష్టు తత్వ శాస్త్రం దీనికి మరో పేరు ‘ సత్యం ‘
1) సమాజంలో పూర్వం నుంచీ
రెండు రకాల వాళ్ళు ఉన్నారు.
సోమరులూ, పొదుపరులూ!
సోమరులేమో పేదలయ్యారు.
పొదుపరులు ధనికులయ్యారు.
సమాజంలో రెండు రకాల వాళ్ళు
ఉన్నారనేది నిజమే.కానీ వాళ్ళు
సోమరులూ, పొదుపరులూ కాదు.
దోపిడీదారులూ, శ్రామికులూ!
శ్రామికులే పేదలయ్యారు.
దోపిడీదారులు ధనికులయ్యారు.
2) స్వంతాస్తిని కూడబెట్టుకునే హక్కు
ఎవరికైనా వుంటుంది. ఎవరికి ‘ శక్తి ‘
ఉంటే వాళ్ళు కూడబెట్టుకోవచ్చు.
‘శక్తి ‘ అంటే ,’ ఉత్పత్తి సాధనాల ‘మీద
దౌర్జన్యంగా సంపాదించిన యాజమాన్యమే.
‘స్వంత శ్రమ ‘తో ఏర్పడే ఆస్తి, జీవితావసరాల్ని
తీర్చడానికి మాత్రమే సరిపోతుంది.
ఆ స్థాయిని మించిన ఆస్తికూడితే అది దోపిడీ
ద్వారానే సాధ్యం. దీన్ని కవితాత్మకంగా చెప్తే
‘ఆస్తి చౌర్యమే‘! ‘ఆస్తి ‘ అంటే స్వయంగా శ్రమించే
వాళ్ళ ఆస్తీ, దోచుకొనేవాళ్ళ ఆస్తీ ఒకటికాదు.
” రాజకీయ ఆర్ధిక శాస్త్రం చాలా భిన్నమైన
వేరు వేరు రకాల ఆస్తుల్ని గందరగోళపరుస్తుంది.
వాటిలో ఒకటి- ఉత్పత్తిదారుల స్వంత శ్రమ మీద
ఆధార పడినది. రెండవది- ఇతరుల శ్రమని
నియమించడం మీద ఆధారపడినది” -మార్క్స్
3) వ్యక్తిగత ఆస్తి లేకపోతే
పనిచెయ్యాలనే ఉత్సాహం
ఉండదు.
బానిసలు పని చేసిందంతా వాళ్ళ వ్యక్తిగత
ఆస్తి మీదేనా? ఈనాడు కార్మికులు పని
చేస్తున్నది తమ వ్యక్తిగత ఆస్తులమీదేనా?
స్వంత ఆస్తులు లేకుండానే వాళ్ళు ఎందుకు
పని చేస్తున్నారు? యజమానుల ఆస్తులన్నీ
స్వంత ఆస్తులే కదా? పని చెయ్యటానికి
యజమానులకు ఎందుకు ఉత్సాహం ఉండటం
లేదు? వాళ్ళ ఆస్తే వాళ్ళకు ఎందుకు
ఉత్సాహం ఇవ్వటం లేదు?
4) రాజ్యాంగ యంత్రం
శాంతి భద్రతలు
కాపాడుతుంది.
శతృవులనుంచి
రక్షిస్తుంది.
నిజమే. దోపిదీ వర్గ రాజ్యాంగ యంత్రం ,
దోపిదీ వర్గ శాంతి భద్రతలు కాపాడుతుంది.
దోపిడీ వర్గాన్ని శతృవులనుంచి, అంటే
శ్రామిక వర్గం నుంచి రక్షిస్తుంది. కాబట్టి
రాజ్యంగ యంత్రం రెండు వర్గాల కోసం పని
చెయ్యదు.
5) గత సమాజం మాట
వేరుగానీ, ఇప్పుడు మాత్రం
పెట్టుబడిదారులూ,కార్మికులూ
సమానమే.
కాదు. ఈ సమాజం కూడా గత సమాజాల మారు
రూపమే. ఈ సంబంధం కూడా దోపిడీ సంబంధమే.
యజమానీ సేవకుల సంబంధమే. ఇది కూడా
తప్పుడు సామాజిక సంబంధమే.
(ఫాల్టీ సోషల్ రెలేషన్)
6) స్వార్ధం అనేది
మానవ
స్వభావం
లోనే
వుంది.
మొదట మానవులందర్నీ ఏకం చేసి మాట్లాడడం
తప్పు. మానవులు- వర్గ మానవులే.బానిసకి
స్వార్ధం ఏమిటి? శ్రామికులకు ఉన్న స్వార్ధం
ఏమిటి? తమ శ్రమలో అత్యధిక భాగాన్ని
ఉచితంగా ధారపోస్తూ, యజమాని వర్గానికి,
రాత్రింబవళ్ళూ సేవలు చేయడమేనా?
‘స్వార్ధం ‘ అంతా యజమాని వర్గానిదే.
మానవులందరిదీ కాదు.
7) మానవులు
సహజంగానే
చెడ్డ వారు.
నేరాలు
చేస్తారు.
నేరాలకీ, చెడ్డతనానికీ మూలం దోపిడీయే.
దోపిడీయే పెద్ద నేరం. దాని ఆర్ధిక రాజకీయ
ప్రయోజనాలకోసమే నేరాలన్నీ పుట్టుకొచ్చాయి.
నేరస్తులంతా దోపిడీవర్గం వల్ల తయారైన
వాళ్ళే. శ్రామిక వర్గం చేసే నేరాల్లో కొన్ని
బ్రతుకుదెరువు కోసమూ,కొన్ని దోపిడీవర్గ
ప్రభావం వల్లా జరుగుతాయి. మనుషులు
పుట్టినప్పుడు మంచివాళ్ళూ కారు. చెడ్డవాళ్ళూ
కారు. సమాజమే వాళ్ళని మంచిగానో, చెడ్డగానో
తయారు చేస్తుంది. సమాజంలో నేరాలూ, చెడ్డ
తనమూ ఉన్నాయంటే, ఆ సమాజం బ్రహ్మాండమైన
తప్పులో వుందన్నమాట. దోపిడీ సమాజమే
శాశ్వితంగా కనబడే వాళ్ళకి, దాని లక్షణాలన్నీ
శాశ్విత లక్షణాలుగానే కనబడతాయి. నేరాలు
చెయ్యటమూ, చెడ్డతనమూ మనుషుల శాశ్విత సహజ
లక్షణాలలాగే కనబడతాయి.
8 ) జాతీయ ఆదాయంలో
న్యాయమైన
పంపిణీ
జరగాలి.
శ్రామిక వర్గం నుంచి అదనపు విలువనీ ‘లాగే ‘
విధానం అలాగే వుండాలి. కౌళ్ళూ, వడ్డీలూ,
లాభాలూ అన్నీ అలాగే వుండాలి. కానీ
జాతీయాదాయంలో ‘న్యాయమైన పంపిణీ ‘
‘ న్యాయమైన ‘
9) రాజకీయాల్నిబట్టే
ఆర్ధిక విషయాలూ
వుంటాయి.
కాదు. రాజకీయాలకి ఏదో ఒక ‘లక్ష్యం ‘
వుంటుంది. ఆర్ధిక పునాదిని నిలబెట్టడమో,
నిర్మూలించడమో. ఆ లక్ష్యం కోసమే
రాజకీయాలు అవసరం. కాబట్టి, ఆర్ధిక
విషయాల్నిబట్టి రాజకీయాలు; అంతేగాని
రాజకీయాల్ని బట్టి ఆర్ధిక విషయాలు కావు.
10 ) పేదలకి ‘ న్యాయం ‘
జరగాలి !
పేదలకి
‘ సేవ ‘
చెయ్యాలి !
పేదలే ‘ అన్యాయం ‘! అన్యాయానికి న్యాయం అంటే,
అన్యాయాన్ని అలా ఉంచటమే. అంటే ,పేదల్ని అలాగే
ఉంచి ,వారికి ‘న్యాయం ‘ చేస్తారన్నమాట !
పేదల సేవల్లో ప్రభుత్వాలూ, పేదల సేవల్లో
క్లబ్బులూ, పేదల సేవల్లో స్వచ్చంద సంస్థలూ !
అందరూ పేదల సేవ చేసే వాళ్ళే! పేదల్ని
సృష్టించేదే వీళ్ళు! ‘పేదతనం ఎందుకువుంది ‘
అనే ప్రశ్న మాత్రం వీళ్ళకి పట్టదు. తర తరాల
నుంచి పేదలే మీకు సేవ చేస్తున్నారు.భవిష్యత్తులో
పేదలు మీకు ఇంకా ఘనమైన సేవ చేస్తారు.
మిమ్మల్ని యజమాని పీఠాలమీద నించీ లాగి,
నిజమైన మనుషులుగా మార్చే సేవ పేదలే
మీకు చేస్తారు.
11 ) మానవ
జీవితాన్ని
‘ఆర్ధిక
పరిధి ‘లో
ఇమడ్చకూడదు.
అవును. మార్క్సిజం చెప్పేది కూడా అదే. ‘మానవ
సంబంధాల్ని డబ్బు సంబంధాలుగా వుంచ
కూడదు ‘ అనే. దానికోసం మార్క్సిజానికి ఒక
సిద్ధాంతమూ ,ఒక కార్యక్రమమూ కూడా
వున్నాయి.కానీ మీ దగ్గర అవేమీ లేవు.
మీ దగ్గర వున్నదంతా ‘డబ్బుతో డబ్బుని
పెంచుతూపోయే ‘కార్యక్రమమే. పైగా జీవితాల్ని
డబ్బు పరిధిలో ఇమడ్చకూడదు అనే చిలక
పలుకులూ, దొంగ నీతులూ! మీ ప్రకారం
డబ్బు శాశ్వితం! డబ్బు దోపిడీ శాశ్వితం!
డబ్బు సంబంధాలు శాశ్వితం! కానీ,
‘డబ్బు ‘ని నిజంగా తిరస్కరించే సిద్ధాంతం మాదే.
మార్క్సిజమే !
12) మానవుల స్వేచ్చమీద
నిషేధం వుండరాదు
మానవులు రెండురకాలు. ‘ స్వేచ్చ ‘ కూడా రెందు
రకాలు.దోపిడీదారులు దోపిడీ చెయ్యడానికి
స్వేచ్చ కావాలంటారు.స్వేచ్చకి అది వాళ్ళ
అర్ధం. కానీ, శ్రామికులు దోపిడీ చేసే స్వేచ్చ
ఎవరికీ వుండరాదని అంటారు. ఆ స్వేచ్చ తమకి
కూడా వుండరాదంటారు. స్వేచ్చకి వీళ్ళ
అర్ధం ఇదీ. కాబట్టి స్వేచ్చ కూడా వర్గ
స్వభావం కలదే.దోపిదీ అనేటంత పెద్ద విషయం
అయినా, ‘గోళ్ళని పెంచడం ‘అనేంత చిన్న విషయం
అయినా ఎవరి స్వేచ్చ వాళ్ళదికాదు. సమాజంలో
ఇతర మనుషులతో కలసి జీవిస్తున్నప్పుడు
సమాజానికి ఏరకంగానూ హాని కలిగించని
విధంగా , స్వేచ్చ పరిమితమై వుండాలి.
‘నా గోళ్ళు నాయిష్టం ‘ అని ఒక మనిషి
బారెడు బారెడు గోళ్ళని పెంచి తిరుగుతూవుంటే.
ఆ మనిషిని పట్టుకొని ఆగోళ్ళని కత్తిరించి
వెయ్యడానికి అందరికీ స్వేచ్చ వుంటుంది.అది
సమాజ ఆరోగ్య రక్షణకి ఆత్మరక్షణకీ
అవసరం.అదీ స్వేచ్చకి అర్ధం
13) నిమ్నవర్గాలు ఇప్పుడు
మారిపోతున్నాయి.
ఫలానా దేశములో
ఫలానా నిమ్నవర్గ
వ్యక్తిని తీసుకోండి.
ఉదా|| భారత దేశంలో
అంబేద్కర్ ని తీసుకోండి.
ఆయన ఎంత
అభివృద్ధి చెందాడు!
ఒక వ్యక్తి అభివృద్ధే మొత్తం వర్గ అభివృద్ధి
కాదు; అంతేగాక, అంబేద్కర్ అభివృద్ధి ఆ వ్యక్తి
నిజమైన అభివృద్ధి కాదు.శ్రామిక వర్గం
వాడైన అంబేద్కర్ మార్క్సిజం గురించి తెలిసి
కూడా అది పనికిరాదని తన రచనల్లో
ప్రకటించడంవల్ల శ్రామిక వర్గానికి గాక
పెట్టుబడిదారీ వర్గానికే మేలు జరిగింది.
” పాలకవర్గం పాలిత వర్గపు మేధావుల్ని
ఎంత ఎక్కువగానైతే తనలో ఇముడ్చుకుంటుందో ,
అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ
దాని పాలన తయారవుతుంది ” -మార్క్స్
(కాపిటల్ -3,పేజీ -601)
14) ఆస్తులకు పెట్టుబడిదారులు
ధర్మకర్తలుగా (ట్రష్టీలుగా)
ఉంటారు. కార్మికులు దేశభక్తులుగా కష్టించి పని చేస్తారు.(భారత దేశపు ఆధునిక తత్వవేత్త అయిన
మహాత్మాగాంధీ గారి ట్రష్టీ
షిప్పు సిద్ధాంతం. “షోషలిజం
ఆఫ్ మై కన్ సెప్షన్ ” -అనే
పుస్తక సారాంశం)
ఏం? ఆస్తులకు కార్మికులే
ధర్మకర్తలుగా వుండి,
పెట్టుబడిదారులే
కష్టించి పనిచేసే
దేశభక్తులుగా
ఎందుకు వుండకూడదు?
15)”మళ్ళీ జన్మ అంటూవుంటే
పాకీ వాడిగా పుడతాను “-
మహాత్మా గాంధీగారు.
మళ్ళీ జన్మదాకా ఎందుకూ? చెయ్యదలచుకున్న
సత్కార్యాన్ని మళ్ళీజన్మదాకా వాయిదావేసి
ఈ జన్మని వృధాచెయ్యడమెందుకూ? ఆ కార్యం
ఈ జన్మలోనే ఎందుకు ప్రారంభించకూడదూ?
16)’ షోషలిజంలో రాజు, రైతూ – ధనికుడూ, పేదా, యజమానీ-ఉద్యోగీ -అందరూ సమాన
స్థాయిలో వుంటారు” భారత తత్వవేత్త
మహాత్మా గాంధీగారు. (షోషలిజం
అఫ్ మై కన్ సెప్షన్ పేజీ-1)
గాంధీగారి ‘సోషలిజం ‘లో -ఒకవేపు రాజులూ,
ధనికులూ,యజమానులూ; ఇంకోవైపు రైతులూ,
పేదలూ,శ్రామికులూ- అందరూ ఎప్పటిలాగే
వుంటారు. కానీ అందరూ సమాన స్థాయిలో
వుంటారు! ఈ ‘సమాన స్థాయి ‘ ఏవిషయంలో?
ఏమో దాన్ని వారు వివరించలేదు.సమాన స్థాయీ,
సోషలిజమూ అనే మాటల్ని మాత్రం గాంధీగారు
కూడా తన తత్వశాస్త్రంలోకి చేర్చుకోక తప్పలేదు.
17) ‘భూస్వాములు
తమ మిగులు భూమిని
పేదవర్గాల కోసం
దానం చెయ్యాలి ‘
భూదానోద్యమ తత్వవేత్త
అయిన వినోబాభావే.
‘ మిగులు ‘భూమి! ‘మిగులు ‘ అంటే? భూస్వాములు
తమకు ఇష్టమైనంత తీసుకోగా ,దాచుకోగా,
ఆ పైది ఎంతోకొంత! భూస్వామి, తనకోసం
తీసుకున్న భూమిని భూస్వామి కుటుంబమే
స్వంత శ్రమతో పండించుకుంటుందా? దాన్ని కూడా
వ్యవసాయ కార్మికులే పండిస్తే ,జీతాలూ,
అదనపువిలువా అంతా ఎప్పటిలాగే. ఈ సమస్యని కూడా
భూదానొద్యమం ఎలపెరిష్కరిస్తుంది?
18) సమాజం నాకేమిచ్చిందని
కాదు. సమాజానికి
నేనేమిచ్చానని చూడాలి.
ఎప్పుడూ ‘ వ్యక్తి ‘నుంచీ లాగడమే చేసే సమాజం ఇలాంటి సూక్తులే చెపుతుంది. ‘ తీసుకోవడం ‘ ఉన్న ప్రతీ చోటా ‘ ఇవ్వడం ‘ కూడా వుండాలి. ‘ సమాజానికి నేనే మిచ్చాను ‘ అని ప్రశ్నించుకునే వ్యక్తికి , ‘ సమాజం నాకేమిచ్చింది ‘ అని ప్రశ్నించడానికి కూడా హక్కు వుంటుంది. ఎప్పుడూ తీసుకోవడమేగాని ఇవ్వడం చెయ్యని సమాజం వ్యక్తులకు ఏ మేలూ చెయ్యదు.వ్యక్తి, సమాజం కోసం అయితే, సమాజం వ్యక్తి కోసం కూడా! వ్యక్తికి , సమాజానికి వైరుధ్యం వుండరాదు. రెండూ వేరు వేరు కాదు. రెండింటి శ్రేయస్సూ ఒక్కటే.
19) మత గ్రంధాలన్నీ
సర్వజనుల సుఖాన్నే
చెప్పాయి.’గీత ‘లో
చూడండి,’బైబుల్ ‘లో
చదవండి.’ఖురాన్ ‘ లో
పరికించండి. ‘సర్వే
జనా సుఖినో భవంతు ‘
అన్నారు మన పెద్దలు.
అన్నారు సరే! ఇప్పుడు సర్వజనమూ సుఖంగా
ఎందుకులేరో, కొంతమంది జనం దుఃఖంగా ఎందుకు
వున్నారో ఏం కారణం చెప్పాయి మత గ్రంధాలన్నీ?
‘దోపిడీ’ని చెప్పాయా ? సర్వజనమూ సుఖంగా
వుండేవిధంగా సమాజాన్ని మార్చడానికి
మార్గం చెప్పాయా? ‘వర్గ పోరాటం ‘చెప్పాయా?
దేవాలయాల్లోనూ,చర్చీల్లోనూ,మసీదుల్లోనూ
నిరర్ధకంగా మోకరిల్లడం తప్ప, నిజజీవితాల్ని
మార్చగలిగే ఒక్క జ్ఞానవంతమైన మాట చెప్పాయా?
‘సర్వేజనా సుఖినోభవంతు ‘అనగానే ‘సుఖినో
భవంతు ‘ అవుతుందా? ‘మంత్రాలకు చింతకాయలు
రాలవనే ‘ మామూలు సంగతి కూడా మత
గ్రంధాలకి తెలియదు కదా?
20) వర్గపోరాటం హింస. ఆమాట అనేముందు దోపిడీవర్గం తన సమస్త
ఆయుధాల్నీ త్యజించాలి.తన పోలీసునీ,
కోర్టుల్నీ, జైళ్ళనీ,సైన్యాన్నీ అన్నిటినీ
రద్దు చెయ్యాలి. సమస్త ఆయుధాల్నీ పెట్టుకు
కూర్చున్నదీ దోపిడీ వర్గమే.యుగయుగాలుగా
వూహాతీతమైనంత హింస చేస్తున్నది దోపిడీ
వర్గమే.శ్రామిక వర్గాన్ని అణచడానికి
చేసేదే హింస.ఆహింసనుంచి బయటపడటానికి
ఎదురుతిరగడం హింస కాదు.అది ఆత్మరక్షణ
కోసం పోరాటం.విముక్తిచెందడం శ్రామిక వర్గం
హక్కు.ఆహక్కుని గ్రహించి దోపిడీ వర్గం స్వచ్చందం
గానే, తన దోపిడీని వదులుకుంటే , ఫోరాటమూ
వుండదు, హింసా వుండదు. హింసకి కారణం
మొదటినుంచీ దోపిడీ వర్గమే.
21)” యజమానులు
మేనేజిమెంటు పనిని
కూడా మానుకుంటే
‘తత్వ శాస్త్రం ‘
చదువుకోవచ్చు”.
-అరిస్టాటిల్
మరి, పనివాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి తత్వశాస్త్రం?
యజమానులు కూడా పనివాళ్ళతోపాటే పనిలోకి దిగితే
అప్పుడు అందరికీ పనికాలం తగ్గుతుంది.అప్పుడు అందరూ
తత్వశాస్త్రం చదువుకోవచ్చు.

-మార్క్స్ కాపిటల్-5వ భాగం నుండి.
పరిచయం:శ్రీమతి .రంగనాయకమ్మ