2. మార్పును గుర్తించిన ద్రష్టలు
ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో “ క్రాంత దర్శులు “ గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన “ కన్యక “ బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి “ కోటల్ని “ నేలమట్టం చేశారు. రాచరికాల అనివార్య పతనాన్ని ప్రజాస్వామిక యుగారంభాన్ని చాల సహజ పరిమాణంగా యుగచైతన్యంతో చెప్పిన “ స్రష్ట “ గురజాడ అప్పారావు – అందుకు వారి “కన్యక“ కావ్యం మకుటాయమానం.
‘ సామాజిక స్పృహ ‘ ను రాజ్యాధికారుల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చాటినా – గురజాడ వారు పూర్తిగా సాంప్రదాయ పట్టులోంచి బయటపడలేదనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వారు సూచించిన “ పాతకొత్తల మేలు కలయిక “ అభివృద్ధిచెందే సమాజానికి ఎంత ప్రతిబంధకమో నిర్మొహమాటంగా ఆలోచించాల్సివుంటుంది.
అందువల్ల ‘ సామాజిక స్పృహ ‘ అనేది నిత్య నూతనంగా అభివృద్ధి చెందే అభ్యుదయ సూచిక అని కొంతవరకు మాత్రమే పోయి ఆగిపోయే “ పోటీ యత్నము “ కాదు.
దారిపక్క బిచ్చగత్తెలు , ‘ రాక్షసరతి ’ లో నలిగే పడుపుగత్తెలు, సమ్మెగట్టే కూలీలు, కూలీల భార్యలు , ఉరికంబాలకు వేలాడే ధీరులు కావ్యవస్తువులుగా గ్రహించిన ‘ అభ్యుదయ కవిత్వం ’ , దగాపడిన తమ్ముళ్ళందరినీ ‘ పదండి ముందుకు ‘ అని విప్లవ శంఖం పూరించింది. తెలుగు కవిత్వంలో ఈనాటి ‘ సామాజిక స్పృహ ‘ ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకుంది.
మొట్టమొదటి సారిగా సామాన్యుని మాన్యుగా చేసిన సాహిత్యోద్యమం ‘ అభ్యుదయ కవిత్వం ’. అయితే కవి తనకు తానుగా సాధించిన నూతన విషయం కాదనేది కూడా గుర్తించాలి. దాన్ని కవి చేసిన అద్భతంగా మాత్రమే గుర్తిస్తే అభివృద్ధి చెందే ప్రజల నిర్ణయాత్మక పోరాట శక్తిని నిర్లక్ష్యం చేసిన వారలం కాగలం. అలా చారిత్రక పరిణామాల్ని వర్గ పోరాటాల విజయాల ద్వారా ముందుకు తెస్తున్న ప్రజల్ని గుర్తించడంలో కవి కృతకృత్యుడైనాడనేది సత్యం. కానీ కవి మాత్రమే పోరాట సత్యాన్ని సృష్టించాడనేది అసత్యం. ఈ వివేచనా లోపం వల్లనే కొందరు కవులు శాసకులుగా ప్రజల మీద స్వారీ చెయ్యడానికి సాహసిస్తున్నారు. కవి అహంకారి కాదు.
కవి నడుస్తున్న చరిత్రలో వెలుగులు చూస్తాడు. కాబట్టే అతడు క్రాంతదర్శి. ఈ క్రాంత దర్శిత్వం చూసే నిత్య వికాసమే ‘ సామాజిక స్పృహ ‘ . ఇది దినదిన ప్రవర్ధమానమయ్యే ఆత్మ చైతన్యం. అభ్యుదయ కవితా ఉద్యమం , మార్పును సంస్కరణ వాదానికి ముడివేసి ఊరుకుంది. వ్యవస్థను సమూలంగా మార్చకుండా కొన్ని సంస్కరణల్నిలక్ష్యిస్తే సరిపోదు. “ నలుగురు కలసి పొరుపులు మరచీ చేయాలి ఉమ్మడి వ్యవసాయం “ అనే రాజకీయ కార్యక్రమ నినాదం ఎలాంటి సంస్కరణ వాదాన్ని సూచిస్తుందో పరిశీలించండి. భూముల పంపకం కాకుండా “ ఉమ్మడి వ్యవసాయం “ అనేది నెహ్రూగారి గమ్మత్తు. దానికి కవి బలికారాదు. వ్యవసాయ విప్లవం మాత్రమే రైతు సోదరులకు న్యాయం చేస్తుంది.
అందువల్ల సంస్కరణలు కూడా సమాజం సమూలంగా మారే విప్లవ క్రమంలో భాగం కావాలి గానీ , విప్లవాన్ని గల్లంతు చేనే కార్యక్రమాలు కారాదు. అందుకే సంస్కరణవాదం సర్వరోగ నివారిణి కాదు. అది దారి తప్పించే రాజకీయ వ్యూహంలో దానికి కవి బలికారాదు. అభ్యుదయకవి బలి అయినాడు.
సంస్కరణలద్వారా సామాజిక సమస్యలు పరిష్కరింపబడతాయనే భ్రమల్లో ప్రజలు లేరు. సంస్కరణవాదానికి కాలం చెల్లి పోయింది. ఇది సమాజం సమూలంగా మారాలనే విప్లవాల యుగం. అమెరికా ప్రపంచవ్యాప్తంగా పోరాటాల విస్తృతి కొనసాగుతుంది. పరాయి పాలనలో మగ్గుతున్న దేశాలు ( ఆఫ్రికా ) స్వాతంత్ర్యాన్ని కోరుతూ తెగించి పోరాడుతున్నాయి. అలాగే పీడిత జాతుల విముక్తి కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అభివృద్ధి చెందిన ఈ ప్రపంచ నైజాన్ని నేటి కవి గుర్తించి తన ‘ సామాజిక స్పృహ ‘ ను నిత్యనూతనంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడంలో అభ్యుదయ కవి విఫలం అయ్యాడు. కాబట్టే విప్లవకవి తెలుగు సాహిత్యానికి అవసరం అయ్యాడు.. ఈ విధంగా అభివృద్ధి చెందిన కవి తిరిగి సంక్షోభానికి గురై ప్రజలు మాత్రమే విప్లవాన్ని తద్వారా సమూలమైన మార్పును తెస్తారనే నైజాన్నికొందరి వీరుల సాహస చర్యగా భావించి విప్లవ బాధ్యతారంగాన్ని సంకుచితం చేశాడు.
అందువల్ల ‘ సామాజిక స్పృహ ‘ అనేది వ్యక్తి చైతన్యమే కాదు సమాజ స్పందన కూడా. తనలో తాను అభివృద్ధి చెందుతూ , అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకపు ప్రపంచంతో తాదాత్మయం చెంది ముందుకు పోయే పోరాట నైజాన్ని గుర్తించాలి. తాను ముందుకు పోతూ ముందుకు పోయే సమాజాన్ని పట్టుకోవాలి.
