ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో ‘ సామాజిక స్పృహ ‘ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి ‘ సోషలిజం ‘ మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి ‘సామాజిక స్పృహ‘ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.
సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల వత్తిడి. రెండవది అందులో దూరి దాన్ని లేకుండా చేయటం.
భౌతిక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధాన్ని వైదికులు దశావతారాల్లో చేర్చి బుద్ధుణ్ణి విష్ణువు అవతారంగా జమ కట్టేశారు. ఆ తర్వాత బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా సర్వనాశనం చేశారు. అంతే క్రూరంగా చార్వాకుల్ని నేలమట్టం చేశారు.
రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాజానుగుణంగా ఉండాలనేది ప్రజలు ముందుకు తెచ్చిన నైజం. దీన్నీ అంగీకరిస్తున్నట్లు అభినయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టటానికి ‘ సామాజిక స్పృహ ‘ అనే మాటను పాలకులు యధేచ్చగా వాడుతున్నారు.
నిజానికి ఈ మాటకు నిర్వచనం ఏమిటి ? అభివృద్ధి చెందుతున్న సమాజం గురించి పట్టించుకొని దానికి న్యాయం చెయ్యడం. మళ్ళీ ఇక్కడ “ ఏ అభివృద్ధి ” అనేది వస్తుంది. బిల్డింగులా? అధికారాలా? ప్రణాళికలా? పదవులా? లేక ప్రజల ఆశయాలా?
మార్పును కోరే శక్తులకు మార్పును ప్రతిఘటించే శక్తులకు సమాజంలో వివిధ స్తాయిల్లో ఘర్షణ తప్పదు. ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజల శ్రేయస్సును కాంక్షించటమే ‘ సామాజిక స్పృహ ‘ . ఇది కూడా నిరంతరం అభివృద్ధి చెందే పోరాట నైజం. దీనికనుగుణంగానే అన్ని రంగాల్లో సాపేక్షికంగా “ అభిప్రాయాలు “ ప్రచారం అవుతాయి.
ఈ సామాజిక స్పృహ కొత్త విషయమా?
‘ సామాజిక స్పృహ ‘ అనేది పత్రికలు , మేధావులు , రాజకీయ నాయకులు సృష్టించిన కొత్తమాటా? – కాదు – ఏదో ఒక రూపంలో ఈ భావం అనాదిగా కొనసాగుతున్నదే.
ఎవరైతే సామాజిక ఉత్పత్తి సాధనాల్ని స్వాధీనం చేసుకున్నారో వారే జీవితానికి సంబంధించిన సమస్త విషయాల్ని శాసించారు. ఆర్ధిక ప్రయోజనాల్ని బట్టే , సారస్వతం, తాత్వికసూత్రాలు, మతనియమాలు, లలితకళలు నిర్వచించబడి పోషింపబడతాయి. వీటినే “ సంప్రదాయం “ క్రింద పెద్దలు ప్రచారం చేస్తారు.
నన్నయ్యగారి భారతాంధ్రీకరణలో “ అక్షరరమ్యత “ ఎంత ఆకర్షణీయంగా పండితులకు కన్పించినా అది రాజరాజనరేంద్రుడు కోరిన “ జగద్ధితంబు “ గా విరాజిల్లిందనేది దాచేస్తే దాగని సత్యం. అధిక సంఖ్యాకులైన పదకొండవ శతాబ్దపు తెలుగు ప్రజలు , “ వేదాల ప్రామాణికతను “ తిరస్కరించే జైన బౌద్ధాల వెంటపడిపోవడాన్ని అరకట్టడానికి వైదికమత పునరుద్ధరణకు మాత్రమే భారతాంధ్రీకరణ జరిగిందనేది చారిత్రక సత్యం .
వైష్ణవులు, శైవులూ తగాదా పడుతూ వుంటే జైనబౌద్ధాలు విజృంభించి వైదికమతం నేలమట్టం అవుతుందనే భయం వల్ల తిక్కన “ హరిహరనాధతత్వాన్ని “ నాటి తెలుగు సమాజానికి తరుణోపాయంగా సూచించారు. దీనితో పాటు భారతాంధ్రీకరణ శేషభాగాన్ని “ నాటకీయత “ అనే శిల్పంతో పూరించాడు.
సామాజిక శక్తుల ఆర్ధికావసరాలకు భిన్నంగా ఏ సాహిత్య ప్రమాణాలూ రావు – వచ్చినవన్నీ ప్రజలకనుకూలంగా ఉండవు. సాహిత్య కళా రూపాలూ అంతే. కావ్య శోభకు, కళారూపానికీ , శబ్దసౌందర్యానికి భ్రమపడి సాహిత్య ప్రయోజనం ఏ విషయంలో పొరలు కారాదు.
ప్రబంధ యుగంలో రాజుల్ని , రాచరికాల్ని,వైభోగాల్ని, ఉంపుడుగత్తెల్నీ పొగడటానికే “ అష్టాదశ వర్ణనల “ క్రింద భ్రష్ట శృంగారం వచ్చిందనేది సత్యం. ఇది మంచపుతాళ్ళు తెగేదాకా పోయింది. ఈ వికృతానికి రోసే కందుకూరి వారు “ సరస్వతీ నారద సంవాదం “ లో ప్రాచీన కవుల ఇంగితాన్ని ప్రశ్నించారు. శతక కవులు అందునా వేమన మాత్రం అధిక సంఖ్యాకుల ప్రయోజనాన్ని లక్ష్యించి ఒక తిరుగుబాటు వేదాంతాన్ని స్పష్టాస్పష్టంగా ప్రబోధించారు.
సాహిత్య ప్రమాణాలు
ప్రాచీన లక్షణ గ్రంధాలన్నీ రాచరిక వ్యవస్తనూ, చాతుర్వర్ణ ధర్మాన్ని, తద్వారా “ శ్రమ దోపిడిని “ సుస్థిరం చేయటానికి అభివృద్ధి చెందాయనేది కూడా నిష్టుర సత్యం . ధీరోదాత్తుడు, ధీరోద్ధాతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు – అనే కావ్య నాయకులు చాతుర్వర్ణ ధర్మ ఔన్నత్య వికాసానికే రూపొందించబడ్డారు. మూడు పాత్రలు క్షత్రియులకైతే ఒకటి ధీరశాంతుని పాత్రను బ్రాహ్మణుడికి కేటాయించారు. సామాన్యుడు, జాలరి, చాకలి, రైతు , వివిధ వృత్తుల వాళ్ళు- వారి సుఖ దు:ఖాలు కావ్య పరిధిలోనికి రానేలేదు. ప్రబంధ యుగాలలోని అష్టాదశ వర్ణనలలో ముఖ్యంగా పుర వర్ణనలో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, రైతు ఎలా వున్నారనేది చెప్పబడలేదు. చెప్పబడింది కూడా ఆ పై వర్గాల చట్రం లోని ఎంగిలే. ( కళా పూర్ణోదయం లోని సుగాత్రీ – శాలీనుల గాధ, ఆముక్తమాల్యద లోని పురవర్ణన. )
రామాయణంలోని వెట్టి చాకిరీ సేవిక మంధర- ఆమె వరాల్ని కైకమ్మకు గుర్తు చేస్తే – ఆమెను నీచురాలిగా చూపబడింది. అలాగే చివర రాముడూ, సీతా విడిపోవడానికి చాకలివాడి ఆరోపణ కారణంగా చూపబడి – చాకలివాడు నిందాస్తానంలోకి నెట్టబడ్డాడు. భారతం లోని ఏకలవ్యుడి గాధ – రామాయణం లోని శంభూక వధ హేతుబద్ధంగా ఆలోచించవారికి తాపం కలిగించే సన్నివేశాలు. – వీటన్నిటినీ పరిశీలిస్తే తేలే అంశం ఏమిటి? సాహిత్యం అనేది సమాజానికి భిన్నం కాదు.- ఎవరైతే సమాజాన్ని శాసిస్తుంటారో వారే సాహిత్యాన్ని కూడా శాసిస్తారు. వీటికి తిరుగుబాటుగా కూడా సాహిత్యం ఉంటుందా? ఉంటుంది. కాబట్టే ఈ దేశములో బౌద్ధుల సాహిత్యం నాశనం చేయబడింది. పాలకులు పాలితుల సాహిత్యాన్ని మననీయరు. అందుకే బౌద్ధసాహిత్యం మంటగలిసింది.
మన సాహిత్యం లోని “ రస సిద్ధాంతమే “ ఒక ప్రశ్నార్ధకం అది పై వర్గాల మానసిక అనుభూతుల్ని తెలియజేసే భావనా సంవిధానం. అక్కడ రాజు లేక రాణి గార్ల దు:ఖమే కరుణరసం. కానీ సేవకుల శోకం కరుణరసం కాదు. అలాగే శృంగారం, హాస్యం, వీరం, వగైరా నవరసాలు తమకు న్యాయం జరగాలని తెగించి పోరాడిన ప్రజల సుఖదు:ఖాల వర్ణన ఇటీవలి దాకా నవరసాల క్రిందికి రాలేదు. “ పల్నాటి వీర చరిత్ర “ పై వర్గాల సాహస చరిత్ర . శ్రీనాధుడు రాచరికాల ఆస్థాన కవి. పోతన కొంత మినహాయింపు.
సత్యం, శివం, సుందరం అనే సాహిత్య ప్రమాణం కూడా వర్గ నైజమే. చాతుర్వర్ణ విధానానికి సంబంధించిన గాధాసత్యమే “ సత్యం “ , దాన్ని అందంగా చెప్పటమే “ సుందరం “ , తద్వారా ఆ వ్యవస్థ కొనసాగించడమే “ శివం “ . ఈ పాక్షిక మంగళం జాతికి ప్రయోజనకరంగా నిలవలేదు. మన సాహిత్యమంతా అధికారపక్ష నియంతృత్వాన్నే వేనోళ్ళ చాటుతుంది.
వీటన్నిటినీ కాదని పెరిగిన ప్రజల సుఖదు:ఖాల పోరాటాల వర్ణనలుగా వచ్చిన “ జానపద సాహిత్యం “ మీద కూడా పైవారల ప్రభావం ఉంది. ఏవర్గం అయితే సమాజాన్ని శాసిస్తుందో ఆవర్గం ప్రభావంలోనే జీవన రంగాలన్నీ బందీ అవుతాయి. ఆ మేరకే జానపద సాహిత్యం కూడా ఇటీవల అభివృద్ధి చెందింది. “ ఎంకి నాయుడుబావ “ లాంటి జానపద నాయికా నాయకులు , ఆధునికరూపం పొందిన ప్రబంధ నాయకులనేది గ్రహించాలి. వారి భావానుభావ వ్యభిచారీ భావాలు నిజంగా శ్రమైక జీవనం గడిపేవారి సుఖదు:ఖాలు కావు. పై వారి అనుకరణలుగా చేయబడిన క్రింది వారి జీవన విరోధాభాసాలు.
ఈ క్రమం లోంచే భావ కవిత్వం “దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని“ మరిపించేంత వికారంగా “నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు“ గా విరాజిల్లింది. ఈ కవుల శృంగార వారసత్వం వ్యాధి నుండి బయటపడలేదు. ఇలా మన వాదాన్ని జీవన సిద్ధాంతంగా స్వీకరించి అభివృద్ధి చెందే సమాజం నుండి వేరుపడి…………………..జ్వాలాముఖి ఉపన్యాసం

భౌద్ధం పాలితుల మతమా?
భౌద్ధాన్ని ఆచరించే చోట సామాజిక న్యాయం ఉందా?
శ్రిలంకలో భౌద్ధ మెజారిటి ఏమి చేస్తుంది?
మతం ఎప్పుడు పాలకుల పక్షమే, దొపిడి పక్షమే.
సాహిత్యంలో వాస్తవికత, భావుకత రెండింటికీ సముచిత స్థానం వుండాలి, వుంటుంది. నిజానికి మన జీవితాలలో కూడ అంతే.అయితే కొంతమంది కవులు రియలిజంకి ఎక్కువ ప్రాధాన్యత నిస్తే, మరికొందరు భావుకతకు ప్రాధాన్యత నిచ్చారు. ఇంకొందరు రెండిటిని సమపాళ్ళలో మేళవించి వ్రాసారు. ఏది ఏమైనా పాఠకుల అనుభూతికి, అనుభవాలకి దగ్గరగా వున్నది చరిత్రలో నిలచి వుంటుంది.
దీనికి పాలకుల లేదా పాలితుల సాహిత్యం అంటూ విభజన అనవసరమేమో!
థ్యాంక్యూ
[...] 2009 జ్వాలాముఖి ఉపన్యాసంగా తెలుసుకుని ఈ నాలుగు పోస్టులు చదివాక ”సామాజిక స్పృహ” గురించి చెప్పిన [...]