జ్వాలాముఖి

సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.

జ్వాలాముఖి – జీవిత విశేషాలు :

జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల ఆవరణలో 1938 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. అదే కోవెల ఆవరణలో వేద పాఠశాల , సంస్కృతాంధ్రాలు బోధించే పాఠశాల ఉండేవి. కవి పండితులు వచ్చివెడుతుండేవారు. సాహిత్య సమాలోచనలు జరుగుతూండేవి. నిజాం రాజ్యములోని ఆంధ్ర మహాసభ నాయకులు ,ప్రముఖులూ అనేకులు వచ్చి ప్రసంగాలు చేస్తుండేవారు. అక్కడికి రంగాచారి అనే కమ్యూనిష్టు కార్యకర్త రహస్యంగా వచ్చిపోతూండేవాడు. ( తర్వాత కాలంలో ఈయన అన్న కూతురునే జ్వాలాముఖి వివాహమాడారు ) ఈయన్ను యూనియన్ మిలిటరీ తీవ్ర చిత్ర హింస లకు గురిచేసి కాల్చేసింది. ఆయన మరణవార్త జ్వాలాముఖి పై ప్రభావం వేసింది.

ప్రముఖ విప్లవ కవి , పౌరహక్కుల నాయకుడు ఎ.టి.ఖాన్ జ్వాలాముఖికి బాల్యం నుండి మంచి మిత్రుడు. మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో , నాంపల్లి హైస్కూలులో , నిజాం కాలేజిలో జ్వాలాముఖి చదువుకున్నారు.

ఒకవైపున కఠిన ఆచార సాంప్రదాయాల శ్రీవైష్ణవ కుటుంబ వాతావరణం, మరోవైపు కటిక పేదరికం వీటినడుమ జ్వాలాముఖి జీవితం గడిచింది.  1958లో జ్వాలాముఖి మనిషి అనే దీర్ఘ కవితను రాసి కరుణశ్రీ ప్రశంశలు పొందాడు.

దిగంబరకవిగా ,విప్లవ కవిగా సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షించాడు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూండిన జ్వాలాముఖి  1965 నుండి దిగంబరకవిగా నిఖిలేశ్వర్, చెరబండరాజు, నగ్నముని వంటి వారతో కలసి కవితాసంపుటాలు ప్రచురించారు. వీరు వి.ర.సం. గా ఏర్పడిన తర్వాత వీరిని 1971లో పి.డి. చట్టం క్రింద  50 రోజులు ముషీరాబాద్ సెంట్రల్ జైలులో  నిర్బంధించారు. ఈయన ప్రత్యేక తెలంగాణా వాదాన్ని తిరస్కరించాడు. ఈయన భారత చైనా మిత్రమండలికి రాష్ట్ర కార్యదర్సి గా పనిచేశాడు. రెండు సార్లు చైనా దర్శంచాడు.

లౌకికవాదిగా :

హైదరాబాదు నగరం హిందూ-ముస్లీం మతస్తులతో , తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ,మార్వాడీ, లోఢీ తదితర జాతుల తెగలతో కూడివుంటుంది. ఒకరకంగా అదొక మినీ ఇండియా లాంటిది. పాతబస్తీలో పుట్టిన జ్వాలాముఖికి హిందీ సాహిత్యమూ, ఉర్దూ భాషలలో కూడా మంచి ప్రవేశముండటము, బాల్యస్నేహితులు, సాహిత్య సామాజిక సంబంధాలుండటం వల్ల మతకలహాలు చెలరేగినప్పుడల్లా వాటిని శాంతింపజేయడానికి , బాధితులను ఆదుకోవడానికి మిత్రుల సహకారంతో కృషి సల్పటం ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హిందూ ముస్లీముల ఐక్యతకై నిరంతరం కృషిచేశారు. 2002లో గుజరాతులో ఘోరాలు జరిగినప్పుడు మన రాష్ట్రం నుండి గుజరాత్ రాష్ట్రాన్ని పర్యటించివచ్చిన 28 మంది రచయితలు,కళాకారులలో జ్వాలాముఖి ఒకరు.  ఆయన హిందూత్వ మతోన్మాద శక్తుల తాత్విక డొల్ల తనాన్ని ఎండగట్టటానికి పురాణ గ్రంధాలనుండి సంఘటనలను, ప్రతీకలను తీసుకొని వివరించేతీరు సభికులను మిక్కిలి ఆకట్టుకునేది. జ్వాలాముఖి మరణం లౌకిక వాద శక్తులకు తీరనిలోటు.

నిరాడంబరంగా జీవించడం, కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలను నెలకొల్పటం, కొడుకులు ముగ్గురికీ కులాంతర మతాంతర వివాహాలు జరిపించటం, .. ఆయన ప్రజాస్వామిక తత్వానికి నిదర్శనం. వ్యవస్థ కల్పించే ప్రలోభాలకు గురి కాకుండా … అవార్డులూ, హోదాలకు, పదవులకూ ఆశపడకుండా ,కెరీరిజానికి లోనవకుండా జీవితం సాగించిన  విశిష్ఠ  వ్వక్తిత్వం జ్వాలాముఖిది.   

2 Comments

  1. 1
    Dr.Acharya Phaneendra Says:

    Good article… Keep it up. I couldn’t find any details ‘about’ you in your blog.

  2. 2
    ఆకాశ రామన్న Says:

    thank you sir


RSS Feed for this entry

Leave a Comment