టీచర్ల సమస్యలు

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని   తీర్పు ఇస్తూ ఆ జీవోలు ( 505, 538 ) కొట్టివేసింది. ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్ర  ప్రభుత్వం  పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ కాడర్ గా ఆర్డినెన్సు తెచ్చి , జీవోలు 95, 96 జారీ చేసి  ఆ తర్వాత చట్టం చేసింది.  మరలా హైకోర్టు ఆ జీవోలను కొట్టివేస్తూ స్థానిక కేడర్లను తనంతట తాను సృష్టించడం గానీ , రద్దు చేయడంగానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఏది జరిగినా రాష్ట్రపతి అనుమతి అనంతరమే జరగాలని  కనుక స్థానిక సంస్థల ఉద్యోగులు లోకల్ కేడర్లు గా పరిగణించరాదని , ఏకీకృత సర్వీసుల చట్టం , సంబంధిత జీవోలు  95, 96  చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఆరు అంశాల సూత్రం   1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం,  1971లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ల ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రెండు ప్రాంతాలు సమైక్యంగా  ఒకే రాష్ట్రంగా కొనసాగడానికి , తెలంగాణాతోసహా ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆ ప్రాంతాల ఉపాధి అవకాశాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుకై ఆరు అంశాల సూత్రం ( సిక్స్ పాయింట్ ఫార్మూలా ) రూపొందించి అమలు చెయ్యాలని 21-9-1973 నాడు రాష్ట్రానికి అందజేసింది. ఆరు అంశాల సూత్రం లో భాగంగా ది.3-5-1974 నాడు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డి , ఆర్టికల్ 371-ఇ లను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ 371 డి    రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు కులపరంగా రిజర్వేషన్ కు అవకాశమున్నది కానీ ఈ ఆర్టికల్ ప్రకారం స్థానిక నివాసం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కలిగింది. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. జీవో 674 ద్వారా 20-10-1975న ప్రత్యేక ఆదేశాలను రాష్ట్రపతి జారీచేశారు. 27నెలలలోపల రాష్ట్రంలోని వివిధ పోష్టులను ప్రత్యేక లోకల్ క్యాడర్లుగా ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఏర్పాటైన లోకల్ కాడర్ ఆయా కేటగిరీ పోష్టులకు నియామకానికి, సీనియారిటీ, ప్రమోషనుకు , బదిలీకి , ఉద్వాసనకు ఒక ప్రత్వేక యూనిట్ గా పరిగణింపబడుతుంది. అయితే 17-1-1978నాటికి గడువు ముగిసింది.  ప్రభుత్వ ఉపాధ్యాయులను జీవో నెం. 529 ద్వారా 14-5-1976నుండి లోకల్ కేడర్ గా ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఏ పోష్టులనైనా ఆయా ప్రాంతాల్లో లోకల్ కేడరుగా ప్రకటించవచ్చు. జూనియర్ అసిస్టెంటు , అంతకు తక్కువ స్థాయ గల పోష్టులను జిల్లా స్థాయి కేడరుగా ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య  సబార్డినేటు సర్వీసు నుంచి సెకండరీ గ్రేడు, స్కూలు అసిస్టెంటు పోష్టులసు 1-1-1974 నుండి ప్రతి జిల్లా ఒక ప్రత్యేక లోకల్ ఏరియాగా పరిగణించాలని జీవో106(ఇ) ద్వారా ది.4-2-2000 న రాష్ట్రపతి ఉత్తరువులకు సవరణ తెచ్చారు. ఇటువంటి సవరణ ఉత్తరువును  పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల విషయంలో తేవడం మరచారు. ఆ తర్వాత తెద్దాం లెమ్మని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించారు. రాష్ట్రం లోని 23 జిల్లాలను 6 జోన్లుగా ( ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నట్లుగా) విభజించారు. 1981లో పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రొవిన్షియలైజ్ చేశారు, కానీ లోకల్ కేడర్ గా పరిగణింపలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జీవోలు ఇచ్చినందున  1992లో, 1998లో, 2005లో ఇచ్చిన  ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పోష్టులను లోకల్ కేడరుగా మార్చే క్లాజు చేర్చాలని , రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన పరిశీలించడం సాధ్యపడదని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని ఒక్కమాట చెప్పడానికి 1973 నుండి 2007 వరకు నోరు రాని ప్రజాప్రతినిధులకు విద్య పట్ల ఎంత ఆసక్తి వుందో తెలియడంలేదా ? 

Leave a Comment