ధర్మపోరాటం

10/03/2009

ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డది. ఆమె గర్భవతి యని, ఆమెకడుపులో కవలపిల్లలున్నారని కనుక్కున్నారు డాక్టర్లు . దీనికి కారణం ఆబాలికను రేప్ చేసిన ఆ బాలిక యొక్క మారు తండ్రని తెలిసింది.  అతడు ఆబాలిక ఆరవయేటనుండి అనేక విధాలుగా తిడుతూండేవాడట. ఆబాలిక మరీ బలహీనంగా వుండటం వల్ల ( 32 కిలోలు ), ఆమె గర్భాశయం కనీసం ఒక్క పిల్లనైనా భరించేంత శక్తికూడా లేనందున డాక్టర్లు ఆమెకు అబార్షన్ చెయ్యాలని నిర్ణయించారు.

కానీ ఆబాలిక నివసిస్తున్నప్రాంత  స్థానిక మతసంస్థ అయిన కథోలిక చర్చి ఏదియేమైనా ఆ బాలిక చచ్చుటయే మంచిదని తీర్మానించింది. బ్రెజిల్ దేశపు ఈశాన్యప్రాంతపు కథోలిక గురుమండల పీఠాధిపతి ఆర్చిబిషప్ స్వాములవారు  ఆ గర్భస్రావ చర్యను నిరోధించుటకు విఫలయత్నంచేశారు. ఎప్పుడైతే వారి ప్రయత్నాలు సాగలేదో ఆబాలిక తల్లిని, తన మాట వినని ఆ వైద్యబృందాన్నంతటినీ వెలివేసినట్లు ప్రకటించారు. 

ఈ సంఘటన కేవలం బ్రెజిల్ దేశ ఈశాన్యప్రాంతానికో లేక ఆ దేశానికో మాత్రమే సంబంధించినది కాదు.  మార్చి 7 వ తేదీన వెలివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న జనసందోహంతో వాటికన్ అధికార ప్రతినిధి కార్డినల్ గియోవన్నిబాటిస్టా రె తమ చర్యను సమర్థిస్తూ ఇది చర్చి నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.  వెలివేయడం అంటే వారికి చర్చీకి సంబంధించిన, మతానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరగుటకు వీలులేకుండ బహిష్కరించుట .  ఈ విథమైన  బహిష్కరణ సాధారణంగా జరిగే విషయాలు కావు. చాలా తీవ్రమైన చర్యలకు మాత్రమే ఈ బహిష్కరణ శిక్ష ఉంటుంది, కథోలిక మత సిద్థాంతాలను సవాలు చేసినా, మత విశ్వాసులను విభజించుటకు ప్రయత్నించినా, వారిని కన్ఫ్యూజ్ చేసినా సంఘ బహిష్కరణ శిక్ష విధించబడుతుంది. రేప్ చేసినటువంటి ఆ మారుతండ్రికి సంఘము నుండి వెలి వేయబడే శిక్ష విధించబడలేదు. కార్డినల్ గారు చెప్పిన ప్రకారం రేప్ చేయడం అనే పని అబార్షన్ చేయడం కంటే పెద్ద తప్పుకాదట. లాటిన్ అమెరికా దేశాలకు కూడా ఇన్చార్జి అయిన  ఈ కార్డినల్ గారు లా స్టంపా అనే ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఇంకా ఇలా అన్నారు. ఇది ఒక విషాదకరమైన విషయం కానీ ఇందులోని నిజమైన సమస్య ఏమిటంటే ఆబాలిక గర్భంలోని కవలలు ఇద్దరు అమాయకులైన వ్యక్తులు- వారికి గల జీవించే హక్కుహరించబడరానిది “.

వాస్తవానికి అబార్షన్ చెయ్యకపోయుంటే గర్భస్త శిశువులతోపాటు ఆకన్యక కూడా మృతిచెందివుండేదని వైద్యుల వాదన.

బ్రెజిల్ చట్టాల ప్రకారం తల్లిప్రాణానికి ప్రమాదం సంభవించగల సందర్భంలోనూ, గర్భస్థ శిశువుకు తండ్రి ఎవరో తెలియని సందర్భంలోనూ అబార్షన్ చెయ్యవచ్చు.

మరి వైద్యుల వాదనా, చర్చి వాదనలలో ఎవరి ఆలోచన సరైందని చెప్పవచ్చునో ఆలోచించండి.

4.సామాజిక స్పృహ విప్లవ చైతన్యం

12/02/2009

జ్వాలాముఖి

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా కవి మీద పడుతుంది.

కవిత్వం సామాజిక అభివృద్ధి క్రమంలో పోరాడుతున్న ప్రజల చైతన్య స్ధాయిని బట్టి కూడా వినియోగించాల్సిన భావ ప్రేరణ ఆ రచన ప్రజల స్థాయి కన్నా కొంచం ముందుగా వున్నా నిష్ఫలమే అవుతుంది. అలాగే వెనుకబడి వున్నా వీగిపోతుంది. కారణం ఆ కవి సమకాలీనంగా ఎదగని దశలో ఉన్నట్లు ఋజువవుతాడు. - కవి తన చైతన్యాన్ని బట్టిగాక ప్రజల చైతన్యాన్ని బట్టి సామాజిక అవసరాలమేరకు ప్రవర్తించడం అభివృద్ధి క్రమం దృష్ట్యా చాలా అవసరం – ఈ మెలకువ తనమే కవి యుగ కర్తృత్వాన్ని నిర్ణయిస్తుంది.

మార్పును కోరేవారంతా వ్యవసాయ విప్లవం జరగాలంటున్నారు. దాన్ని ఇరుసుగా నడిపి నిజమైన ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలంటున్నారు. ఈ దశలోనే జాతి విముక్తి సాధ్యం కాగలదనేది తేలిన అంశం- ఈ జనతా ప్రజాతంత్ర విప్లవంలో అన్ని రకాల ప్రజల్ని సమీకరించడం , పోరాటానికి ఆయత్తం చేయడం, విప్లవాన్ని సాధించడం అనేవి లక్ష్యాలుగా వుంటున్నాయి. వీటికి మార్గదర్శక సూత్రాలేవి?

మన వ్యవస్ధ శ్రమ దోపిడిని కేంద్రంగా చేసుకొని జీవిత విలువల్ని నిర్ణయించింది. అసంఖ్యాకులకు అన్యాయం చేస్తున్నది. శ్రమదోపిడీ నిర్మూలనను లక్ష్యించే ఫ్యూడల్ వ్యతిరేక ప్రజా ఉద్యమాలకు బాసటగా నేటి సామాజిక స్పృహ సాహిత్యంలో ప్రతిబింబించాలి. అలాగే ఫ్యూడల్ భావాలతో కుమ్మక్కవుతున్న సామ్రాజ్యవాదాల జోక్యందారీ విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్షణాలు కలిగిన సామాజిక స్పృహ నేటి తెలుగు కవిత్వంలో ప్రతిబింబించాలి. భూస్వామ్య విధానం మానవ జీవితాన్ని విషాక్తం చేసింది. దానికి మద్దత్తుగా సామ్రాజ్యవాదం విధానం వలన సంస్కృతిని దిగుమతి చేస్తున్నది. దీన్ని నేటి కవితా ప్రయోజనం ప్రతిఘటించాలి.     

వ్యవసాయ విప్లవం అనేది ప్రధానంగా వచ్చినప్పుడు గ్రామీణ స్ధాయి పోరాట ప్రజలకు కవిత్వం అందాలంటే వారి కళారూపాలు స్వీకరించి విప్లవీకరించాలి. జానపద కళా రూపాలు పోరాట చైతన్యంలోకి అనువదించాలి. ఇక్కడ శిల్పం కోసం వస్తువును పాడుచేయరాదు. బాణీ కోసం ప్రజల్ని మభ్యపెట్టరాదు. అలాగే వస్తువు స్పష్టత కోసం కవిత్వాన్ని వాక్యంగా మార్చరాదు. ప్రతి కవిత్వం ప్రచారమే కానీ ప్రతి ప్రచారం సాహిత్య రూపం కాజాలదు. కారణం అది ప్రేరణను కోరుతుంది. ప్రేరణకు ప్రజల నుడికారం చాలా అవసరం. వస్తు రూపాల సమన్వయం సామాజిక స్పృహలో ప్రతిబింబించాలి.

నేటి కవిత్వం అనేది శిల్ప కళా రూపంలో జాతీయం (National in form ) గాను, వస్తువులో విప్లవాత్మకంగానూ ఉండాలి. ( Revolutionary in Content ) ఈనాటి ఈ కవితా ప్రయోజనాన్ని గ్రహించి , నిత్య నూతనంగానూ ప్రజల పోరాట పటిమను బాధ్యతతో రచనల్ని చేయడమే సామాజిక స్పృహ. దీన్ని తెలిసో తెలియకో కాదనే వాదమల్లా స్వీయ మానసిక వికారం కాగలదు. కవి తనకోసం కాక తన చుట్టూ ఉన్న ప్రజలకోసం బ్రతకటమే సామాజిక స్పృహ.

-  సెప్టెంబరు 1979

3. సామాజిక స్పృహ వ్యక్తివాదం కాదు

06/02/2009

పాలకవర్గం పరిధిలో ఉండి ఆలోచించే సాహితీ వేత్తలు చిత్రవిచిత్ర వాదనలు ముందుకు తెస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటివాళ్ళు పీడక సాహిత్య లక్షణాల్నికరదీపాలుగా ర్రహించి పీడిత ప్రజలకు పరిష్కారాలు సూచిస్తూ కవి సమాజానికి అతీతుడు ,శాసనకర్త, సర్వస్వమును అని ప్రతిపాదిస్తున్నారు.

ఇంకా కొంచం ముందుకు పోయి కవి ఆధిక్యతా భావాన్ని ఒక వాదంగా ముందుకు తెచ్చే కవిసేన ను ప్రచారం చేస్తూ మానవ సమస్యల్ని కవులు మాత్రమే పరిష్కరించగలరనే భ్రమల్ని సుస్తిరం చేస్తున్నారు. దీనితో పాటు రాజకీయం జీవితములో ఒక భాగమే గానీ రాజకీయమే జీవితం కాదని సూత్రీకరిస్తున్నారు. ఎంతవరకయితే రాజకీయాలు ప్రజాపరంగా నిర్ణయం కావో అంతవరదాకా జీవితం బాధా విముక్తం కాదనే సామాజిక సత్యాన్ని శేషేంద్రశర్మ గారు గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ కవి పుట్టించిన చోటే పుట్టిన మరుక్షణంలోనే మరణాన్ని వరంగా వరిస్తున్నాడు.

ఈ వరసలోనే ఏనాడో కాలగర్భంలో కలసిపోయిన సౌందర్య వాదాన్ని కళ కళకోసమనే ఆయన వాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇస్మాయిల్ కవిగారు మానసికానందం కోసం కవిత్వం అంటారు. మానసిక ఆనందం అనేది వ్యక్తి అనుభవించే జీవితాన్నిబట్టి నిర్ణయింపబడుతుందనే చేదు నిజాన్ని వారు గుర్తించడంలేదు.

పెట్టుబడిదారీ సమాజపు వికృత అస్తవ్యస్త స్థితిని చూసి జీవితం చాలా అడ్డదిడ్డంగా ఉందనే అంశాన్ని చాటడానికి నగ్నముని లాంటి కేవలం ప్రయోగవాదులు విలోమ కవితలు అనే భ్రమల్ని ముందుకు తెస్తున్నారు. కవిత్వంలో తిర్యక్కులు వీళ్ళు.

వర్గ పోరాటాల విస్తృతిలో ప్రజలు ఒక స్పష్టతను కోరే తరుణంలో స్పష్టంగా బయటపడి చెప్పే ధైర్యం లేక అవగాహన లేక ప్రజలతో తాదాత్మ్యం చెందే ఆత్మ వికాశం లేక కవి అహంకారియై ప్రజల్నుండి వేరుపడే ప్రయత్నంలో ప్రయోగవాదాన్ని స్వీకరిస్తాడు. ఇదివరకు పట్టాభి, ఆరుద్రలు అలాంటి సర్కస్ ఫీట్లు చేశారు. అందులోని ఆరవ వేలే విలోమ కవిత .ఇది పెట్టుబడిదారీ సమాజపు అమ్మకాల ఆకర్షణ . దోపిడీ గాళ్ళ సేల్స్ మన్ షిప్.

ప్రక్రియా వాదాన్ని సాహిత్యోద్యమంగా తెచ్చిన ప్రవక్తలు సంక్షుభిత సమాజంలో పరిష్కర్తలుగా ముందుకు వస్తున్నారు. సాహిత్య ప్రమాణాలు రూపాలు , శిల్ప బేధాలు , వస్తు విశేషాలు మారే సమాజాన్ని బట్టి అభివృద్ధి చెందుతాయి.

పద్యం ఫ్యూడల్ సమాజపు నియమాల్ని చాటిన నిలయ విద్వాంసుని గాత్ర విశేషం. అందువల్ల పద్యం ఛందో రూపాన్ని మార్చినంత మాత్రాన కవిత్వం ఆధునికమైపోదు. ఆధునిక జీవిత అభివ్యక్తి సౌలభ్యం కోసమే పద్యం ముక్కచెక్కలై గేయంగానూ , గేయం చెడి వచిన కవిత్వం గానూ అభివృద్ధి చెందింది. ఈ సామాజిక అంతస్సూత్రాన్ని విడిచి కేవలం వచన కవిత్వం రాస్తే ఆధునిక జీవిత చిత్రణకు సంబంధించిన సాహిత్య ప్రయోజనం సమకాలీన సమాజంలో నెరవేరదు. వచన కవిత్వం ప్రక్రియనే ఒక ఉద్యమంలో స్వీకరించిన కుందుర్తి గారు ఈ సత్యాన్ని అంగీకరించడంలేదు. వస్తువు ప్రయోజనం చాల ప్రధానం – అలా అని ఆధునిక వస్తువును ప్రాచీన రూపంలో రాస్తే (పద్యం చెబితే) అంతగా ప్రయోజనం నెరవేరదు.

ఈ వర్గసమాజం వస్తువు “ ( content )కు రూపానికి” ( form ) ఒక వైరుధ్యాన్ని తెచ్చిపెట్టింది – పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల శిల్ఫ వైభవాన్ని పెంచి , వస్తువును దిగమింగే ప్రయోగవాదం ఒక వైపు విజృంభిస్తున్నది. – మరొక వైపు వస్తువును నినాదప్రాయం చేసే అవాస్తవిక దృష్టి విస్తరిస్తుంది. నిజమైన ప్రజా కవిత్వం ఇటు వస్తువుకు, అటు రూపానికీ సమన్వయం సాధిస్తుంది. – అది అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకులైన ప్రజల ప్రయోజనాల్ని చాలా స్పష్టంగా శాస్త్రీయంగా అంగీకరించినప్పుడే సాధ్యపడగలదు.- అందుకే ఉద్యమాల రోజుల్లోనే మంచి కవులు పుడతారు.- తిరిగి వారు ఉద్యమాల ఊపిరి కాపాడుతారు.

తెలుగు కవిత – సామాజిక స్పృహ 2

23/01/2009

2. మార్పును గుర్తించిన ద్రష్టలు

ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో క్రాంత దర్శులు గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన  కన్యక బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి కోటల్ని నేలమట్టం చేశారు. రాచరికాల అనివార్య పతనాన్ని ప్రజాస్వామిక యుగారంభాన్ని చాల సహజ పరిమాణంగా యుగచైతన్యంతో చెప్పిన స్రష్ట గురజాడ అప్పారావు – అందుకు వారి కన్యక కావ్యం మకుటాయమానం.

సామాజిక స్పృహ ను రాజ్యాధికారుల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చాటినా – గురజాడ వారు పూర్తిగా సాంప్రదాయ పట్టులోంచి బయటపడలేదనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వారు సూచించిన పాతకొత్తల మేలు కలయిక అభివృద్ధిచెందే సమాజానికి ఎంత ప్రతిబంధకమో నిర్మొహమాటంగా ఆలోచించాల్సివుంటుంది.

అందువల్ల సామాజిక స్పృహ  అనేది నిత్య నూతనంగా అభివృద్ధి చెందే అభ్యుదయ సూచిక అని కొంతవరకు మాత్రమే పోయి ఆగిపోయే పోటీ యత్నము కాదు.

దారిపక్క బిచ్చగత్తెలు , రాక్షసరతి   లో నలిగే పడుపుగత్తెలు, సమ్మెగట్టే కూలీలు, కూలీల భార్యలు , ఉరికంబాలకు వేలాడే ధీరులు కావ్యవస్తువులుగా గ్రహించిన అభ్యుదయ కవిత్వం , దగాపడిన తమ్ముళ్ళందరినీ పదండి ముందుకు అని విప్లవ శంఖం పూరించింది. తెలుగు కవిత్వంలో ఈనాటి సామాజిక స్పృహ  ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకుంది.

మొట్టమొదటి సారిగా సామాన్యుని మాన్యుగా చేసిన సాహిత్యోద్యమం    అభ్యుదయ కవిత్వం . అయితే కవి తనకు తానుగా సాధించిన నూతన విషయం కాదనేది కూడా గుర్తించాలి. దాన్ని కవి చేసిన అద్భతంగా మాత్రమే గుర్తిస్తే అభివృద్ధి చెందే ప్రజల నిర్ణయాత్మక పోరాట శక్తిని నిర్లక్ష్యం చేసిన వారలం కాగలం. అలా చారిత్రక పరిణామాల్ని వర్గ పోరాటాల విజయాల ద్వారా ముందుకు తెస్తున్న ప్రజల్ని గుర్తించడంలో కవి కృతకృత్యుడైనాడనేది సత్యం. కానీ కవి మాత్రమే పోరాట సత్యాన్ని సృష్టించాడనేది అసత్యం. ఈ వివేచనా లోపం వల్లనే కొందరు కవులు శాసకులుగా ప్రజల మీద స్వారీ  చెయ్యడానికి సాహసిస్తున్నారు. కవి అహంకారి కాదు.

కవి నడుస్తున్న చరిత్రలో వెలుగులు చూస్తాడు. కాబట్టే అతడు క్రాంతదర్శి. ఈ క్రాంత దర్శిత్వం చూసే నిత్య వికాసమే     సామాజిక స్పృహ . ఇది దినదిన ప్రవర్ధమానమయ్యే ఆత్మ చైతన్యం. అభ్యుదయ కవితా ఉద్యమం , మార్పును సంస్కరణ వాదానికి ముడివేసి ఊరుకుంది. వ్యవస్థను సమూలంగా మార్చకుండా కొన్ని సంస్కరణల్నిలక్ష్యిస్తే సరిపోదు. నలుగురు కలసి పొరుపులు మరచీ చేయాలి ఉమ్మడి వ్యవసాయం అనే రాజకీయ కార్యక్రమ నినాదం ఎలాంటి సంస్కరణ వాదాన్ని సూచిస్తుందో పరిశీలించండి. భూముల పంపకం కాకుండా ఉమ్మడి వ్యవసాయం   అనేది నెహ్రూగారి గమ్మత్తు. దానికి కవి బలికారాదు. వ్యవసాయ విప్లవం మాత్రమే రైతు సోదరులకు న్యాయం చేస్తుంది.

అందువల్ల సంస్కరణలు కూడా సమాజం సమూలంగా మారే విప్లవ క్రమంలో భాగం కావాలి గానీ , విప్లవాన్ని గల్లంతు చేనే కార్యక్రమాలు కారాదు. అందుకే సంస్కరణవాదం సర్వరోగ నివారిణి కాదు. అది దారి తప్పించే రాజకీయ వ్యూహంలో దానికి కవి బలికారాదు.  అభ్యుదయకవి బలి అయినాడు.

సంస్కరణలద్వారా సామాజిక సమస్యలు పరిష్కరింపబడతాయనే భ్రమల్లో ప్రజలు లేరు. సంస్కరణవాదానికి కాలం చెల్లి పోయింది. ఇది సమాజం సమూలంగా మారాలనే విప్లవాల యుగం. అమెరికా ప్రపంచవ్యాప్తంగా పోరాటాల విస్తృతి కొనసాగుతుంది. పరాయి పాలనలో మగ్గుతున్న దేశాలు ( ఆఫ్రికా ) స్వాతంత్ర్యాన్ని కోరుతూ  తెగించి పోరాడుతున్నాయి. అలాగే పీడిత జాతుల విముక్తి కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అభివృద్ధి చెందిన ఈ ప్రపంచ నైజాన్ని నేటి కవి గుర్తించి తన సామాజిక స్పృహ ను నిత్యనూతనంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడంలో అభ్యుదయ కవి విఫలం అయ్యాడు. కాబట్టే విప్లవకవి తెలుగు సాహిత్యానికి అవసరం అయ్యాడు.. ఈ విధంగా అభివృద్ధి చెందిన కవి తిరిగి సంక్షోభానికి గురై ప్రజలు మాత్రమే విప్లవాన్ని తద్వారా సమూలమైన మార్పును తెస్తారనే నైజాన్నికొందరి వీరుల సాహస చర్యగా భావించి విప్లవ బాధ్యతారంగాన్ని సంకుచితం చేశాడు.

అందువల్ల సామాజిక స్పృహ అనేది వ్యక్తి చైతన్యమే కాదు సమాజ స్పందన కూడా. తనలో తాను అభివృద్ధి చెందుతూ , అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకపు ప్రపంచంతో తాదాత్మయం చెంది ముందుకు పోయే పోరాట నైజాన్ని గుర్తించాలి. తాను ముందుకు పోతూ ముందుకు పోయే సమాజాన్ని పట్టుకోవాలి.

తెలుగు కవిత – సామాజిక స్పృహ

22/01/2009

ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో సామాజిక స్పృహ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి సోషలిజం మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా  వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.

సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల వత్తిడి. రెండవది అందులో దూరి దాన్ని లేకుండా చేయటం.

భౌతిక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధాన్ని వైదికులు దశావతారాల్లో చేర్చి బుద్ధుణ్ణి విష్ణువు అవతారంగా జమ కట్టేశారు. ఆ తర్వాత బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా సర్వనాశనం చేశారు. అంతే క్రూరంగా చార్వాకుల్ని నేలమట్టం చేశారు. 

రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాజానుగుణంగా ఉండాలనేది ప్రజలు ముందుకు తెచ్చిన నైజం. దీన్నీ అంగీకరిస్తున్నట్లు అభినయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ అనే మాటను పాలకులు యధేచ్చగా వాడుతున్నారు.

నిజానికి ఈ మాటకు నిర్వచనం ఏమిటి ? అభివృద్ధి చెందుతున్న సమాజం గురించి పట్టించుకొని దానికి న్యాయం చెయ్యడం. మళ్ళీ ఇక్కడ ఏ అభివృద్ధి అనేది వస్తుంది. బిల్డింగులా? అధికారాలా? ప్రణాళికలా? పదవులా? లేక ప్రజల ఆశయాలా?

మార్పును కోరే శక్తులకు మార్పును ప్రతిఘటించే శక్తులకు సమాజంలో వివిధ స్తాయిల్లో ఘర్షణ తప్పదు. ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజల శ్రేయస్సును కాంక్షించటమే సామాజిక స్పృహ . ఇది కూడా నిరంతరం అభివృద్ధి చెందే పోరాట నైజం. దీనికనుగుణంగానే అన్ని రంగాల్లో సాపేక్షికంగా అభిప్రాయాలు  ప్రచారం అవుతాయి.

ఈ సామాజిక స్పృహ కొత్త విషయమా?

సామాజిక స్పృహ అనేది పత్రికలు , మేధావులు , రాజకీయ నాయకులు సృష్టించిన కొత్తమాటా? కాదు – ఏదో ఒక రూపంలో ఈ భావం అనాదిగా కొనసాగుతున్నదే.

ఎవరైతే సామాజిక ఉత్పత్తి సాధనాల్ని  స్వాధీనం చేసుకున్నారో వారే జీవితానికి సంబంధించిన సమస్త విషయాల్ని శాసించారు. ఆర్ధిక ప్రయోజనాల్ని బట్టే , సారస్వతం, తాత్వికసూత్రాలు, మతనియమాలు, లలితకళలు నిర్వచించబడి పోషింపబడతాయి. వీటినే సంప్రదాయం క్రింద పెద్దలు ప్రచారం చేస్తారు.

నన్నయ్యగారి భారతాంధ్రీకరణలో అక్షరరమ్యత ఎంత ఆకర్షణీయంగా పండితులకు కన్పించినా అది రాజరాజనరేంద్రుడు కోరిన  జగద్ధితంబు గా విరాజిల్లిందనేది దాచేస్తే దాగని సత్యం. అధిక సంఖ్యాకులైన పదకొండవ శతాబ్దపు తెలుగు ప్రజలు ,  వేదాల ప్రామాణికతను  తిరస్కరించే జైన బౌద్ధాల వెంటపడిపోవడాన్ని అరకట్టడానికి వైదికమత పునరుద్ధరణకు మాత్రమే భారతాంధ్రీకరణ జరిగిందనేది చారిత్రక సత్యం .

వైష్ణవులు, శైవులూ తగాదా పడుతూ వుంటే జైనబౌద్ధాలు విజృంభించి వైదికమతం నేలమట్టం అవుతుందనే భయం వల్ల తిక్కన  హరిహరనాధతత్వాన్ని  నాటి తెలుగు సమాజానికి తరుణోపాయంగా సూచించారు. దీనితో పాటు భారతాంధ్రీకరణ శేషభాగాన్ని  నాటకీయత  అనే శిల్పంతో పూరించాడు.

సామాజిక శక్తుల ఆర్ధికావసరాలకు భిన్నంగా ఏ సాహిత్య ప్రమాణాలూ రావు – వచ్చినవన్నీ ప్రజలకనుకూలంగా ఉండవు. సాహిత్య కళా రూపాలూ అంతే. కావ్య శోభకు, కళారూపానికీ , శబ్దసౌందర్యానికి భ్రమపడి సాహిత్య ప్రయోజనం ఏ విషయంలో పొరలు కారాదు.     

ప్రబంధ యుగంలో రాజుల్ని , రాచరికాల్ని,వైభోగాల్ని, ఉంపుడుగత్తెల్నీ పొగడటానికే అష్టాదశ వర్ణనల  క్రింద భ్రష్ట శృంగారం వచ్చిందనేది సత్యం. ఇది మంచపుతాళ్ళు తెగేదాకా పోయింది. ఈ వికృతానికి రోసే కందుకూరి వారు  సరస్వతీ నారద సంవాదం  లో ప్రాచీన కవుల ఇంగితాన్ని ప్రశ్నించారు. శతక కవులు అందునా వేమన మాత్రం అధిక సంఖ్యాకుల ప్రయోజనాన్ని లక్ష్యించి ఒక తిరుగుబాటు వేదాంతాన్ని స్పష్టాస్పష్టంగా ప్రబోధించారు.

సాహిత్య ప్రమాణాలు

ప్రాచీన లక్షణ గ్రంధాలన్నీ రాచరిక వ్యవస్తనూ, చాతుర్వర్ణ ధర్మాన్ని, తద్వారా  శ్రమ దోపిడిని                                                                       సుస్థిరం చేయటానికి అభివృద్ధి చెందాయనేది కూడా నిష్టుర సత్యం . ధీరోదాత్తుడు, ధీరోద్ధాతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు – అనే కావ్య నాయకులు చాతుర్వర్ణ ధర్మ ఔన్నత్య వికాసానికే రూపొందించబడ్డారు. మూడు పాత్రలు క్షత్రియులకైతే ఒకటి ధీరశాంతుని పాత్రను బ్రాహ్మణుడికి కేటాయించారు. సామాన్యుడు, జాలరి, చాకలి, రైతు , వివిధ వృత్తుల వాళ్ళు- వారి సుఖ దు:ఖాలు కావ్య పరిధిలోనికి రానేలేదు. ప్రబంధ యుగాలలోని అష్టాదశ వర్ణనలలో ముఖ్యంగా పుర వర్ణనలో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, రైతు ఎలా వున్నారనేది చెప్పబడలేదు. చెప్పబడింది కూడా ఆ పై వర్గాల  చట్రం లోని ఎంగిలే. ( కళా పూర్ణోదయం లోని సుగాత్రీ – శాలీనుల గాధ, ఆముక్తమాల్యద లోని పురవర్ణన. )

రామాయణంలోని వెట్టి చాకిరీ సేవిక మంధర- ఆమె వరాల్ని కైకమ్మకు గుర్తు చేస్తే – ఆమెను నీచురాలిగా చూపబడింది. అలాగే చివర రాముడూ, సీతా విడిపోవడానికి చాకలివాడి ఆరోపణ కారణంగా చూపబడి – చాకలివాడు నిందాస్తానంలోకి నెట్టబడ్డాడు. భారతం లోని ఏకలవ్యుడి గాధ – రామాయణం లోని శంభూక వధ హేతుబద్ధంగా ఆలోచించవారికి తాపం కలిగించే సన్నివేశాలు. – వీటన్నిటినీ పరిశీలిస్తే తేలే అంశం ఏమిటి? సాహిత్యం అనేది సమాజానికి భిన్నం కాదు.-   ఎవరైతే సమాజాన్ని శాసిస్తుంటారో వారే సాహిత్యాన్ని కూడా శాసిస్తారు. వీటికి తిరుగుబాటుగా కూడా సాహిత్యం ఉంటుందా? ఉంటుంది. కాబట్టే ఈ దేశములో బౌద్ధుల సాహిత్యం నాశనం చేయబడింది. పాలకులు పాలితుల సాహిత్యాన్ని మననీయరు. అందుకే బౌద్ధసాహిత్యం మంటగలిసింది.

మన సాహిత్యం లోని  రస సిద్ధాంతమే  ఒక ప్రశ్నార్ధకం అది పై వర్గాల మానసిక అనుభూతుల్ని తెలియజేసే భావనా సంవిధానం. అక్కడ రాజు లేక రాణి గార్ల దు:ఖమే కరుణరసం. కానీ సేవకుల శోకం కరుణరసం కాదు. అలాగే శృంగారం, హాస్యం, వీరం, వగైరా నవరసాలు తమకు న్యాయం జరగాలని తెగించి పోరాడిన ప్రజల సుఖదు:ఖాల వర్ణన ఇటీవలి దాకా నవరసాల క్రిందికి రాలేదు. పల్నాటి వీర చరిత్ర  పై వర్గాల సాహస చరిత్ర . శ్రీనాధుడు రాచరికాల ఆస్థాన కవి. పోతన కొంత మినహాయింపు.

సత్యం, శివం, సుందరం అనే సాహిత్య ప్రమాణం కూడా వర్గ నైజమే. చాతుర్వర్ణ విధానానికి సంబంధించిన గాధాసత్యమే  సత్యం  , దాన్ని అందంగా చెప్పటమే  సుందరం  , తద్వారా ఆ వ్యవస్థ కొనసాగించడమే   శివం . ఈ పాక్షిక మంగళం జాతికి ప్రయోజనకరంగా నిలవలేదు. మన సాహిత్యమంతా అధికారపక్ష నియంతృత్వాన్నే వేనోళ్ళ చాటుతుంది.

వీటన్నిటినీ కాదని పెరిగిన ప్రజల సుఖదు:ఖాల పోరాటాల వర్ణనలుగా వచ్చిన  జానపద సాహిత్యం మీద కూడా పైవారల ప్రభావం ఉంది. ఏవర్గం అయితే సమాజాన్ని శాసిస్తుందో ఆవర్గం ప్రభావంలోనే జీవన రంగాలన్నీ బందీ అవుతాయి. ఆ మేరకే జానపద సాహిత్యం కూడా ఇటీవల అభివృద్ధి చెందింది.  ఎంకి నాయుడుబావ  లాంటి జానపద నాయికా నాయకులు , ఆధునికరూపం పొందిన ప్రబంధ నాయకులనేది గ్రహించాలి. వారి భావానుభావ వ్యభిచారీ భావాలు నిజంగా శ్రమైక జీవనం గడిపేవారి సుఖదు:ఖాలు కావు. పై వారి అనుకరణలుగా చేయబడిన క్రింది వారి జీవన విరోధాభాసాలు.

ఈ క్రమం లోంచే భావ కవిత్వం దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని  మరిపించేంత వికారంగా   నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు గా విరాజిల్లింది. ఈ కవుల శృంగార వారసత్వం వ్యాధి నుండి బయటపడలేదు. ఇలా మన వాదాన్ని జీవన సిద్ధాంతంగా స్వీకరించి అభివృద్ధి చెందే సమాజం  నుండి వేరుపడి…………………..జ్వాలాముఖి ఉపన్యాసం


పని చేసిన వాడికి చెల్లించవలసిన డబ్బులో కొంత మిగిల్చుకోవడం

 


  

 [v1]వస్తువులు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు మొదలగునవి.

 

జ్వాలాముఖి

20/01/2009

సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.

జ్వాలాముఖి – జీవిత విశేషాలు :

జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల ఆవరణలో 1938 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. అదే కోవెల ఆవరణలో వేద పాఠశాల , సంస్కృతాంధ్రాలు బోధించే పాఠశాల ఉండేవి. కవి పండితులు వచ్చివెడుతుండేవారు. సాహిత్య సమాలోచనలు జరుగుతూండేవి. నిజాం రాజ్యములోని ఆంధ్ర మహాసభ నాయకులు ,ప్రముఖులూ అనేకులు వచ్చి ప్రసంగాలు చేస్తుండేవారు. అక్కడికి రంగాచారి అనే కమ్యూనిష్టు కార్యకర్త రహస్యంగా వచ్చిపోతూండేవాడు. ( తర్వాత కాలంలో ఈయన అన్న కూతురునే జ్వాలాముఖి వివాహమాడారు ) ఈయన్ను యూనియన్ మిలిటరీ తీవ్ర చిత్ర హింస లకు గురిచేసి కాల్చేసింది. ఆయన మరణవార్త జ్వాలాముఖి పై ప్రభావం వేసింది.

ప్రముఖ విప్లవ కవి , పౌరహక్కుల నాయకుడు ఎ.టి.ఖాన్ జ్వాలాముఖికి బాల్యం నుండి మంచి మిత్రుడు. మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో , నాంపల్లి హైస్కూలులో , నిజాం కాలేజిలో జ్వాలాముఖి చదువుకున్నారు.

ఒకవైపున కఠిన ఆచార సాంప్రదాయాల శ్రీవైష్ణవ కుటుంబ వాతావరణం, మరోవైపు కటిక పేదరికం వీటినడుమ జ్వాలాముఖి జీవితం గడిచింది.  1958లో జ్వాలాముఖి మనిషి అనే దీర్ఘ కవితను రాసి కరుణశ్రీ ప్రశంశలు పొందాడు.

దిగంబరకవిగా ,విప్లవ కవిగా సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షించాడు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూండిన జ్వాలాముఖి  1965 నుండి దిగంబరకవిగా నిఖిలేశ్వర్, చెరబండరాజు, నగ్నముని వంటి వారతో కలసి కవితాసంపుటాలు ప్రచురించారు. వీరు వి.ర.సం. గా ఏర్పడిన తర్వాత వీరిని 1971లో పి.డి. చట్టం క్రింద  50 రోజులు ముషీరాబాద్ సెంట్రల్ జైలులో  నిర్బంధించారు. ఈయన ప్రత్యేక తెలంగాణా వాదాన్ని తిరస్కరించాడు. ఈయన భారత చైనా మిత్రమండలికి రాష్ట్ర కార్యదర్సి గా పనిచేశాడు. రెండు సార్లు చైనా దర్శంచాడు.

లౌకికవాదిగా :

హైదరాబాదు నగరం హిందూ-ముస్లీం మతస్తులతో , తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ,మార్వాడీ, లోఢీ తదితర జాతుల తెగలతో కూడివుంటుంది. ఒకరకంగా అదొక మినీ ఇండియా లాంటిది. పాతబస్తీలో పుట్టిన జ్వాలాముఖికి హిందీ సాహిత్యమూ, ఉర్దూ భాషలలో కూడా మంచి ప్రవేశముండటము, బాల్యస్నేహితులు, సాహిత్య సామాజిక సంబంధాలుండటం వల్ల మతకలహాలు చెలరేగినప్పుడల్లా వాటిని శాంతింపజేయడానికి , బాధితులను ఆదుకోవడానికి మిత్రుల సహకారంతో కృషి సల్పటం ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హిందూ ముస్లీముల ఐక్యతకై నిరంతరం కృషిచేశారు. 2002లో గుజరాతులో ఘోరాలు జరిగినప్పుడు మన రాష్ట్రం నుండి గుజరాత్ రాష్ట్రాన్ని పర్యటించివచ్చిన 28 మంది రచయితలు,కళాకారులలో జ్వాలాముఖి ఒకరు.  ఆయన హిందూత్వ మతోన్మాద శక్తుల తాత్విక డొల్ల తనాన్ని ఎండగట్టటానికి పురాణ గ్రంధాలనుండి సంఘటనలను, ప్రతీకలను తీసుకొని వివరించేతీరు సభికులను మిక్కిలి ఆకట్టుకునేది. జ్వాలాముఖి మరణం లౌకిక వాద శక్తులకు తీరనిలోటు.

నిరాడంబరంగా జీవించడం, కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలను నెలకొల్పటం, కొడుకులు ముగ్గురికీ కులాంతర మతాంతర వివాహాలు జరిపించటం, .. ఆయన ప్రజాస్వామిక తత్వానికి నిదర్శనం. వ్యవస్థ కల్పించే ప్రలోభాలకు గురి కాకుండా … అవార్డులూ, హోదాలకు, పదవులకూ ఆశపడకుండా ,కెరీరిజానికి లోనవకుండా జీవితం సాగించిన  విశిష్ఠ  వ్వక్తిత్వం జ్వాలాముఖిది.   

తన విద్యార్ధులకు ఏం చెప్పాలి

09/09/2008

 

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్న స్కూలు ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖ.

మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి. శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు సంతోషించాలనీ నేర్పించండి. అసూయకు దూరంగా వుండడం, నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి. సోమరిపోతులు ఆశపోతులనే విషయం అతనికి తొందరగా తెలియజెప్పండి. వీలుంటే పుస్తకాలలోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చని కొండచరియల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి.

మోసం చెయ్యడం కంటే విఫలమవడంలోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి. ప్రతివొక్కరూ తప్పు అని చెప్పినాసరే తన స్వంత ఆలోచనలమీద విశ్వాసముంచాలని అతనికి తెలియజేయండి. ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలనీ, దుండగులతో కఠినంగా వ్యవహరించాలనీ నేర్పించండి. అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలసిపోకుండా వుండగలిగే శక్తిని సంపాదించుకోమనండి. ఎవరు చెప్పినా వినాలనీ, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తరువాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. మీకు వీలయితే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ వుండగలగడం నేర్పించండి. అయితే కన్నీళ్ళు పెట్టుకోవడానికి సిగ్గుపడ నక్కరలేదని చెప్పండి. తప్పులెన్నేవారిని లెక్కచేయకూడదనీ, తియ్యటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా వుండాలనీ తెలియ జెప్పండి. శరీర దారుఢ్యాన్నీ, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలనీ, అయితే హృదయానికీ, ఆత్మకూ మాత్రం ఎన్నటికీ వెలకట్టగూడదనీ అతనికి తెలియజేయండి. అల్లరి మూకల కేకలు చెవినిపెట్టకుండా , తన ఆలోచన సరియైనదైతే నిలబడి పోరాడాలని నేర్పించండి. సున్నితంగా బోధించండి గానీ గారాబం చెయ్యవద్దు. కాల్చినప్పుడేకదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా వుండడంలో గల సాహసాన్ని గుర్తించమనండి. ధైర్యశీలికి కావలసిన సహనాన్ని అలవరచుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగివుండాలని బోధించండి. అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు.”

టీచర్ల సమస్యలు

23/06/2007

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని   తీర్పు ఇస్తూ ఆ జీవోలు ( 505, 538 ) కొట్టివేసింది. ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్ర  ప్రభుత్వం  పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ కాడర్ గా ఆర్డినెన్సు తెచ్చి , జీవోలు 95, 96 జారీ చేసి  ఆ తర్వాత చట్టం చేసింది.  మరలా హైకోర్టు ఆ జీవోలను కొట్టివేస్తూ స్థానిక కేడర్లను తనంతట తాను సృష్టించడం గానీ , రద్దు చేయడంగానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఏది జరిగినా రాష్ట్రపతి అనుమతి అనంతరమే జరగాలని  కనుక స్థానిక సంస్థల ఉద్యోగులు లోకల్ కేడర్లు గా పరిగణించరాదని , ఏకీకృత సర్వీసుల చట్టం , సంబంధిత జీవోలు  95, 96  చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఆరు అంశాల సూత్రం   1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం,  1971లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ల ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రెండు ప్రాంతాలు సమైక్యంగా  ఒకే రాష్ట్రంగా కొనసాగడానికి , తెలంగాణాతోసహా ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆ ప్రాంతాల ఉపాధి అవకాశాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుకై ఆరు అంశాల సూత్రం ( సిక్స్ పాయింట్ ఫార్మూలా ) రూపొందించి అమలు చెయ్యాలని 21-9-1973 నాడు రాష్ట్రానికి అందజేసింది. ఆరు అంశాల సూత్రం లో భాగంగా ది.3-5-1974 నాడు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డి , ఆర్టికల్ 371-ఇ లను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ 371 డి    రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు కులపరంగా రిజర్వేషన్ కు అవకాశమున్నది కానీ ఈ ఆర్టికల్ ప్రకారం స్థానిక నివాసం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కలిగింది. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. జీవో 674 ద్వారా 20-10-1975న ప్రత్యేక ఆదేశాలను రాష్ట్రపతి జారీచేశారు. 27నెలలలోపల రాష్ట్రంలోని వివిధ పోష్టులను ప్రత్యేక లోకల్ క్యాడర్లుగా ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఏర్పాటైన లోకల్ కాడర్ ఆయా కేటగిరీ పోష్టులకు నియామకానికి, సీనియారిటీ, ప్రమోషనుకు , బదిలీకి , ఉద్వాసనకు ఒక ప్రత్వేక యూనిట్ గా పరిగణింపబడుతుంది. అయితే 17-1-1978నాటికి గడువు ముగిసింది.  ప్రభుత్వ ఉపాధ్యాయులను జీవో నెం. 529 ద్వారా 14-5-1976నుండి లోకల్ కేడర్ గా ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఏ పోష్టులనైనా ఆయా ప్రాంతాల్లో లోకల్ కేడరుగా ప్రకటించవచ్చు. జూనియర్ అసిస్టెంటు , అంతకు తక్కువ స్థాయ గల పోష్టులను జిల్లా స్థాయి కేడరుగా ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య  సబార్డినేటు సర్వీసు నుంచి సెకండరీ గ్రేడు, స్కూలు అసిస్టెంటు పోష్టులసు 1-1-1974 నుండి ప్రతి జిల్లా ఒక ప్రత్యేక లోకల్ ఏరియాగా పరిగణించాలని జీవో106(ఇ) ద్వారా ది.4-2-2000 న రాష్ట్రపతి ఉత్తరువులకు సవరణ తెచ్చారు. ఇటువంటి సవరణ ఉత్తరువును  పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల విషయంలో తేవడం మరచారు. ఆ తర్వాత తెద్దాం లెమ్మని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించారు. రాష్ట్రం లోని 23 జిల్లాలను 6 జోన్లుగా ( ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నట్లుగా) విభజించారు. 1981లో పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రొవిన్షియలైజ్ చేశారు, కానీ లోకల్ కేడర్ గా పరిగణింపలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జీవోలు ఇచ్చినందున  1992లో, 1998లో, 2005లో ఇచ్చిన  ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పోష్టులను లోకల్ కేడరుగా మార్చే క్లాజు చేర్చాలని , రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన పరిశీలించడం సాధ్యపడదని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని ఒక్కమాట చెప్పడానికి 1973 నుండి 2007 వరకు నోరు రాని ప్రజాప్రతినిధులకు విద్య పట్ల ఎంత ఆసక్తి వుందో తెలియడంలేదా ? 

మే దినం – వి.ఐ. లెనిన్

15/06/2007

మే దినం వి.ఐ. లెనిన్సోదర కార్మికులారా !  ప్రపంచ కార్మికుల గొప్ప పండగ దినం సమీపిస్తుంది.వారు సూర్యకాంతికి మేల్కొని జ్ఞానమార్జించినందుకు సంతోషచిహ్నంగా మే ఒకటవ తేదీని పండగ చేసుకుంటారు. సమస్త పీడనకు వ్యతిరేకంగా , సమస్త నిరంకుశానికి వ్యతిరేకంగా,  సమస్త దోపిడీకి వ్యతిరేకంగా సోషలిస్టు సమాజ స్థాపనకై పోరాడేందుకు ఒక సోదర బృందంగా ఐక్యమయినందుకు వారు ఆనాడు ఉత్సవం జరుపుకుంటారు. కష్టించి పనిచేసేవారందరూ, తమ కష్టంతో ధనికుల సామంతుల కడుపులు నింపేవారందరూ, స్వల్పజీతాలకు నడుములు విరిగేటట్లు యావజ్జీవితం శ్రమించే వారందరూ, తమ శ్రమ యొక్క ఫలితాన్ని ఎన్నడూ అనుభవించనివారంతా , నేటి నాగరికత ప్రసాదించిన విలాసాల భోగభాగ్యాల మధ్య  బ్రతుకు భారంగా పశుజీవితం గడిపేవారంతా ఆ రోజున కార్మికుల విముక్తి కోసం , కార్మికుల సౌఖ్యం కోసం పోరాడడానికి ఒకరి చేతులొకరు అందుకుంటారు. భిన్న జాతులకు, లేదా మతాలకు చెందిన కార్మికుల మధ్యవైరం సమసిపోవాలి. కార్మికుల అజ్ఞానం మీద , అనైక్యత మీద బ్రతికే దోపిడీ గాండ్రకు , నిరంకుశ పాలకులకు మాత్రమే ఈ వైరం ప్రయోజనకారి. యూదులూ - క్రైస్తవులూ, ఆర్మీనియన్లూ టాటార్లూ, పోలులూ రష్యన్లూ, ఫిన్నులూ స్వీడులూ, లెట్టులూ జర్మన్లూ  - అందరూ, వీరందరూ సోషలిజం అనే ఒకే ఒక పతాకం క్రింద కదం తొక్కుతూ కలిసి నడుస్తారు. కార్మకులందరూ సోదరులు. వారి దృఢ ఐక్యత మాత్రమే శ్రమజీవులందరి , పీడిత జనులందరి సంక్షేమానికి ,సౌఖ్యానికి హామీ. మే నెల మొదటి తేదీని సకల దేశాల కార్మిక సమాఖ్య , అంతర్జాతీయ సోషల్ డెమోక్రాటిక్ ఉద్యమం తన బలాలను బేరీజు వేసుకుంటుంది. స్వాతంత్ర్యం , సమానత్వం, సోదరత్వం కొరకు మరింత నిర్విరామంగా, మరింత దృఢ నిశ్చయంతో పోరాడ్డానికి తన శక్తినంతనూ సమీకరించు కొంటుంది.                                              కామ్రేడ్స్ ! రష్యాలో గొప్ప ఘటనలు జరగబోతున్న కాలంలో మనం ఉన్నాం.  జారిష్టు నిరంకుశ ప్రభుత్వం మీద మనం చిట్టచివరి మహోగ్రపోరాటం ప్రారంభించాం. అంతిమ విజయం సాధించేవరకు మనం ఈ పోరాటం కొనసాగించాలి. పశువులు, దుష్టపాలకులు, రాజాశ్రితులు, పెట్టుబడిదారీ లంచగొండులతో కూడిన ఈ ప్రభుత్వం యావన్మందీ రష్యన్ ప్రజలకు ఎట్టి విపత్తులు తెచ్చిపెట్టిందో చూడండి ! జారిష్టు ప్రభుత్వం రష్యా ప్రజల్ని జపానుకు వ్యతిరేకంగా మతిలేని యుద్ధంలోకి యీడ్చింది. అనేక వేలమంది యువకుల్ని , ప్రజలనుంచి వేరుచేసి , దూరప్రాచ్యంలో దిక్కులేని చావు చావడానికి పంపింది. ఈ యుద్ధంవల్ల మనకు దాపురించిన విపత్తులన్నింటినీ వర్ణించడానికి మాటలు చాలవు. ఇంతకూ ఈ యుద్ధం ఎందుకొచ్చినట్లు ?  మన జారిష్టు దోపిడీ ప్రభుత్వం చైనా నుంచి లాక్కున్న మంచూరియాను రక్షించుకునేందుకు. ఒక విదేశీ ప్రాంతం కొరకు రష్యన్ ప్రజల రక్తం ధారవోయబడుతుంది. దేశం సర్వనాశనం చేయబడుతుంది. కార్మిక-కర్షకుల జీవితం అంతకంతకూ బాధాకరమౌతుంది. పెట్టుబడిదార్లూ , అధికార్లూ వారి మెడల చుట్టూ ఉరిత్రాటిని అంతకంతకూ గట్టిగా బిగించి వేస్తుంటే , జారిష్టు ప్రభుత్వం విదేశీ భూభాగాల్ని కొల్లగొట్టుకునేందుకు ప్రజానీకాస్సి పంపిస్తుంది. చేతగాని జారిష్టు సేనాధిపతులూ, లంచగొండి అధికారూలూ రష్యన్ నౌకాదళ విధ్వంసానికి కారకులయ్యారు. అనేక వందల కోట్ల జాతీయ సంపదను దుబారా చేశారు. సైన్యాలకు సైన్యాలనే  కోల్పోయారు. అయినా యుద్ధం యింకా సాగుతూనేవుంది. ఇంకా ఎక్కువ ప్రాణాల్ని అది బలిగొంటూనే వుంది. ప్రజలు సర్వనాశనం అవుతున్నారు. పరిశ్రమలూ, వ్యాపారం స్తంభించి పోతున్నాయి. కరువు, కలరా తాండవించనున్నాయి. అయినా , యీ నిరంకుశ ప్రభుత్వం అంధోన్మత్తతతో పాత మార్గాన్నే అనుసరిస్తుంది. కొద్దిమంది పశువుల్నీ, దుష్టపాలకుల్నీ రక్షించేటందుకుగాను అది రష్యాను సర్వనాశనం చేయటానికి సిద్ధపడింది. ప్రస్తుతం అది జపానుతో చేసే యుద్ధం కాక మరో యుద్ధం కొనసాగిస్తోంది. అది యావన్మంది రష్యా ప్రజలపై యుద్ధం.                         నిద్రనుండి , అజ్ఞానం నుండి , దాస్యం నుండి మేలుకోవడం ఇప్పుడు అనుభవించినంతగా ఇదివరకెన్నడూ రష్యా అనుభవించలేదు. కార్మికులు , రైతులు మొదలు భూస్వాములూ , పెట్టుబడిదార్ల వరకు అన్ని వర్గాల ప్రజల్లో కదలిక వచ్చింది. అన్నిచోట్ల సెయింట్ పీటర్స బర్గలో , కాకసన్ లో , పోలేండులో , సైబీరియాలో నిరసన ధ్వనులు వినబడుతున్నాయి. ప్రతిచోట యుద్ధం అంతమవ్వాలని ప్రజలు కోరుతున్నారు. స్వతంత్ర ప్రజా పరిపాలన స్థాపింపబడాలని వారు అభిలషిస్తున్నారు. ఎట్టి మినహాయింపులు లేకుండా యానన్మంది పౌరుల ప్రతినిధులతో రాజ్యాంగ నిర్ణయ సభను సమావేశపరచాలనీ , జారిస్టు ప్రభుత్వంచే అగాధంలో ముంచబడుతూన్న జాతిని ఆ సభ కాపాడాలనీ వారు కోరుతున్నారు. సెయింట్ పీటర్సుబర్గులో రెండు లక్షల మంది కార్మికులు ఈ ప్రజాకోర్కెలను నివేదించడానికి జనవరి తొమ్మిదవ తేదీ ఆదివారంనాడు గపోన్ ఆనే మతగురువు నాయకత్వం క్రింద జారు చక్రవర్తి వద్దకు వెళ్ళారు. జారు ఈ కార్మికుల్ని శత్రువులుగా పరిగణించాడు. వేలాది నిరాయుధ కార్మికుల్ని సెయింటు పీటర్సుబర్గు  వీధుల్లో కాల్చి చంపించాడు. పోరాటం నేడు రష్యా అంతటా జరుగుతుంది. కార్మికులు స్వేచ్ఛ కోసం , మంచి బ్రతుకు కోసం సమ్మె చేస్తున్నారు. రీగాలోనూ, పోలెండులోను, వోల్గా నది మీద , దక్షిణ ప్రాంతంలోనూ రక్తం చిందింపబడుతుంది. అన్ని చోట్ల రైతులు ముందుకొస్తున్నారు. స్వాతంత్ర్యం కొరకు జరిగే యీ పోరాటం ప్రజలందరి పోరాటంగా రూపొందుతుంది.           జారిష్టు ప్రభుత్వం ఉన్మాదంలో పడింది. యుద్ధం కొనసాగించడానికి అది ఋణం చేయాలనుకొంటుంది గాని, ఎవరూ ఇక దాన్ని నమ్మరు. ప్రజా ప్రతినిధుల్ని సమావేశపరుస్తానని అది వాగ్దానం చేస్తోందిగానీ, పరిస్తితుల్లో ఎట్టిమార్పు లేదు. చిత్రహింసలు ఆగిపోవటం లేదు. అధికారుల చట్ట ధిక్కారం యధాప్రకారం సాగిపోతుంది. స్వేచ్ఛగా బహిరంగసభలు జరుపుకోవడానికి వీల్లేదు. ప్రజల పత్రికలను స్వేచ్ఛగా పంచిపెట్టుకోకూడదు. కార్మిక వర్గ  ఆశయం కోసం పోరాడినందుకు జైళ్ళలో మగ్గుతున్నవారు విడుదల చేయబడడం లేదు. జారిష్టు ప్రభుత్వం ఒక జాతిని మరొక జాతి మీదికి ఉసిగొల్పుతుంది.  బాకూలో నివసించే టాటార్లలో ఆర్మీనియన్ల మీద అసూయను రెచ్చగొట్టిన ఫలితంగా పెద్ద హత్యాకాండ సంభవించింది. ఇప్పుడు అమాయక ప్రజల్లో యూదుల మీద ద్వేషాన్ని పురికొల్పడం ద్వారా మరొక హత్యాకాండకు సన్నాహాలు జరుపుతుంది.                                      కార్మిక సోదరులారా ! రష్యన్ ప్రజలపై జరిగే యిలాంటి ఘోరాలను మనం ఇక సహించబోము. స్వాతంత్ర్య రక్షణకై మనం నడుములు బిగిస్తాం. ప్రజల క్రోధాన్ని అసలు శతృవు నుండి మళ్ళించేటందుకు ప్రయత్నించే వారినందరిని మనం ఎదుర్కొంటాం. జారిష్టు ప్రభుత్వాన్ని కూలద్రోసి యావన్మది ప్రజలకు స్వాతంత్ర్యం సాధించటానికి మనం సాయుధులమై లేద్దాం. కార్మిక కర్షకులారా !  ఆయుధాలు ధరించండి! రహస్య సమావేశాలు జరుపుకోండి!  పోరాట దళాలను నిర్మించుకోండి!  సేకరించగల ఆయుధాలన్నిటినీ సేకరించండి. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీతో సంప్రదింపులు జరపటానికి ప్రతినిధులను పంపండి. ఈ సంవత్సరం మే ఒకటవ తేదీని ప్రజల తిరుగుబాటు రోజుగా పరిగణించి ఉత్సవాలు జరుపుకొందాం. దానికొరకు మనం సన్నద్ధమవుదాం. దుష్ట ప్రభుత్వం పై నిర్ణాయకమైన దెబ్బ తీయటానికి సంకేతం కోసం ఎదురు చూద్దాం. జారిష్టు ప్రభుత్వం నశించాలి !  దాన్ని మనం కూలద్రోసి , ప్రజల రాజ్యాంగ నిర్ణయ సభను సమావేశ పరచేటందుకు ఒక తాత్కాలిక విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. ప్రజల ప్రతినిధులు సార్వజనీన , ప్రత్యక్ష, సమాన పద్ధతి పై రహస్య ఓటింగు ద్వారా ఎన్నుకోబడాలి. స్వాతంత్ర్య సమర యోధులందరినీ జైళ్ళ నుంచీ, లేదా ప్రవాస నిర్బంధం నుంచి విడుదల చేద్దాం. సభలు బహిరంగంగా జరుపుకుందాం. ప్రజల పత్రికలను పాడు అధికారుల అజమాయిషీ లేకుండా అచ్చువేసుకుందాం. ప్రజలందరూ ఆయుధాలు ధరించాలి. ప్రతి కార్మికునికి ఒక రైఫిలు చొప్పున యివ్వాలి. అప్పుడు కొద్దిమంది దోపిడీదారులు కాకుండా , ప్రజలే తమ భవిష్యత్తును తామే నిర్ణయించు కుంటారు. గ్రామసీమల్లో భూదాసుల యజమానులైన భూస్వాముల పెత్తనాన్ని కూలద్రోసేటందుకు , అధికారుల పాడు జులుం నుంచి ప్రజల్ని విముక్తి చేసేటందుకు , రైతుల నుంచి లాక్కోబడిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి స్వతంత్ర్య రైతు కమిటీలు స్థాపింప బడాలి.                                ఇదీ సోషల్ డెమోక్రాట్లు కోరేది. యిందుకోసం సాయుధంగా పోరాడమని వారు మిమ్మల్ని కోరుతున్నారు. సంపూర్ణ స్వేచ్ఛ, ప్రజాతంత్ర రిపబ్లిక్కూ , ఎనిమిది గంటల పనిదినం , రైతు కమిటీల స్తాపన వీటికోసం పోరాడాలి. కాబట్టి కార్మిక సోదరులారా!  యీ మహా సంగ్రామం కొరకు సన్నద్ధం కండి. మే ఒకటవ తేదీని ఫ్యాక్టరీలలోనూ , మిల్లులలోనూ పని మానివేయండి. లేదా సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ కమిటీల సలహా మేరకు ఆయుధాలు ధరించండి. తిరుగుబాటుకు గంట ఇంకా మ్రోగలేదు గాని, అందుకు ఎక్కువ సేపు పట్టదు. స్వాతంత్ర్య సాధనకై ఎనలేని త్యాగాలు చేసిన రష్యన్ వీర శ్రామికుల వైపు ప్రపంచ కార్మికులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు.  సెయింటు పీటరుబర్గు కార్మికులు ప్రఖ్యాత జనవరి తొమ్మిదవ తేదీని స్వాతంత్ర్యమో , వీర మరణమో అంటూ నినదించారు. రష్యా దేశపు సమస్త కార్మిక జనులారా !  నేడు ఆ యుద్ధ నినాదాన్ని పునశ్చరణ చేద్దాం. ఎన్ని త్యాగాలైనా చేయడానికి వెనుదీయవద్దు. తిరుగుబాటు ద్వారా మనం స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం. ఆ స్వాతంత్ర్యం ద్వారా సోషలిజం !            మే మొదటి తేదీ చిరస్థాయి అగుగాక !  అంతర్జాతీయ విప్లవ సోషల్ డెమోక్రటిక్ ఉద్యమం చిరస్థాయి అగుగాక !   కార్మిక కర్షక స్వాతంత్ర్యం  చిరస్థాయి అగుగాక !  ప్రజాతంత్ర రిపబ్లిక్ చిరస్థాయి అగుగాక !  జారిష్టు నిరంకుశ ప్రభుత్వం నశించాలి ! [ 1905 ఏప్రిల్ 12 (25) కు ముందు రచింపబడినది  ]       

లోకాయుత జ్ఞాన సిద్ధాంతం

26/05/2007

జ్ఞాన సముపార్జనకు లోకాయతులు ఇంద్రియాల పైనే ఆధారపడ్డారు. జ్ఞాన సంపాదన కోసం ప్రమాణాలు తార్కికంగా వివిధాలున్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తప్రమాణం, ఆగమ ప్రమాణం (వేద ప్రమాణం) ఇట్లాంటివి వున్నాయి.
ప్రత్యక్షానుమానోపమాన శాబ్దాః ప్రమాణాని…”
ప్రత్యక్షోహ్యేత య్మోరూలం
కృతాంతై తిహ్య యోరపి|
ప్రత్యక్షేణా గమో భిన్నః
కృతాంతోవా న కించన||”మానవ జ్ఞాన సంపాదనకు ప్రత్యక్షమే పరమావధి.ఎన్ని ప్రమాణాలున్నా ప్రత్యక్షానుభూతికి లొంగక తప్పదు. మతం చూపే ప్రమాణ గ్రంధాలన్నీ అనుభవానికి దూరంగా వుంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష ప్రమాణానికి నిలువవు.ఋజువుకు పనికిరావు. అనుమానం మొదలైన ప్రమాణాలను చార్వాకులు తిరస్కరించారు. అయితే అవి అన్నివిషయాలలో గాదు.
యత్ర యత్రాను మానేస్మిన్
కృతం భావయతో పిచ|
నాన్యో జీవః శరీరస్య
నాస్తికానాం మతే స్థితః||”అనుమాన ప్రమాణానికి సంబంధించినంతవరకూ ఏదీ ముఖ్యమైంది కాదు. అశాస్త్రీయ గ్రంధాలైన మత గ్రంధాలనాధారంగా చేసుకొనీ, మతాలు చెప్పే నమ్మకాలకు సంబంధించి అనుమాన ప్రమాణాన్ని గానీ నమ్మి ఆత్మ సిద్ధాంతాన్ని ఋజువు చెయ్యలేం.
                 అంటే చార్వాకులు – అనుమానాది ప్రమాణాలను త్రోసిపుచ్చి కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే నమ్ముతారని మాధవాచార్యులు తమాషాగా వక్రీకరించి ఈ సిద్ధాంతం పట్ల మేధావులకు వైముఖ్యం కలిగేట్లు చేయడానికి యత్నం చేశాడు.
               తన సర్వ దర్శన సంగ్రహం లో లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని వివరిస్తూ వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని తిరస్కరిస్తారని చెప్పాడు. మాధవాచార్యులీపని చేయడానికి బౌద్ధ దృక్పధం బాసటగా నిలిచింది.
అనుమానాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే దినసరి జీవితంలో చాలా అసాధ్యాలను ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనుడనే తార్కికుడన్నాడు. ఇదంతా మాధవాచార్య కృతకవ్యాఖ్య వల్ల వచ్చిన ప్రమాదం.
మతం ఊహాజనితంగాచెప్పే -స్వర్గం -నరకం -పుణ్యం- పాపం- ఆత్మ -దైవం -పూర్వజన్మ- పునర్జన్మ- లాంటి వాటిని అనుమాన ప్రమాణం ఆధారంగా చేసుకొని నమ్మరాదనీ, వాళ్ళ అనుమానం చెల్లదనీ లోకాయతులు చెప్పారు.అంతేగాని, ఇతర విషయాలలో గాదు. ఇంద్రియానుభవానికి దగ్గరగా ఉండేవాటి విషయంలో అనుమాన ప్రమాణాన్ని చార్వాకులు అంగీకరిస్తారు.
బుద్ధమోషుడు లోకాయతుల జ్ఞాన సిద్ధాంతాన్ని విమర్శిస్తూ దీనిని వితండవాద శాత్త అంటే వితండవాద శాస్త్రం గా పేర్కొన్నాడు.
                              వితండ – వాద – అనేవి రెండు లక్షణాలు. ఒకటిగాదు.ఈరెండూ పరస్పర విరుద్ధ గుణాలు కలవి.
వితండ- విచ్చిన్నానికి దారితీసే, వాదం- నిర్మాణానికి పనికివస్తుంది.ఈ పరస్పర విరుద్ధ లక్షణాలను లోకాయతులకంటగట్టి బౌద్దుల లోకాయతాన్ని అపహాస్యం చేయడానికి పూనుకున్నారు. మాధవాచార్యుడు వీళ్ళనే అనుసరించాడు.
తర్కశాస్త్రంలో వితండ లక్షణం :
స ప్రతిపః స్థాపనాహీ వో వితండా అని చెప్పబడ్డది.
స్వపక్షమును స్థాపింపక, పరపక్షమును ఖండించుటయే ఫలము గల వార్తాలాపం వితండ అని చెప్పబడుతుంది.వాదలక్షణము ప్రమాణ తర్క సాధనో పాలంభః సిద్ధాంతా విరుద్ధః పంచాపయనోపపన్నః పక్ష ప్రతిపక్ష పరిగ్రహోవాదః ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారాను వానికి అనుకూలించు తర్కముల ద్వారాను తన పక్షమును సాధించుచు పరపక్షమును నిషేధించునట్టిదియు, సిద్ధాంతమును విరోధింపనట్టిదియు, ప్రతిజ్ఞ మొదలగు ఐదు అవయవములు గలిగినదియు, వాది ప్రతివాదులచే పక్ష ప్రతిపక్షములు కలదియు నగు చర్చా విశేషము వాదనమనబడును.
                               ఈ రెంటికీ ఒకే అర్ధం చెప్పి పనికిమాలిన కుతర్కంగా భావించి చెప్పారు. అయితే ఇది వాస్తవమా?
శుక్ర నీతిసారం అనే గ్రంథం నాస్తికుల్ని తార్కిక వివాదాల్లో ఆరితేరిన వాళ్ళుగా పేర్కొంది. మత భావాలను తూర్పారబట్టటంలో వీరి వాదనాపటిమ అజేయం. ఇది విధ్వంసక లక్షణం. అదే సమయంలో సిద్ధాంత స్థాపన విషయంలో నిర్మాణాత్మక వైఖరి వీళ్ళ తర్కంలో కనిపిస్తుంది. పునాది లేని , అర్ధ రహితమైన మతాచారాలను తమ తార్కిక శక్తితో తునాతునకలు చేసి వాటికి ప్రజల్లో స్థానం లేకుండా చేస్తున్నారనే కారణంతో లోకాయతాన్ని వైదిక మత ప్రచారకులూ, వాళ్ళతోపాటు సనాతన ధర్మానికి మారిపోయిన బౌద్ధ జైనులూ పనిగట్టుకొని ఈపని చేశారు.పశుశ్చే న్నిహత స్సర్గం
జ్యోతిష్టో మేగ మిష్యతి|
స్వపితా యజమానేన
తత్ర కస్మాన్న హస్యతే|| “జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలలో చంపబడ్డ జంతువుకు స్వర్గం వస్తుందని అంటారు. అయితే యజ్ఞకర్త తన తండ్రినే చంపితే తండ్రికే స్వర్గం ఇప్పించినవాడౌతాడుగదా! తండ్రిని ఎందుకు చంపడు?వృక్షాన్ భిత్వా పశూన్ హత్వా
కృత్వారుధిం కర్దమం |
ఇత్యేవం గమ్యతే స్వర్గం
నరకం కేన గమ్యతే ||
చెట్లను నరికి , జంతువులను చంపి రక్తపు మడుగులు గావించేవారంతా స్వర్గానికి వెళుతుంటే, నరకానికి ఎవరు వెళతారు?
గచ్చతావిహ జంతూనాం
వ్యర్ధం పాధేయ కల్పనం |
గేహస్థ కృత శ్రాద్ధేన
పధి తృప్తి రవారితా ||
మనం శ్రాద్ధం జరుపుతూ ఇంటిలో పెట్టిన ఆహారం పైలోకాల్లోని పితరులకు చేరుతుందని అంటారు. అయితే పనిమీద పొరుగూరు పోయిన మన కుటుంబ సభ్యులకు వేళ ప్రకారం ఇంటిలో అన్నం విస్తరిలో వడ్డిస్తే ఆకలి తీరుతుందా? ఈరకంగా చార్వాకులు మతాచారాలను తమ తార్కిక శక్తితో చాలా సరళంగా, నిశితంగా ఖండించి ప్రజల్లో దానికి స్థానం లేకుండా చేయడానికి ప్రయత్నించారు.
               హరిభద్రసూరి రాసిన షడ్దర్శన సముస్చయా నికి లఘు వ్యాఖ్య వ్రాసిన మణిబద్రుడు లోకాయతుల ప్రత్యక్ష ప్రమాణాన్ని తెలియజేస్తూ ఇంద్రియానుభవానికి విరుద్ధమైనవాటికి ప్రాధాన్యం ఇస్తే ఎంత నష్టం వస్తుందో వివరించాడు.
దరిద్రోహి స్వర్గరాశిర్మే అస్తీత్య సుధ్యాయ హేలయై వాదౌః స్థ్యదలయేత్, దాసోపిస్వ చేతన స్వావితామవలంబ్య కిం కరతాం నిరాకుర్యాదితి…”
కనబడని వాటికి అస్తిత్వాన్ని అంగీకరిస్తే – దరిద్రుడు తాను బంగారు కుప్పపై కూర్చున్నట్టుగా భావించి తన పేదరికాన్ని అనాసక్తంగా చూసే ప్రమాదముంది.బానిస తాను యజమానినని బ్రమించే ప్రమాదం ఉంది.
లోకాయతులు హేతువునకు నిలబడనివాటిని ,కేవలం విశ్వాసం మీద ఆధారపడ్డవాటిని తిరస్కరించారు.
జ్ఞాన సంపాదనా విషయంలో అనుభవానికి గోచరంకానిదానిని వ్యతిరేకించారు. రెండు విభిన్న సంస్కృతుల మధ్య జరిగిన చర్యగా దీనిని మనం గమనించాలి.ఎవరెన్ని చెప్పినా లోకాయతులు ఈ దేశకు తొలి తార్కికులు . తమ తార్కిక శక్తితోటే విశ్వాసమే ఆధారంగావున్న అహేతువులైన మత సంప్రదాయాలను , ఆచారాలను బట్టబయలు గావించి ప్రజల్లో వాటికి స్థానం లేకుండా చేయడానికి యత్నం చేశారు.అందుకే వీళ్ళ ధాటికి తట్టుకోలేని మతప్రచారకులు గుంపులుగా చేరి వివిధ రకాల విమర్శనాస్త్రాలను గుప్పించారు. అయినా, ఏమీ చేయలేక పోయినారు.
లోకాయుతం – నీతినాస్తికులు – తిను,తాగు,సుఖం అనుభవించు- అప్పు చేసైనా సరే భోగాలనుభవించు అనే చవకబారు నీతిని చెప్పి ,జీవిత విధానాన్ని ఉన్నత విలువలనుంచి నీచ స్థితికి దిగజార్చారని ప్రచారం గావించారు. అంతా పనిగట్టుకొని ఈ సిద్ధాంత కర్తలపై దుమ్మెత్తిపోశారు.
సర్వ దర్శన సంగ్రహం రాసిన మాధవాచార్యులు ఋణం కృతా ఘృతంపి బేత్ అని కల్పించి చెప్పాడు.
షడ్దర్శన సముచ్చయకర్త హరిభద్రుడు కూడా-
పిబ ఖారచజాత శోభనే! యతీతం పరగాత్రి! తన్నతే
నహి భీరు! గతం నివర్తతే, సము యమమాత్రమిదం కళేబరం
ఇది ఉమ్రఖయ్యాం భావాలనే పోలివుంది.
ఓ జాత శోభనా! తిను, తాగు- గడచిన సమయం తిరిగి రాదు. అందుకే ఇప్పుడే అనుభవించు. ఇది చాలా పేలవమైన అభిప్రాయం. లోకాయత కేవలం ఇంద్రియ సుఖాలపై వెంపరలాడిన సిద్ధాంతం గా వక్రీకరించడానికి చేసిన యత్నం.
కృష్ణమిశ్రుడు కూడా ప్రబోధ చంద్రోదయ నాటకంలో చార్వాక పాత్ర ద్వారా లోకాయతుల నీతి ఏమిటో చెప్పిస్తాడు.
క్వా లింగనం భుజని పీడిత బాహు మూలం
భుగ్నోన్న తస్త న మనోహర మాయాతాక్ష్యాః|
భిక్షోపవాస నియమార్క మరీచి దాహైః
దేహోపశోషణ విధిః కుధియాం క్వచైషః||
పురుష బాహుమూలాలచే పీడనములైన మనోహరములైన స్త్రీ కుచాలింగనమెక్కడ? భిక్ష, ఉపవాస, పంచాగ్నులతో దేహం శుష్కింప చేయటం వంటి శారీరక కష్టముల ఆచారాలెక్కడ? ఇంద్రియ సుఖాన్ని పొందటమే పరమార్ధం.త్యాజ్యం సుఖం విషయ సంగమ జన్మ పుంసాం
దుఃఖోప స్పష్టమితి మూర్ఖ విచార ణైషా|
వ్రీహీన్ జిహా సతి సిలోత్తమ తండులాడ్యాన్
కోనామ భోస్తు షకణోప హితాన్ హితార్ధీ||-ఇలాంటివే చాలా రకాలుగా అంటగట్టారు.
లొకాయతం ఇంత చవకబారు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేదైతే, ఇంది ప్రజల్లో వేళ్ళూనుకుని ఉండేదికాదు. అన్ని తరగతుల ప్రజల్ని ఆకర్షించేది కాదు.మనం కేవలం ప్రతిపక్షుల గ్రంధాలపైనా, వాళ్ళ విమర్శల పైనా ఆధారపడటం వల్ల లోకాయతనుగూర్చి సరైన విధంగా ఆలోచించలేము. భారతంలోనూ, హరివంశంలోనూ బ్రాహ్మణపండితులే లోకాయతను అధ్యయనం చేసినట్లు దాన్ని అధ్యయనం చేయడం సగర్వంగా ఒక గొప్ప అర్హతగా చెప్పుకున్నారు. ఇది పైవారు చెప్పినట్లుగా కేవలం ఇంద్రియసుఖ లంపటత్వంలో మునిగిందైతే ఇంత ప్రభావం చూపేదా? కాదని సులభంగానే చెప్పవచ్చు.
                 అయితే లోకాయుతుల నీతిని, జీవన విధానాన్ని ఎట్లా రచించాలి? దీనికి శత్రువులకు కూడా ఆశ్చర్యం గొలిపే వృత్తాంతం భారతం లోనే వుంది.
ఇంతకుముందు చెప్పిన భారతం లోని చార్వాకుడి వృత్తాంతం లోకాయత నీతికి నిదర్శనం గా వుంది.
ముందు భారతం లోని కథ చూద్దాం. (శాంతి పర్వం-ప్రథమాశ్వాసం).
” ….అట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుండను నొక్కరక్కసుండు విప్రాకారంబు
గైకొని త్రిదండి వేషం బలపడ నయ్యవనీ దేవతాకోటిలో నిల్చియున్న రాధమునకిట్లనియె-
చంప. వినుము నరేంద్ర! సర్వమును విప్రజనంబును గూడి నన్ను బం
చిన విధ మీతడేటి పని సేసిన పాపము పెద్ద చంపుచో|
జనకుడు బ్రాత పుత్రుడను శంక యొకించుక లేదు సద్గురుం
డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయు బుట్టదుగాని గాల్పనే?||
|| అనుమనిరని పలికి వెండియు
ఆ. ఇట్లు శిష్టజనము నేవగిపగడజేయు
రాజ్యమెల్ల బంధు రాజినెల్ల
బొలియజేసి యెట్టి భోగంబు లనుభవిం
చెదవు, కల్మషంబు చిక్కె నీకు.
||అనిన విని యవ్విప్రు లత్యంత వ్యధితాంతః కరణులగుచో నొండురుల మొగంబులు చూచి, ఇట్లు పుట్టంబనియేమియను వచనంబులతో నిరుగుడుపడిరి. ధర్మనందనుడు లజ్జావనతవదనుండై యూరకుండి వారలవలను కనుంగొని కేలుమొగిచి ఫాలభాగంబున గదియించి ఇట్లనియె-
తే. మ్రొక్కివేడెద నను మీరు ధిక్కరింప
కాదరింపుడు మునిసమోహానమతుడ |
నై వినిశ్చయ పరికి లతాంతరంగ
వర్తనముతోడ నిచటికి వచ్చినాడ ||
|| అనవుడు భయసంభ్రమ భరితములగుచు నా భూసురులు దేవా! ఈ వాక్యంబులు, మావలనం బుట్టినవికావిది యేమియోగాని నీ వుత్తమ క్షాత్రధర్మంబున సముపార్జించిన యుజ్జ్వలశ్రీ సుస్థిరతంబొందుమని యతనికి నా శ్వాసంబొనర్చి యమ్మాయభిక్షువు నాలోకించి పరమబోధంబున నప్పురుషాధము నెరింగి యమ్మహీపతితో – వీడు దుర్యోధన సఖుండగు రాక్షసుండు, సన్యాసి వేషంబున నేతెంచి యాతనికి హితంబాచరించువాడై ఈ దుర్వచనంబులాడె, నీకుక్క మొరిగిన, యంతన పాలమున్నీరుంబోని నీకు గలంగనేల ధర్మాత్ములగు తమ్ములు పమపుసేయం బూజ్యంబగు సామ్రాజ్యంబు వహింపుమని యాదరించి -
కం. ఆ రాక్షసు గనుకొని కో
పారంజిత నేత్రులగుచు నవ్విప్రులు హుం |
కార ముఖరలగుటయు నతి
ఘోరాకృతితోడ వాడు గూలెం బుడమిన్ ||
తే. బ్రహ్మతేజో నిహతినట్లు పడి మహాశ
ని ప్రహతి పాతితోర్విజ విబ్రాంతినొంది |
యన్న యద్దానవుని జూచి యన్నరేంద్రు
డెలిమి సొంపు వహించె దమ్ములున్ దాను ||
|| ఇట్లు ప్రీతుండై యజాతశత్రుం డవ్విప్రసమూహంబునకు సవిషేసార్చనంబొనర్చి వీడుగొలిపె నప్పుడచ్యుతుండు బ్రాహ్మణ స్తుతిచేసి యజ్ఞనపతితో నిట్లను గృతయుగంబునన్ జార్వాకుండను దైత్యుండు తపంబొనరించి పద్మభవుండు ప్రత్యక్షంబయిన నిఖిల భూతములవలనను నభయంబు వేడిన నద్దేవుడు భూదేవతల కనిష్టంబైన పనులు చేయకుండువాడవు చేసితేని యదియునీకు దుదియని పలికి యవ్వరంబొసంగెనట్లు లబ్దవరుండై వాడు గర్వించి గీర్వాణుల బాధింపందొడంగిన వారు విరించింగాంచి యారక్కసుండు సేయు బాధలంజెప్పిన యమ్మహాత్ముండేను మున్న యెరింగి యొనర్చిన నాడె, దుర్యోధనుండును రాజునకు నెచ్చెలియై యచ్చపలుండు తర్కార్యంబాచరింపజొచ్చి యమ్మహీసురులకు మనోవ్యధాకరంబగు కర్మంబుసేయు నప్పని కారణంబుగా వారలకోపంబునంగూలం గలవాడని పలికె. నద్దానవుండు నేడిటవచ్చి తన దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవాడని చెప్పి, యప్పీనుగుం వెడల వైపించి, యాభూపాలు నుద్దేశించి వెండియు -ఆ.మారుకొన్న వారి నీరు సేయము ప్రజ
నరసి మనుపు ధరణి సురుల బ్రోవు |
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ
వృత్తి మనపు వెంపు వెలయ నధిప ||కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు తన తమ్ములతో యుద్ధరంగం నుండి పట్టణానికి వస్తున్నాడు. పట్టణం బయట ధర్మరాజుకు స్వాగతం పలకటానికి బ్రాహ్మణ వర్గం పోగైవుంది. ధర్మరాజు వస్తున్నాడు.ఆ గుంపులోనుండి ఒక వ్యక్తి ,చార్వాకుడి పేరుతో వున్నవాడు, ముందుకు పోయి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఏమయ్యా! ఈ బ్రాహ్మణవర్గం నిన్ను శపించమని నన్ను పంపింది. తండ్రి, తాత, సోదరుడు, గురువు – అనే విచక్షణలేకుండా అందరినీ చంపావు. ఎంతోపాపం మూటగట్టుకున్నావు.బంధువులందరినీ చంపి నీవు పాలించేది దేన్ని? “
ఇది చార్వాక నీతి . ఇందులో మాధవాచార్యులుగాని, హరిభద్రసూరిగాని, కృష్ణమిశ్రుడుగాని చెప్పిన ఇంద్రియ సుఖలాలసత్వం ఎక్కడుంది?
చార్వాకుడి ఈ హఠాత్సంఘటనకు బ్రాహ్మణులంతా నివ్వెరపోయారు.నైతికంగా తప్పు చేసినందుకు ధర్మరాజు గాయపడి చావాలనుకున్నాడు.కాని కొంతసేపటికి పురోహితవర్గం తెలివి తెచ్చుకొని చార్వాకుణ్ణి తాము పంపలేదనీ, ఈతడు దుర్యోధనుని స్నేహితుడైన రాక్షసుడనీ, చెప్పి – ధర్మరాజుని పొగడి , చార్వాకుణ్ణి దహించివేశారు.
చార్వాకుడు రాక్షసుడనీ, దుర్యోధనుడి స్నేహితుడనీ చెప్పిన ఈ కథ కల్పితమని తెలుస్తూనేవుంది.ఇది చాల దుర్బుద్ధితో కూడుకున్న పని. అయితే ఇక్కడ ఓవిషయం గమనించాలి. చార్వాక – లోకాయత పదాలు పర్యాయపదాలు. చార్వాకుడికంటగట్టిన భావాలు లోకాయతకు గూడా వర్తిస్తాయి. ఇక్కడ ధర్మరాజు చేసిన పని – స్వీయ బంధువుల్ని, గురువుల్ని చంపడం – సామాన్య జన్నాన్ని గాదు. రక్తసంబంధీకుల్ని చంపడమనేది మానవుడి సాంఘీక నీతికి విరుద్ధం. అటవిక నీతికి భంగం కలిగించడం. మానవ సమాజ ప్రాథమిక విలువల్ని ధర్మరాజు మంటగలిపాదు. వాటిని ధ్వంసంచేయడం తప్పని చార్వాకుడు ఎదురు తిరిగాడు. ఇందులో నీతి వుందా, తప్పు వుందా? ఏ భావవాది దీన్ని దోషమంటాడో చెప్పమనండి. ఇదే విషయం గీతలో కృష్ణుడు – బంధువుల్ని చంపటానికి వెనకాముందూ ఆలోచిస్తున్న అర్జునుణ్ణి హింసకు పురికొల్పుతాడు.
హతోవా ప్రాప్యసే స్వర్గం -
జిత్వావా భోక్షసే రాజ్యం అంటాడు.
హింసకు ప్రేరేపించిన కృష్ణుడినీతి గొప్పదా? మానవ విలువల్ని కాలరాయటం తప్పని ధర్మరాజును నిలదీసిన లోకాయతుడిది తప్పా? ఏది ధర్మం, ఏదధర్మం? ఎవరు ఇంద్రియ సుఖలాలసత్వాన్ని బోధిస్తున్నారు? ఎవరు ఉన్నత జీవన విలువల్ని భగ్నం చేస్తున్నారు? మనం ఆలోచించాలి.లోకాయతం – తత్త్వశాస్త్రంలోకాయతం మనకు కనిపిస్తున్న ఈ లోకానికి సంబంధించిన తత్త్వశాస్త్రం. ఇది ఈ పదంలోనే కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజల దృక్పథం – అని లోకాయతకు అర్ధం చెప్పుకొనేటప్పుడు దీన్ని మనం వేరేవిధంగా అన్వయించలేం.
అంతేగాక, ఇతర తత్త్వశాఖలకు ఆయా వ్యక్తులకు కర్తలుగా వున్నారు. కానీ , ఇది ఒక వ్యక్తి ప్రచారం చేసిన తత్త్వశాస్త్రం గాదు. ప్రజల ఆలోచనల నుంచి బయలుదేరిన ప్రజాతత్వశాస్రము. ఈలోకానికి సంబంధించింది. కాబట్టి భౌతిక తత్వశాస్త్రంగానే ఘంటాపథంగానే చెప్పవచ్చు.ఇది ప్రజల చరిత్రతో విడదీయరాని సంబంధం వున్నశాస్రం.ప్రపంచ సృష్టిని గూర్చి లోకాయతులు ఏమంటారు ? ఇది ఏఅతీతశక్తుల వల్లనూ ఏర్పడింది కాదంటారు. భౌతిక పదార్ధాల పరిణామం వల్ల ఈ ఙగతి సృష్టి ఏర్పడిందనీ , దానిని ఏ భగవంతుడూ కారణం కాదని అంటారు.కామస్తనదగ్రే సమవర్త తాధిమనసోరేతః ప్రథమం యదాసీత్నతో బంధమనతి నిరనిందన్ హృదిప్రతీష్యాక వయో మనీషా
ఆంతరంగిక పరిణామం వల్లనే ఈ విశాల విశ్వం ఏర్పడింది. ప్రకృతి శక్తికి మొదట బీజం అట్లా ఏర్పడ్డదే. విజ్ఞానులు తమతమ విజ్ఞాన సంపత్తిచే, చేతనాచేతన విశ్వాన్ని విశ్లేషించారు.
ఇయం వి సృష్టిర్యత అబభూవ
య దివాదదే య దివాన
యో అస్వాధ్యక్షః పరమే
వ్యో మన్సఅగ వేదయదివా న వేద
విశ్వసృష్టి ఎక్కడనుండి వచ్చిందో ? ఇది సృష్దించబడ్డదా ? కాదా ? ఈ విషయాన్ని ఏదో స్వర్గలోకంలో వుండి పరిశీలించినవాడుగానీ, పరిశో్ధించినవాడుగాని, విచారించినవాడు గానీ ఎవడైనా వున్నాడా ? నాస్తికుల్ని దేహాత్మవాదులంటారు. అంటే వేదాంతులు చెప్పే ఆత్మ అనేది శరీరానికి భిన్నమైనది ఏదీ లేదని లోకాయతులు చెప్పారు. ఉపనిషత్తుల్లోనూ బ్రాహ్మణాల్లోనూ విభిన్న దేహవాదం అసురత్త్వంగా ప్రచారం చేసారు. అంటే లోకాయతుల దేహవాదం , అసురుల దేహవాదం , అభిన్నాలనే చెప్పాలి. తంత్రవాదుల దేహవాదం కూడా దీనితో అభిన్నంగానే కనిపిస్తుంది.ఆత్మ సిద్ధాంతం గురించి మైత్రాయణీ ఉపనిషత్తులో వుంది. ముందుగా దాన్ని తెలుసుకుందాం.దేవతలూ- రాక్షసులూ బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఇద్దరూ బ్రహ్మకు నమస్కారంచేసి – ఆత్మను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. దానిని గురించి చెబుతారా ? అని అడిగారు. ఆ మాటలు విన్న బ్రహ్మ కొంతకాలం ఆలోచించి తనలో తాను ఇట్లా అనుకున్నాడు. ఈ రాక్షసులు ఆత్మ కావాలని వచ్చారు. వీళ్ళకు ఆత్మను గురించి కాక దానికి వ్యతిరేకమైంది చెబుతాను అని అనుకొని అసురుల్ని పిలిచి వాళ్ళ వరకు ప్రత్యేకంగా  ఆత్మకు వ్యతిరేకమైంది చెప్పాడు. మూర్ఖులైన వాళ్ళు బ్రహ్మ చెప్పిన ఆత్మకువ్యతిరేకమైనదాన్నే  ఆత్మగా భావించి , దానిపై ఆధారపడి – ప్రయోజనకరము- శాశ్వితము- అయిన రక్షణను పోగొట్టుకొని అనేక ఇబ్బందులలో చిక్కుకొని జీవితాలను గడుపుతున్నారు. గారడీలోలాగానే – అసత్యమైనదాన్ని సత్యంగా భావించి ప్రచారం చేస్తున్నారు. వేదాల్లో చెప్పిందే సత్యం, దాన్నేవిజ్ఞులైనవాళ్ళు ఆచరిస్తారు, దాని ఆధారంగానే జీవిస్తారు. బ్రాహ్మణుడైనవాడెవడూ అవైదికమైనదాన్ని చదువరాదు.     ఇదే కథ ఛాందోగ్యోపనిషత్తు  లో కొంచం వివరంగా వుంది.ఇందులో ఇంద్ర – విరోచనుల కథ చూడటం అవసరం. ప్రజాపతి – హృదయాంశంలో వుండే ఆత్మ , పాపరహితం-  చావు పుట్టుకలు – ముసలితనం – ఆకలిదప్పులు లేనిది. అది సత్యకామాలు- సత్య సంకల్పాలూ కలది. దానినే వెదకాలి. దానినే తెలుసుకోవాలి. దాన్ని ఎరిగినవాడు సర్వలోకాలూ -సర్వకామాలూ పొందుతాడు“  అని అన్నాడు.                   ప్రజాపతి ఈ మాటల్ని దేవతలూ , అసురులూ ఇద్దరూ  కర్ణాకర్ణిగా  విన్నారు. ఏ ఆత్మ జ్ఞానం వల్ల సమస్త లోకాలయొక్కయు , సర్వ కామాల యొక్కయు ప్రాప్తి కలుగుతుందో ఆ ఆత్మను తెలుసుకోవాలనీ వాళ్ళిద్దరూ మనసుల్లో కోరుకున్నారు.             దేవతల తరఫున ఇంద్రుడు- అసురుల తరఫున విరోచనుడు ఆత్మను తెలుసుకోవాలని బయలుదేరారు. చేతుల్లో దర్భలు ధరించి ఇద్దరూ వొకరికి తెలియకుండా ఒకరు ప్రజాపతి దగ్గరకు వచ్చారు. ఇంద్ర విరోచను లిద్దరూ  32 సం. ప్రజాపతి ఆశ్రమంలో బ్రహ్మచర్యంతో వున్నారు. ఒకనాడు ప్రజాపతి వాళ్ళని చూసి ఏం కోరి మీరీ ఆశ్రమంలో ఇంత కాలం ఉన్నారు ?” అని అడిగాడు.ఆ మాటలకు వాళ్ళు భగవాన్ ! ఆత్మ పాప రహితమైందనీ , జనన మరణాలు లేనిదని , ఆకలి దప్పులు లేనిదని , సత్యకామాలూ సత్యసంకల్పాలూ కలదనీ , అది తప్పనిసరిగా తెలుసుకోదగ్గదని , దాన్ని తెలుసుకున్నవాడు  సర్వలోకాలూ, సర్వకామాలూ పొందగలడనీ మీరు చెప్పినట్లుగావిని , ఆ ఆత్మను తెలుసుకోవాలని వచ్చాం.    అని సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం విన్న ప్రజాపతి ఈ కళ్ళకు కనబడే పురుషుడే ఆత్మ అది అమృతం, అభయం, బ్రహ్మం అయివుంది అని వాళ్ళతో చెప్పాడు. ప్రజాపతి ఈ మాటలు విన్న ఇంద్ర విరోచనులిద్దరూ భగవాన్! ఈ నీళ్ళలోనూ, ఈ అద్దంలోనూ కనబడే ఆత్మ ఏది ?  అని అడిగారు. దానికి ప్రజాపతి నీటిలోనూ , అద్దంలోనూ కనబడే ఆత్మా కళ్ళకు కనబడే ఆత్మ ఒక్కటే అని చెప్పాడు. ఇంకా  ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ తరవాత ఆత్మను గూర్చి మీకు తెలియని విషయాలను నన్నడగండి అని  ఇంద్రవిరోచనులకు ప్రజాపతి చెప్పాడు. వాళ్ళిద్దరూ ప్రజాపతి చెప్పినట్లే నీటి పాత్రలో తమ్ముతాము చూచుకొన్నారు. మీకేమి కనబడింది ? అని ప్రజాపతి ఇద్దర్నీ అడిగాడు. ఇద్దరూ భగవాన్! మాకు మా పూర్ణ రూపం కనబడుతుంది. రోమముల నుండి గోళ్ళ వరకు మా ప్రతిరూపం మా ఛాయ కనబడుతుంది అని సమాధానం చెప్పారు. ప్రజాపతి మళ్ళా వాళ్ళను చూచి మీరు బాగా అలంకరించుకొని , మంచి బట్టలు ధరించి బాగా శుద్ధి చేసుకొని , ఇంకోసారి నీటిపాత్రలో చూడండి అని అన్నాడు. ఇంద్ర విరోచనులిద్దరూ అట్లాగే చేశారు. మీరేమి చూస్తున్నారు ? ” అని ప్రజాపతి ఇద్దర్నీ ప్రశ్నించాడు. ఇద్దరూ - భగవాన్! మేమెట్లా అలంకరించుకొన్నామో , మంచి బట్టలు ధరించి వున్నామో , శుద్ధి చేసుకొని వున్నామో అట్లాగే మా ప్రతిబింబాలున్నాయి అని ప్రజాపతికి సమాధానం చెప్పారు.  ఆ సమాధానం విన్న ప్రజాపతి ఇదే ఆత్మ! అమృతం , అభయం, బ్రహ్మం అని వాళ్ళకు చెప్పాడు. ప్రజాపతి చెప్పిన ఆ మాటలు విని ఇద్దరూ శాంత హృదయులై వెళ్లిపోయారు.   ఇట్లా శాంతహృదయులై వెళుతున్న ఇంద్ర, విరోచనులను చూచి ప్రజాపతి వీళ్ళిద్దరూ ఆత్మను పొందకయే , తెలిసికొనకయే వెళుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవడు ఈ దేహమే ఆత్మ అదో ఉపనిషత్తుకు అనుయాయి అవుతాడో వాడు పరాజితుడవుతాడు  అని తనలో తాను అనుకున్నాడు. విరోచనుడు శాంతహృదయంతో రాక్షసుల్ని సమీపించి శరీరాన్ని ప్రకాశవంతంగా , సుందరంగా అలంకరించుకోవడంలోనే విరోచనుని చిత్తం మునిగిపోయింది. అతడు –“ ఈ దేహం ఆత్మ   - అని అసురులకు ఉపదేశించాడు.   ఈ దేహమే  ఆత్మ . దీనినే పూజించాలి; దీనికే సేవలు చేయాలి. ఇట్లా చేస్తే మనుష్యుడు ఈ లోకాన్నీ, పరలోకాన్నీ పొందుతాడు అని విరోచనుడు అసురులకు బోధించాడు.ఇక ఇంద్రుడు దేవతల దగ్గరికి పోక ముందే అతనికి భయం వేసింది. ప్రజాపతి ఉపదేశం వల్ల అతడాత్మయొక్క వాస్తవిక రూపాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఇట్లా ఆలోచించాడు. నీటిలో కనబడ్డ నీడ  శరీరం బాగా అలంకరించుకొంటే అది కూడా అలంకరింపబడుతుంది. ..శరీరం నశిస్తే ప్రతిబింబం నశిస్తుంది. కాబట్టి ప్రతిబింబం ఆత్మ ఎట్లా అవుతుంది ? అని ఆలోచించి మరలా ప్రజాపతి వద్దకు పోయి అడిగాడు. ఇంద్రా! నీవు బాగా తెలుసుకున్నావు. ఆత్మను గురించి నేను నీకు మరలా ఉపదేశిస్తా ! నీవు ఇంకా 32 సం|| లు బ్రహ్మచర్యంతో నా ఆశ్రమంలో వుండాలి  అన్నాడు. ఇంద్రుడు సరే నన్నాడు. ప్రజాపతి ఇంద్రుడికి వివిధ మార్గాల ద్వారా ఆత్మను గురించి చెప్పినట్లు తక్కిన భాగమంతా సాగింది.దీన్నిబట్టి చూసినా అత్మ అనేది ప్రత్యేకంగా శరీరానికి భిన్నంగా వుందని లోకాయతులు చెప్తున్నట్లు లేదు. అసురవాదంగా చెప్పేదంతా లోకాయత సిద్ధాంతమే.

—–భౌతికవాద, చార్వాక, లోకాయత తత్త్వశాస్త్ర ప్రచారకునిగా వుంటూ ది.18-4-2007న మరణించిన  ప్రముఖ భౌతికవాది, నాస్తికోద్యమ నాయకుడు  బి.రామకృష్ణ గారు రచించిన చార్వాకం గ్రంథం నుండి.ఉపాధ్యాయ సౌజన్యంతో.